Published : 02/02/2023 20:17 IST

Baking Tips: ఇవి గుర్తుపెట్టుకోండి!

కేక్స్‌, కుకీస్‌, బ్రెడ్‌, పఫ్స్‌.. ఇలాంటి బేకింగ్‌ ఐటమ్స్‌ని ఇంట్లో తయారుచేసుకున్నప్పుడు.. చాలామందికి బయటి మాదిరిగా పర్‌ఫెక్ట్‌గా రావు. ఇందుకు వీటిని తయారుచేసే క్రమంలో మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే కారణమంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి వంటకాల్ని తయారుచేసేటప్పుడు కొన్ని చిట్కాల్ని దృష్టిలో ఉంచుకుంటే.. పదార్థం పర్‌ఫెక్ట్‌గా రావడమే కాదు.. దాని రుచీ మరింత పెరుగుతుందంటున్నారు. ఇంతకీ ఏంటా టిప్స్‌? తెలుసుకుందాం రండి..

ఒక వంటకం పర్‌ఫెక్ట్‌గా కుదరాలంటే.. అందులో వాడే పదార్థాల కొలతలు చాలా ముఖ్యం. బేకింగ్‌ ఐటమ్స్‌కూ ఇది వర్తిస్తుంది. ఇక ఇందుకోసం ఆయా పదార్థాల్ని కొలిచే కప్స్‌, స్పూన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి వాటిని వాడడం మంచిది. వీటికి బదులుగా డిజిటల్ వెయింగ్ స్కేల్‌ను ఉపయోగిస్తే మరీ మంచిది.

అలాగే తడి, పొడి పదార్థాల్ని కొలవడానికి వేర్వేరు కప్స్‌/స్పూన్స్‌ ఉపయోగించాలి. అప్పుడే పదార్థం కోసం కచ్చితమైన కొలతల్ని తీసుకోగలుగుతాం.

వంటకం గురించి పుస్తకంలో చదివినా, యూట్యూబ్‌లో చూసి చేసినా.. దానికి సంబంధించిన తయారీ విధానం అందులో చెప్పినట్లుగానే కచ్చితంగా పాటించాలి. అలాకాకుండా మధ్యమధ్యలో మన సొంత ప్రయోగాలు చేస్తే వంటకం పర్‌ఫెక్ట్‌గా కుదరదు.

కొంతమంది పొడి పదార్థాల్ని కొలిచేటప్పుడు.. కప్పు/స్పూన్‌ నిండుగా తీసుకుంటారు. తడి పదార్థాల్ని ఇలా కొలవలేం. కాబట్టి ఏ పదార్థమైనా స్పూన్‌/కప్పు అంచుల వరకు కొలిచి తీసుకుంటే వంటకం పర్‌ఫెక్ట్‌గా వస్తుంది. లేదంటే కొలతల్లో తేడా వచ్చి రెసిపీ సరిగ్గా కుదరదు.

కొంతమంది పొడి పదార్థాల్ని జల్లెడ పట్టకుండానే వాడేస్తుంటారు. కానీ దానివల్ల కూడా వంటకం కుదరకపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అందుకే జల్లెడ పట్టే స్టెప్‌ను విస్మరించకూడదంటున్నారు.

బేకింగ్‌ వంటకాల్లో తేనె, నెయ్యి, మేపుల్‌ సిరప్‌.. వంటి చిక్కటి పదార్థాల్ని వాడతాం. అయితే వాటిని కొలిచి తీసుకునే క్రమంలో.. అవి ఆయా కప్పులు/స్పూన్ల అంచులకు అంటుకుపోతాయి. తద్వారా కొలత సరిగ్గా రాదు. ఈ సమస్య లేకుండా ఉండాలంటే.. ముందు కొలతల స్పూన్లు/కప్పుల లోపలి భాగంలో నాన్‌స్టిక్‌ కుకింగ్‌ స్ప్రేను స్ప్రే చేస్తే సరిపోతుంది.

బేకింగ్‌ చేసే వంటకం మృదువుగా రావాలన్న ఉద్దేశంతో.. పిండి మిశ్రమాన్ని పదే పదే ఎక్కువసేపు కలుపుతుంటారు. అయితే దీనివల్ల అందులోని గ్లూటెన్‌ శాతం పెరిగి.. కుకీస్‌ వంటి వంటకాలు గట్టిగా వస్తాయి. కాబట్టి పిండి కలిపేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి.

తడి, పొడి పదార్థాల్ని కలిపేటప్పుడు పిండి మిశ్రమంలో ముద్దలు ఏర్పడడం సహజం. అవి ఏర్పడకుండా ఉండాలంటే.. పొడి పిండిలో తడి పదార్థాల్ని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతుండాలి. తద్వారా కేక్స్, కప్‌ కేక్స్‌.. వంటివి మృదువుగా వస్తాయి.

వంటకాన్ని బట్టి అవెన్‌ను పది నిమిషాల ముందే ప్రి-హీట్‌ చేసుకోవడం ముఖ్యం. అలాగే ఉష్ణోగ్రత, రెసిపీ సమయాన్ని కరక్ట్‌గా సెట్‌ చేసుకున్నాకే పదార్థాన్ని అవెన్‌లో ఉంచాలి. ఇక ప్రతి రెసిపీని తయారుచేశాక, తిరిగి ఉపయోగించుకునే ముందు అవెన్‌ను శుభ్రం చేయడం వల్ల దాన్నుంచి దుర్వాసనలు రాకుండా.. అవి మనం తయారుచేస్తోన్న వంటకంపై ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్తపడచ్చు.

బేకింగ్‌ వంటకాల్లో చాలావరకు మైదా పిండిని ఉపయోగిస్తుంటారు. అయితే కొంతమంది మైదాకు బదులుగా గోధుమ పిండిని వాడుతుంటారు. దీనివల్ల వంటకం రుచి, మృదుత్వం.. రెండూ తగ్గిపోతాయి.

కొన్నిసార్లు బేకింగ్‌ వంటకంలో వాడే అన్ని పదార్థాలూ అందుబాటులో ఉండకపోవచ్చు. దాంతో వాటిని వదిలేసి వంటకం తయారుచేస్తుంటాం. దీనివల్ల కూడా వంటకం కచ్చితంగా కుదరదు. అందుకే ఆయా వంటకాలకు సంబంధించిన ముడి పదార్థాలన్నీ సమకూర్చుకున్నాకే తయారీ ప్రారంభించడం మంచిది.

ఇక బేకింగ్‌ పదార్థాల తయారీ పూర్తయ్యాక.. దాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు రుచి చూపించి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి. తద్వారా బేకింగ్‌లో భాగంగా ఈసారి చేసిన పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తపడచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని