Radhika Merchant: పెళ్లి గౌనుపై.. ఇష్టసఖుడి ప్రేమలేఖ!

తమ అభిరుచులకు తగినట్లుగా దుస్తుల్ని కస్టమైజ్‌ చేయించుకోవడం ఈ కాలపు ఫ్యాషన్‌ ట్రెండ్‌. ఇందులో భాగంగానే తమ ప్రేమకథలు, తొలి వెకేషన్‌, ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు.. వంటివన్నీ టెక్ట్స్‌, ఫొటోల రూపంలో దుస్తులపై డిజైన్‌ చేయించుకుంటున్నారు అమ్మాయిలు. త్వరలోనే అంబానీ ఇంట కోడలిగా అడుగుపెట్టబోయే రాధికా మర్చంట్‌ కూడా ఇదే ఫ్యాషన్‌ ట్రెండ్‌ ఫాలో అయింది.

Published : 16 Jun 2024 12:51 IST

(Photos: Instagram)

తమ అభిరుచులకు తగినట్లుగా దుస్తుల్ని కస్టమైజ్‌ చేయించుకోవడం ఈ కాలపు ఫ్యాషన్‌ ట్రెండ్‌. ఇందులో భాగంగానే తమ ప్రేమకథలు, తొలి వెకేషన్‌, ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు.. వంటివన్నీ టెక్ట్స్‌, ఫొటోల రూపంలో దుస్తులపై డిజైన్‌ చేయించుకుంటున్నారు అమ్మాయిలు. త్వరలోనే అంబానీ ఇంట కోడలిగా అడుగుపెట్టబోయే రాధికా మర్చంట్‌ కూడా ఇదే ఫ్యాషన్‌ ట్రెండ్‌ ఫాలో అయింది. గతంలో అనంత్‌ తనకు రాసిన ఓ అందమైన ప్రేమలేఖను ముద్రించి డిజైన్‌ చేసిన గౌన్‌ను తన రెండో ప్రి-వెడ్డింగ్‌ వేడుకల కోసం ఎంచుకుందామె. ఇటీవలే నాలుగు రోజులు పాటు విలాసవంతమైన నౌకలో నిర్వహించిన ఈ ముందస్తు పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వేడుకలో రాధిక ధరించిన ఈ లవ్‌ లెటర్‌ గౌన్‌ ప్రస్తుతం ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలిచింది. ఆమె ఫొటోలూ సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.


లగ్జరీగా.. క్రూజ్‌ పార్టీ!

రాధికా మర్చంట్‌.. అంబానీకి కాబోయే కోడలిగానే కాదు, ఫ్యాషనిస్టాగానూ ఆమెకు పేరుంది. సందర్భాన్ని బట్టి దుస్తుల్ని కస్టమైజ్‌ చేయించుకోవడంలో ఆమెకు ఆమే సాటి! ఇందుకు తన మొదటి ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లో ఆమె ఎంచుకున్న విభిన్న అవుట్‌ఫిట్సే నిదర్శనం. ఇక ఇటీవలే నాలుగు రోజుల పాటు రాధిక-అనంత్‌ల రెండో ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌ వరకు ఓ విలాసవంతమైన నౌకలో సుమారు 4,380 కిలోమీటర్లు ప్రయాణిస్తూ లగ్జరీగా ఈ వేడుకలు నిర్వహించారు. మొదటి ప్రి-వెడ్డింగ్ వేడుకలకు భిన్నంగా పూర్తి స్థాయిలో వెస్టర్న్‌ స్టైల్‌లో ఈ ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఇందులో మన దేశానికి చెందిన ప్రముఖులే కాదు.. అంతర్జాతీయ స్టార్స్‌ పాల్గొని, తమ డ్యాషింగ్‌ పెర్ఫార్మెన్స్‌తో సందడి చేశారు.


‘లవ్‌ లెటర్‌’ ఫ్యాషన్!

ఇక ఈ వేడుకల్లో ఆయా థీమ్‌లకు తగినట్లుగా ఇరు కుటుంబ సభ్యులు, అతిథులు దుస్తుల్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా కాబోయే వధువు రాధిక ధరించిన అవుట్‌ఫిట్స్ ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచుకున్నాయి. ఈ క్రమంలోనే ‘స్టారీ నైట్‌ థీమ్‌’తో నిర్వహించిన తొలి ఈవెంట్‌ కోసం తెలుపు-నలుపు రంగులతో కూడిన ఓ అందమైన ఆఫ్‌-షోల్డర్‌ గౌన్‌ని ఎంచుకుంది రాధిక. దీనికి అనుసంధానమై ఉన్న పొడవాటి వెయిల్‌పై ముద్రించిన ప్రేమలేఖ ఈ గౌన్కే హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు. రాధిక 22 వ పుట్టినరోజుకు కానుకివ్వడానికి అనంత్‌ రాసిన ప్రేమలేఖ ఇది. ఇలా తన ఇష్టసఖుడు తన కోసం రాసిన ఈ లవ్ లెటర్‌ని గౌన్‌పై రాతపూర్వకంగా అందంగా డిజైన్‌ చేయించుకుందీ కాబోయే పెళ్లికూతురు.

‘ఈ సుదీర్ఘ ప్రేమలేఖతోనే అనంత్‌ తన మనసులో నా స్థానమేంటో చెప్పాడు. మా అమితమైన ప్రేమకు చిహ్నంగా దీన్ని రాబోయే తరాల వారికి చూపించాలనుకుంటున్నా. నా పిల్లలకు, వాళ్ల పిల్లలకూ దీన్ని చూపిస్తా..’నంటూ మురిసిపోతోంది రాధిక. లండన్‌కు చెందిన ప్రముఖ డిజైనర్‌ రోబర్డ్‌ వున్‌ రాధిక అభిరుచుల మేరకు ఈ గౌన్‌ని రూపొందించారు. ఇక దీన్ని ధరించిన ఆమె ప్రిన్సెస్‌లా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ గౌన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


‘టోగా’లో స్టైలిష్‌గా!

ఇక రెండో రోజు వేడుకల్లో భాగంగా ‘రోమన్‌ థీమ్‌డ్‌ టోగా పార్టీ’ ఏర్పాటుచేశారు. ఇలా థీమ్‌కు తగినట్లుగా తెలుపు-గోల్డ్‌ రంగులు కలగలిసిన ప్రత్యేకమైన టోగాను కస్టమైజ్‌ చేయించుకుంది రాధిక. త్రీడీ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్‌ చేసిన ప్రత్యేకమైన బ్రెస్ట్ ప్లేట్‌ ఈ డ్రస్‌కే హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు. గ్రేస్‌ లింగ్‌ అనే న్యూయార్క్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ రూపొందించిన ఈ గౌన్‌ తయారీకి 30 మంది కళాకారులు శ్రమించారట! ఇలా ఈ అటైర్‌ కూడా రాధిక అందాన్ని ద్విగుణీకృతం చేసిందని చెప్పచ్చు.


‘హెడ్‌ ఫ్యాసినేటర్‌’తో మ్యాజిక్!

రాధిక-అనంత్‌ ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా ‘Masquerade Ball Magic’ థీమ్‌తో మూడో రోజు సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఇందులో వధూవరులతో పాటు అతిథులూ కళ్లకు మాస్కులు ధరించి.. సందడి చేశారు. ఈ వేడుక కోసం ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘వెర్సేస్‌’ రూపొందించిన ఓ స్టైలిష్‌ గౌన్‌ ధరించింది రాధిక. బ్లూ షేడ్స్‌లో రూపొందించిన ఈ అటైర్‌కు జతగా వజ్రాలు పొదిగిన నీలం రంగు ఓపల్‌ నెక్లెస్‌ ధరించి మెరిసిపోయిందామె. పోనీ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌కి హంగులద్దిన ఈ ముద్దుగుమ్మ.. తలపై బ్లూ కలర్‌ నెట్‌ ట్రాన్స్‌పరెంట్‌ ఫ్యాసినేటర్‌ ధరించి అచ్చం యువరాణిలా కనిపించింది.


‘వింటేజ్‌’ మెరుపుల్!

తమ ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా వింటేజ్‌ థీమ్‌కీ చోటిచ్చారు రాధిక-అనంత్‌. ఈ క్రమంలోనే నాలుగో రోజు నిర్వహించిన వేడుకల్లో వధూవరులతో పాటు అతిథులూ విభిన్న వింటేజ్‌ దుస్తుల్లో మెరిసి మురిసిపోయారు. ఈ వేడుక కోసం ఫ్రెంచ్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘Yves Saint Laurent’ డిజైన్‌ చేసిన ఎరుపు రంగు కాక్‌టెయిల్‌ డ్రస్‌ను ఎంచుకుంది రాధిక. పోనీ హెయిర్‌స్టైల్‌, వింటేజ్‌ మేకప్‌తో మెరుపులు మెరిపించిన ఈ భామ.. చిన్న క్లచ్‌ బ్యాగ్‌, నలుపు రంగు గాగుల్స్‌తో తన లుక్‌ని పూర్తి చేసింది. ఇలా 65 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వింటేజ్‌ గౌన్‌ను ధరించి మరోసారి తన ఫ్యాషన్‌ సెన్స్‌ని చాటుకుందీ క్యూట్‌ బ్రైడ్.

ఇవే కాదు.. నాలుగు రోజులు పాటు క్రూజ్‌లో నిర్వహించిన చిన్న చిన్న వేడుకలు, పార్టీల్లోనూ స్టైలిష్‌గా మెరిసిపోయిందీ ఫ్యాషనిస్టా.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్