Published : 19/10/2022 14:12 IST

పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా?

గతంతో పోలిస్తే నేటి తరం దంపతులు సంతానలేమి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దీనికి పలు ఆరోగ్య సమస్యలతో పాటు జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు కూడా కారణమవుతున్నాయి. ఇలా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతుల్లో చాలామంది పిల్లలను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో దత్తత ప్రక్రియకు సంబంధించిన కొన్ని అంశాల గురించి ముందుగానే తెలుసుకుని, ఇందుకోసం మానసికంగా పూర్తి సంసిద్ధంగా ఉండాలంటున్నారు.

ఆ చిక్కులు లేకుండా...

పిల్లలను అనాథాశ్రమం నుంచి లేదా ఇతరుల నుంచి దత్తత తీసుకుంటారు. దీనికి ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. అందులో న్యాయపరమైన అంశాలూ ఉంటాయి. కాబట్టి, భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ఈ అంశాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి ఒక లాయర్‌ని కూడా సంప్రదించవచ్చు. దీనికంటే ముందుగా దత్తత తీసుకునే ప్రక్రియ గురించి వీలైనంత ఎక్కువగా అవగాహన పెంచుకోవడం మంచిది.  ఇందుకు ఆన్‌లైన్‌లోని సమాచారాన్ని శోధించవచ్చు. దీనిపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే దత్తత తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది.

కుటుంబంతో చర్చించాలి..

పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుగా దంపతులిద్దరూ చర్చించుకోవాలి. భవిష్యత్తులో వచ్చే లాభనష్టాలకు ముందుగానే సిద్ధమవ్వాలి. అయితే ఈ విషయంలో కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం కూడా మంచిది. కానీ, దీనిపై వారికి భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి, వారి సందేహాలను సాధ్యమైనంత మేర నివృత్తి చేసి ఏకాభిప్రాయానికి వచ్చేలా చేయాలి. ఫలితంగా భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఆ తల్లిదండ్రులతో...

చాలామంది పిల్లలు కొత్తవారితో తొందరగా కలిసిపోలేరు. అలాగే చాలామందికి దత్తత తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. దీని గురించి ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. ఈ విషయంలో స్వయంగా అనుభవం ఉన్నవారికే ఎక్కువ విషయాలు తెలుస్తాయి. కాబట్టి, దత్తత తీసుకునే ముందు ఇలా పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులను ఓసారి కలిసే ప్రయత్నం చేయడం మంచిది. ఈ క్రమంలో వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు పిల్లలతో అనుబంధం ఎలా పెంచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫలితంగా దత్తతపై ముందుగానే మీరు ఒక అభిప్రాయానికి రాగలుగుతారు.

పిల్లలతో కూడా...

కొంతమంది దంపతులు ఈపాటికే తమకు పిల్లలున్నా ఆడపిల్ల కావాలనో లేదా మగపిల్లవాడు కావాలనో దత్తత తీసుకోవాలనుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మీ పాప/బాబు కొత్తగా వచ్చేవారితో కలిసిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి, ముందుగా వారితో కూడా మాట్లాడండి. వారికి చెల్లి/తమ్ముడు ఎంత అవసరమో వివరించండి. ఇలా చేయడం వల్ల చిన్నప్పటి నుంచి ఇద్దరూ తోబుట్టువుల్లా కలిసిమెలిసి పెరిగే అవకాశం ఉంటుంది.

ఆర్థిక స్థితిగతులు...

కుటుంబంలోకి కొత్తగా ఒకరు అడుగుపెట్టారంటే ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి, దీనికి ముందుగానే మానసికంగా సిద్ధమవ్వాలి. కొత్తగా వచ్చే బిడ్డకు సంబంధించిన ఖర్చు విషయంలో ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ లేదనుకుంటేనే దత్తత తీసుకోవడానికి ముందుకెళ్లాలి. అలాగే ఎవరిని దత్తత తీసుకోవాలనే విషయంలో కూడా ముందుగానే ఒక నిర్ణయానికి రావడం మంచిదంటున్నారు నిపుణులు. అదేవిధంగా దత్తత తీసుకునే పాప/బాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి అవసరమైతే సంబంధిత నిపుణుల చేత పరీక్షలు చేయించడం కూడా మంచిదని వారు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని