Mr and Mrs Mahi: ‘మెథడ్ డ్రస్సింగ్’తో.. మాయ చేస్తున్న జాన్వీ!

సినిమా ప్రమోషన్లలో అందాల తారలు తమ వ్యక్తిగత జీవితం, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకోవడం మామూలే! అయితే ఈమధ్య జాన్వీ ఈ కబుర్లతో పాటు తన డ్రస్సింగ్‌తోనూ వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం.. తన సినిమా థీమ్‌కు తగినట్లుగా డ్రస్‌ చేసుకోవడమే!

Updated : 31 May 2024 21:21 IST

(Photos: Instagram)

సినిమా ప్రమోషన్లలో అందాల తారలు తమ వ్యక్తిగత జీవితం, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకోవడం మామూలే! అయితే ఈమధ్య జాన్వీ ఈ కబుర్లతో పాటు తన డ్రస్సింగ్‌తోనూ వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం.. తన సినిమా థీమ్‌కు తగినట్లుగా డ్రస్‌ చేసుకోవడమే! ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్ర ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఈ భామ.. తన సినిమా థీమ్‌కు తగినట్లుగా దుస్తుల్ని ఎంచుకుంటూ అందరినీ కట్టిపడేస్తోంది. దీంతో ‘మెథడ్‌ డ్రస్సింగ్‌’ ట్రెండ్‌ మరోసారి తెరమీదకొచ్చింది. మరి, ఈ సినిమా విడుదల సందర్భంగా.. జాన్వీ ఎంచుకున్న ‘మెథడ్‌ డ్రస్సింగ్‌’ అవుట్‌ఫిట్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

వేడుక/ఈవెంట్‌ని బట్టి దుస్తుల్ని ఎంచుకోవడం మనకు కొత్త కాదు. ఈ క్రమంలోనే థీమ్‌ను బట్టి ఆయా దుస్తుల్ని కస్టమైజ్‌ చేయించుకోవడమూ చాలామందికి అలవాటు. ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్‌ తార జాన్వీ కపూర్‌ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ క్రికెట్‌ నేపథ్యమున్న కథ. ఇందుకు అనుగుణంగానే క్రికెట్‌ థీమ్‌తో కూడిన ట్రెడిషనల్‌, ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని ఎంచుకుంటూ అందరినీ కట్టిపడేస్తోందీ కపూర్‌ బ్యూటీ.

ఏంటీ ‘మెథడ్‌ డ్రస్సింగ్’?

గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న జాన్వీ.. తాను పాల్గొనే ప్రతి ఈవెంట్‌కీ ఈ చిత్ర థీమ్‌కు తగినట్లుగా దుస్తుల్ని కస్టమైజ్‌ చేయించుకుంటోంది. ఇలా నటీనటులు తమ చిత్రాల్లోని కీలక అంశాలు, సినిమా నేపథ్యం, అందులోని తమ పాత్రలకు అనుగుణంగా దుస్తుల్ని ఎంచుకోవడాన్ని ‘మెథడ్‌ డ్రస్సింగ్‌’ అంటారు. జాన్వీ కూడా ఈ ఫ్యాషన్‌ ట్రెండ్‌తోనే తన ఫ్యాషన్‌ సెన్స్‌ని మరోసారి చాటుకుంటోంది. వేడుకకు తగినట్లుగా క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌, మైదానం, తన పాత్ర పేరు.. వంటివి ప్రతిబింబించేలా దుస్తుల్ని డిజైన్‌ చేయించుకొని మెరిసిపోయింది. ఇలా ఆమె ధరించిన ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

ఈ ఫ్యాషన్లతో మెరిసింది!

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రంలో జాన్వీ పాత్ర పేరు మహిమ. ఈ పేరును, తన జెర్సీ నంబర్‌ 6ను ప్రతిబింబించేలా బ్లూ కలర్‌ బేబీ టీషర్ట్‌ను ఓ క్రికెట్‌ మ్యాచ్‌ కోసం ఎంచుకుందీ బాలీవుడ్‌ బ్యూటీ. కార్గో జీన్స్‌ని దీనికి జత చేసిన ఈ భామ.. ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతూనే.. అటు పరోక్షంగా తన చిత్రాన్నీ ప్రమోట్‌ చేసుకుంది.


క్రికెట్‌ బాల్స్ డిజైన్‌తో కూడిన స్ట్రిప్‌ను వెనుక వైపు తన డ్రస్‌కు అనుసంధానించి మరో ప్రమోషన్‌లో మెరిసిపోయిందీ కపూర్‌ బ్యూటీ. ఎరుపు రంగు లెదర్‌ బాడీకాన్‌ డ్రస్‌కు ఈ క్రికెట్‌ బాల్‌ థీమ్‌ స్ట్రిప్‌ను జత చేశారు డిజైనర్లు. ఈ డ్రస్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ సినిమాలో తన జెర్సీ నంబర్‌ 6ను పర్పుల్‌ కలర్‌ క్రాప్‌టాప్‌పై డిజైన్‌ చేయించుకొని ఫొటోలకు పోజిచ్చింది జాన్వీ. దీనికి జతగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్ట్రైప్‌డ్‌ ఫ్లోర్‌ లెంత్ స్కర్ట్‌ను ఎంచుకొని స్టైల్‌ దివాలా కనిపించింది.


ఇలా మోడ్రన్‌ దుస్తులతోనే కాదు.. చీరతోనూ తన మెథడ్‌ డ్రస్సింగ్‌ను చాటుకుందీ చక్కనమ్మ. మెరూన్‌-బ్లూ రంగులు కలగలిసిన షిఫాన్‌ ప్లెయిన్‌ శారీకి స్లీవ్‌లెస్‌ షిమ్మరీ క్రాప్‌టాప్‌ను జత చేసింది. ఇక ఈ బ్లౌజ్‌ వెనక వైపు ‘మహీ-6’ అని ప్రత్యేకంగా రాయించుకుంది.


ఇక మరో సందర్భంలో వారణాసిలో ‘గంగా హారతి’కి హాజరైన జాన్వీ.. పూర్తి ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసిపోయింది. ఈ క్రమంలో పౌడర్‌ బ్లూ కలర్‌ చీరను ఎంచుకున్న ఆమె.. ఈ శారీ కొంగుపై ఏకంగా క్రికెట్ మైదానం డిజైన్లో కస్టమైజ్‌ చేయించుకోవడం విశేషం! ఈ క్రమంలో బన్ హెయిర్‌స్టైల్ వేసి, మల్లెపూలు పెట్టుకుని ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది.


తెలుపు రంగు నీ-లెంత్‌ బాడీకాన్‌ డ్రస్‌పై.. ‘బ్యాటింగ్‌ చేయడానికి రడీగా ఉన్న క్రికెటర్‌ బొమ్మ’ను షిమ్మరీ క్లాత్‌తో ప్రత్యేకంగా ప్యాచ్‌ వేయించుకొని ఫొటోలకు పోజిచ్చిందీ అందాల తార.


క్రికెట్‌ బాల్స్‌ని బోర్డర్ పైనా డిజైన్‌ చేయించుకోవచ్చని నిరూపించిందీ మిసెస్‌ మహీ. తెలుపు-ఎరుపు రంగులతో కూడిన లైన్‌-థీమ్‌డ్‌ శారీని ఎంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. బోర్డర్‌లో సమాన దూరాల్లో క్రికెట్‌ బాల్స్‌ షేప్‌ వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంది. ఈ చీరతోనూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది జాన్వీ.


గతంలో క్రికెటర్లు ధరించే జెర్సీపై మూడు రంగుల కాలర్‌ ఉండేది. అదే థీమ్‌ను తన చిత్ర ప్రమోషనల్‌ ఈవెంట్‌ కోసం ఎంచుకుంది జాన్వీ. నీలం, తెలుపు, ఎరుపు మూడు రంగులతో కూడిన వైట్‌ మినీ క్రాప్‌ టాప్‌కు.. ఎరుపు రంగు క్రికెట్‌ బాల్స్ ఆకృతిలో అక్కడక్కడా డిజైన్‌ చేసిన వైట్‌ స్కర్ట్‌ను జత చేసిందీ బాలీవుడ్‌ దివా. అలాగే వేవీ హెయిర్‌ స్టైల్‌, మినిమల్‌ మేకప్‌తో మెరుపులు మెరిపించిందీ చిన్నది.


మరో ప్రమోషనల్‌ ఈవెంట్‌ కోసం పంజాబీ కుడీలా ముస్తాబైన జాన్వీ.. కలర్‌ఫుల్‌ సల్వార్‌-కమీజ్‌ను ఎంచుకొని.. తనదైన మెథడ్‌ డ్రస్సింగ్‌తో మెరిసిపోయింది. సల్వార్‌కు వెనక వైపు క్రికెట్‌ బాల్‌ తరహాలో డిజైన్‌ చేసిన టాజిల్స్‌ను అనుసంధానించిన ఈ భామ.. కమీజ్‌పై తన పాత్ర పేరు (మహిమ) ప్రత్యేకంగా రాయించుకుంది.


ఇలా తన డ్రస్సింగ్‌తోనే కాదు.. క్రికెట్‌ థీమ్‌డ్‌ జ్యుయలరీతోనూ సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేసిందీ బాలీవుడ్‌ బేబ్‌. ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో తెలుపు-బ్లూ రంగులు కలగలిసిన లెహెంగాను ఎంచుకున్న ఆమె.. దానికి జతగా ముత్యాల చోకర్‌ నెక్లెస్‌ను ధరించింది. దీనిపై క్రికెట్‌ బ్యాట్స్‌ రెండూ క్రిస్‌క్రాస్‌గా, ఆ మధ్యలో క్రికెట్‌ బాల్‌ ఉన్నట్లుగా డిజైన్‌ చేసిన పెండెంట్‌ను జత చేశారు. ఈ లుక్‌లో దేవకన్యలా దర్శనమిచ్చింది జాన్వీ.


ఇక తాజాగా మరో ప్రమోషనల్‌ ఈవెంట్ కోసం ప్రముఖ డిజైనర్‌ అర్పితా మెహతా డిజైన్‌ చేసిన ఐవరీ కలర్‌ ఫ్లోరల్‌ లెహెంగాను ఎంచుకుందీ కపూర్‌ బ్యూటీ. ఇక తన డ్రస్‌పై మ్యాచ్‌ చేసిన నెక్లెస్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పచ్చు. ఇందుకు కారణం.. క్రికెట్‌ థీమ్‌తో దాన్ని డిజైన్‌ చేయడమే! క్రికెట్‌ బాల్‌, బ్యాట్‌, హెల్మెట్‌, గ్లోవ్స్‌.. ఇలా నెక్లెస్‌పై వచ్చిన గుండ్రటి ఆకృతుల్లో వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి అమర్చారు. ఇలా మెథడ్‌ డ్రస్సింగ్‌తోనే కాదు.. మెథడ్‌ జ్యుయలరీతోనూ మాయ చేస్తోందీ అందాల తార.

ఇలా జాన్వీనే కాదు.. గతంలో ఆలియా భట్‌ (గంగూబాయి కథియావాడి), విద్యాబాలన్‌ (డర్టీ పిక్చర్‌)తో పాటు పలువురు హాలీవుడ్‌ తారలూ ‘మెథడ్‌ డ్రస్సింగ్‌’ ట్రెండ్‌తో ఆకట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్