First time Parents: ఈ పొరపాట్లు చేయకండి..!
పెళ్లైన తర్వాత ప్రతి జంటా తల్లిదండ్రులుగా మారడానికి ఆరాటపడుతుంది. ఆ క్షణం వచ్చే సరికి భావోద్వేగానికి లోనవుతుంటారు. ఈ క్రమంలో ఇంట్లో పెద్ద వాళ్ల దగ్గర్నుంచి పలు సూచనలు, సలహాలు తీసుకుంటుంటారు. అయితే కొత్తగా తల్లిదండ్రులైన వారికి పిల్లల పెంపకంపై పూర్తిగా....
పెళ్లైన తర్వాత ప్రతి జంటా తల్లిదండ్రులుగా మారడానికి ఆరాటపడుతుంది. ఆ క్షణం వచ్చే సరికి భావోద్వేగానికి లోనవుతుంటారు. ఈ క్రమంలో ఇంట్లో పెద్ద వాళ్ల దగ్గర్నుంచి పలు సూచనలు, సలహాలు తీసుకుంటుంటారు. అయితే కొత్తగా తల్లిదండ్రులైన వారికి పిల్లల పెంపకంపై పూర్తిగా అవగాహన లేక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు సైతం దొర్లుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే కొత్తగా తల్లిదండ్రులైన వారు చిన్నారుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..
ఏడుపు సాధారణమే..!
చిన్నారులు ఏడవడం సాధారణమే. వారు నోరు తెరిచి చెప్పలేరు కాబట్టి, వారి బాధను ఏడుపు రూపంలో వ్యక్తపరుస్తుంటారు. కానీ, కొత్తగా తల్లిదండ్రులైన జంటలు పాపాయి ఎక్కువగా ఏడిస్తే కంగారు పడిపోతుంటారు. ఏదో జరిగిపోతుందని లేనిపోనివి ఊహించుకుంటారు. అయితే బుజ్జాయిలు ఏడవడానికి ఆకలి, జ్వరం, దురద, అలసిపోవడం, కడుపునొప్పి.. వంటివి సహజ కారణాలు అంటున్నారు నిపుణులు. కాబట్టి, వారిలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. శరీర ఉష్ణోగ్రతలో ఏమైనా తేడాలున్నాయో చెక్ చేస్తుండాలి. చిన్నారులు ఎక్కువగా పాల కోసమే ఏడుస్తుంటారు. ఒకవేళ పాలు తాగిన తర్వాత కూడా ఎక్కువగా ఏడిస్తే మాత్రం టెన్షన్ పడకుండా ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
ఒత్తిడి వద్దు..!
పేరెంటింగ్‌లో భాగంగా తల్లికి మొదటి సంవత్సరంలో ఎక్కువ సవాళ్లు ఎదురవుతుంటాయి. చిన్నారులకు కావాల్సిన పోషకాలు ఎక్కువగా తల్లి నుంచే అందుతుంటాయి. ఈ క్రమంలో పాపాయిలకు మొదటి ఆరునెలలు తల్లిపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం నిపుణుల సలహా మేరకు ప్రత్యేకమైన డైట్ పాటించాల్సి ఉంటుంది. కొంతమంది తల్లులు ప్రతి రెండు గంటలకోసారి పాలు ఇవ్వాలని.. అదే పనిగా సమయం చూస్తుంటారు. ఒకవేళ అలా ఇవ్వలేకపోతే ఒత్తిడికి లోనవుతుంటారు. రెండు గంటలకు ఓసారి పాలు ఇవ్వడం సరైందే అయినప్పటికీ అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. సాధారణంగా చిన్నారులకు ఆకలి అనిపించినప్పుడు ఏడుపు రూపంలో వ్యక్తపరుస్తుంటారు. కాబట్టి.. ఏదైనా పని హడావిడిలో పడిపోయి మర్చిపోయినా.. వారు ఏడ్చినప్పుడు పాలు పడితే సరిపోతుంది.. అంతేకానీ మీరు టెన్షన్ పడి పాపాయిని ఇబ్బందుల్లోకి నెట్టద్దు.
పొట్టపై పడుకోబెట్టుకోవాలి...
చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవడం కోసం తల్లిదండ్రులు పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. మెత్తటి వస్త్రాలు ఉపయోగించడం, దోమ తెరలు వాడడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని మర్చిపోతుంటారు. అందులో మొదటిది పిల్లలను పొట్టపై పడుకోబెట్టుకోవడం. ఈ ప్రక్రియ వల్ల చిన్నారుల్లో మెడ, భుజానికి సంబంధించిన కండరాలు గట్టిపడతాయంటున్నారు నిపుణులు. అయితే మొదట్లో రోజులో కొన్నిసార్లు 1 నుంచి 2 నిమిషాల చొప్పున ఇలా చేస్తూ.. ఆ సమయాన్ని క్రమంగా 10-15 నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు మంచిది.. అలాగే దీనివల్ల బిడ్డతో తల్లిదండ్రులిద్దరికీ అనుబంధమూ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
బయటకు తీసుకెళ్లద్దు.. కానీ!
చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తద్వారా వారు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అందుకే వారిని రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లద్దని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, కొంతమంది తల్లిదండ్రులు తమ చిన్నారుల్ని వివిధ కార్యక్రమాలకు, ఫంక్షన్లకు వెంటబెట్టుకెళ్తారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సి వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అలాగని ఎప్పుడూ ఇంట్లోనే ఉంచడం కాకుండా.. వారిని దగ్గర్లోని పార్కుకు, ఆహ్లాదంగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లడం మంచిది. ఫలితంగా వారు మరింత యాక్టివ్‌గా తయారవుతారు.
నిర్లక్ష్యం వద్దు..
అప్పటిదాకా భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉన్న దంపతులు తల్లిదండ్రులుగా మారడంతో పూర్తి దృష్టంతా చిన్నారిపైనే కేంద్రీకరిస్తుంటారు. పాపాయి సంరక్షణలో పడి ఒకరినొకరు నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే దీనివల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది. చివరగా దీని ప్రభావం తిరిగి మీ చిన్నారిపైనే పడుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా ఒకరితో ఒకరు సమయం గడపడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.