పెర్‌ఫ్యూమ్ వాడుతున్నారా? 

పెర్‌ఫ్యూమ్ లేకుండా బయట అడుగుపెట్టే వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదు. అందుకే మనసు దోచే రకరకాల పెర్‌ఫ్యూమ్స్ అమ్మాయిల బ్యాగుల్లో ఒదిగిపోతున్నాయి. అయితే.. పెర్‌ఫ్యూమ్‌ని ఎంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలుసా? 

Updated : 05 Nov 2021 20:36 IST

పెర్‌ఫ్యూమ్ లేకుండా బయట అడుగుపెట్టే వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదు. అందుకే మనసు దోచే రకరకాల పెర్‌ఫ్యూమ్స్ అమ్మాయిల బ్యాగుల్లో ఒదిగిపోతున్నాయి. అయితే.. పెర్‌ఫ్యూమ్‌ని ఎంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలుసా? పెర్‌ఫ్యూమ్ వేసుకోవడమే కాదు.. దాన్ని ఎంచుకోవడం కూడా ఒక నైపుణ్యమే. మరి మన జీవితంలో అంతలా మిళితమైన పెర్‌ఫ్యూమ్‌ను శరీరతత్వానికి సరిపోయేలా ఎలా ఎంచుకోవాలి? ఏ సీజన్‌లో ఎలాంటిది ఎంచుకుంటే బాగుంటుంది? మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం..

పెరిగే ఆత్మవిశ్వాసం!

పెర్‌ఫ్యూమ్స్ లేతరంగులో ఉండి.. చక్కటి పరిమళాలు వెదజల్లుతుంటాయి. ఆహ్లాదకరమైన భావనలతో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. పెర్‌ఫ్యూమ్‌లో వివిధ రకాల పరిమళాలు ఉంటాయి. ఆయా సువాసనలను బట్టి వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎంచుకునే పరిమళం మనసుకి ప్రశాంతతను చేకూర్చేలా, దాని గాఢత ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చూసుకోవాలి. అలా అయితేనే మనం వేసుకునే పెర్‌ఫ్యూమ్ వల్ల ప్రయోజనం ఉంటుంది.

సీజన్‌ను బట్టి..

మనం వాడే పెర్‌ఫ్యూమ్ సీజన్‌ను బట్టి మార్చాలి. వేసవికాలంలో చర్మం ఎక్కువ తేమగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో కంటే వేసవిలోనే పెర్‌ఫ్యూమ్ వాసన ఎక్కువ సమయం ఉంటుంది. ఎందుకంటే తేమ ఆ వాసనను పోగొట్టకుండా కాపాడుతుంది. కాబట్టి తక్కువ గాఢత ఉండే పెర్‌ఫ్యూమ్‌ను వేసవిలో, ఎక్కువ గాఢత ఉండే వాటిని చలికాలంలో ఎంచుకుంటే మంచిది.

ఓసారి ట్రై చేయండి...

ఇంకో విషయం ఏంటంటే.. కొనే ముందే పెర్‌ఫ్యూమ్‌ని ఒకసారి ట్రై చేయడం మంచిది. ముందు మీరు అన్ని రకాల పెర్‌ఫ్యూమ్స్ గురించి తెలుసుకోండి. అవసరమైతే నోట్ చేసుకోండి. కొనడానికి వెళ్లినప్పుడు శాంపిల్‌కి కొంచెం మీ చేతులపై స్ప్రే చేసుకొని దాని వాసన చూడండి. శరీరం నుంచి వెలువడే సహజ నూనెలతో కలిస్తే దాని వాసన ఏమైనా మారుతుందా లేదా అనేది గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం నుంచి వెలువడే సహజ నూనెలతో పెర్‌ఫ్యూమ్ కలిస్తే దాని వాసన మారకపోతే అది మంచిదని భావించవచ్చు. కాబట్టి పైపైన వాసన చూడటం కంటే కొంచెం చేతులపై స్ప్రే చేసుకుంటే పెర్‌ఫ్యూమ్ మంచిదో కాదో మీకే తెలిసిపోతుంది.

ఎక్కువ సమయం సువాసనాభరితం

పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం అనేది రోజూవారీ ప్రణాళికలో ఒక భాగమే. కానీ ఎక్కువ సమయం సువాసన వెదజల్లే పెర్‌ఫ్యూమ్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇలా ఎంచుకోవడం కూడా ఒక నైపుణ్యమే.

శరీర తత్వానికి దగ్గరగా..

మీరు ఎంచుకునే పెర్‌ఫ్యూమ్ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలి. దాని వాసన మీ శరీర తత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇలా అయితే.. పెర్‌ఫ్యూమ్ ఎక్కువ సమయం పనిచేయడమే కాకుండా మీ శరీరం నుంచి ఎలాంటి చెమట వాసన రాకుండా కాపాడుతుంది.

ఇతరులకు ఇబ్బంది కలగకుండా..

ఎక్కువ పెర్‌ఫ్యూమ్ వేసుకుంటే దాని వాసన ఎక్కువసేపు ఉంటుంది.. అని చాలా మంది అనుకుంటారు. కానీ దాని వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పెర్‌ఫ్యూమ్ ఉపయోగించాలి.

తేమగా ఉన్నప్పుడే..

స్నానం చేసిన తర్వాత శరీరం తేమగా ఉన్నప్పుడే పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే దాని వాసనను శరీరం బాగా పీల్చుకుంటుంది. మనం స్నానానికి ఉపయోగించే సబ్బు వాసన.. పెర్‌ఫ్యూమ్ వాసన కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే పెర్‌ఫ్యూమ్ ఎక్కువ సువాసనలు వెదజల్లుతుంది. అలాగే శరీరానికి రాసుకునే మాయిశ్చరైజర్, పెట్రోలియం జెల్లీలు ఎలాంటి వాసన లేకుండా ఉన్నవైతే మంచిది.

భద్రపరచడమూ ముఖ్యమే!

సరైన పెర్‌ఫ్యూమ్‌ని ఎంచుకోవడం మాత్రమే కాదు.. దాన్ని సవ్యంగా భద్రపరచడమూ అంతే ముఖ్యం. అందులో ఉండే సుగంధ తైలాల వల్ల.. దానిపై నేరుగా సూర్యరశ్మి పడితే దాని వాసన మారుతుంది. కాబట్టి పెర్‌ఫ్యూమ్‌ని పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే అది సువాసనను కోల్పోకుండా ఉంటుంది.

మరి ఇవండీ... పెర్‌ఫ్యూమ్ కబుర్లు! అన్ని రకాలుగా అనువైన పెర్‌ఫ్యూమ్ ఎంచుకుని ఆహ్లాదాన్ని సొంతం చేసుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్