రెండేళ్ల చిన్నారితో.. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కి..!

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లడానికి సముద్ర తీర ప్రాంతాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఎంచుకుంటారు. కానీ న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్‌, సిండీ దంపతులు...

Published : 20 Apr 2023 12:32 IST

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లడానికి సముద్ర తీర ప్రాంతాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఎంచుకుంటారు. కానీ న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్‌, సిండీ దంపతులు మాత్రం ఇందుకు భిన్నం. వీరు తమ పిల్లలను సాహసయాత్రలకు తీసుకెళ్తుంటారు. అలా ఇటీవలే వారు తమ నలుగురు పిల్లలతో కలిసి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించారు. అయితే ఆ నలుగురూ 12 ఏళ్ల లోపు వారు కావడం.. వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండడం విశేషం.

వరల్డ్‌ వెకేషన్...!

న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్, సిండీ దంపతులకు సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. వీరికి నలుగురు సంతానం. హోబీ (11), హెన్రీ (9), హేలీ (6), హేజెల్ (2). వీరికి కూడా చిన్నప్పటి నుంచి ట్రెక్కింగ్‌, సర్ఫింగ్‌ చేయడం వంటివి నేర్పించారు. దాంతో వారికి కూడా పర్వతారోహణపై మక్కువ ఏర్పడింది. అలా ఈ కుటుంబం వీలు దొరికినప్పుడల్లా సాహసయాత్రలు చేస్తుంటుంది. ఈ క్రమంలో పర్వతాలను అధిరోహించడం, క్యాంపులకు వెళ్లడం, సర్ఫింగ్‌ చేయడం వంటివి చేస్తుంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం ‘వరల్డ్‌ వెకేషన్‌’లో గడపడం ఈ కుటుంబ లక్ష్యం. అలా వీరు ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. ఇందులో భాగంగానే ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించాలనుకున్నారు. అప్పటికే ఎన్నో పర్వతాలను అధిరోహించిన అనుభవం ఉండడంతో తమ రెండేళ్ల హేజెల్‌ను కూడా బేస్‌ క్యాంప్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

రెండేళ్ల చిన్నారితో..!

అనుకున్నట్టుగానే వీరి కుటుంబం ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ యాత్రను ప్రారంభించింది. చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ, తోటి పర్వతారోహకులను పలకరిస్తూ యాత్రను ప్రారంభించారు.
ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ ఎత్తు 5364 మీటర్లు అయినప్పటికీ చుట్టూ ఉండే కొండలను దాటుకుంటూ దాదాపు 160 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. పైకి ఎక్కే కొద్దీ వాతావరణంలో అసాధారణ పరిస్థితులు నెలకొంటాయి. గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంటుంది. ఈ క్రమంలో క్రిస్ కుటుంబం కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది. దాంతో తమ రెండేళ్ల చిన్నారి హేజెల్‌ను దృష్టిలో పెట్టుకుని యాత్రను విరమించాలని భావించారట. అయితే గతంలో హేజెల్‌ కంటే చిన్న వయసున్న పిల్లలను కూడా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు తీసుకెళ్లారని తెలుసుకోవడంతో తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

ఇరుకైన బురద మార్గం..

క్రిస్ దంపతులు మొదట గైడ్‌ సహాయం తీసుకోకుండానే యాత్రను ప్రారంభించారు. మొదట 12 కిలోమీటర్ల వరకు వారి జర్నీ సాఫీగానే సాగింది. అయితే ఆ తర్వాత వారికి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. వీటి గురించి మాట్లాడుతూ ‘మేము వెళ్లిన దారిలో ఇరుకైన బురద మార్గం ఉంది. ఆ మార్గం ఒక కొండ పైకి వెళ్లి కిందకు వచ్చేలా ఉంది. ఈ మార్గాన్ని దాటడంలో మాకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని చోట్ల రెండు అడుగుల మేర బురద పేరుకుపోయింది. దారి మధ్యలో జలగలు ఇబ్బంది పెట్టాయి. వీటికి తోడు ఆ సమయంలో వర్షం కూడా వచ్చింది’ అని చెప్పుకొచ్చారు క్రిస్. ఆ తర్వాత ఒక కొండచరియ విరిగిపడడంతో దారితప్పి ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చిందట. అలాగే ఇతరులతో భాషాపరమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నారట. దాంతో గైడ్‌ను నియమించుకుని యాత్రను కొనసాగించారు.

ఎన్ని సమస్యలు ఎదురైనా..

అనుకున్నట్టుగానే పైకి వెళ్లే కొద్దీ గాలిలో ఆక్సిజన్‌ తగ్గిపోతూ వస్తోంది. క్రిస్ దంపతులు పిల్లల ఆక్సిజన్‌ స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ముందుకు సాగారు. అలా ఎన్ని సమస్యలు ఎదురైనా వారి ప్రయాణం లక్ష్యం వైపు సాగింది. మరో ఆరు రోజుల్లో బేస్‌ క్యాంప్‌కు చేరుకుంటామనుకునే సమయానికి వారికి మరో ప్రమాదం ఎదురైంది. అప్పటికే వారు దాదాపు 17 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నారు. అక్కడ ఆక్సిజన్‌ స్థాయులు కనిష్ఠానికి పడిపోయాయి. ఒకానొక సమయంలో తమ యాత్రను అక్కడితో ముగిద్దామనుకున్నారు. కానీ, బేస్‌క్యాంప్‌కు చేరుకోవాలన్న లక్ష్యం వారిని ఆపలేకపోయింది. కొంత సమయం విశ్రాంతి తీసుకుని తిరిగి యాత్రను కొనసాగించారు. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకున్నారు. ఈ యాత్ర పూర్తి చేయడానికి వారికి 19 రోజుల సమయం పట్టింది. ఈ సందర్భంగా- 'పిల్లలతో సహా ఈ యాత్ర చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్రమంలో ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకున్నాం' అంటూ క్రిస్ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని