రుచికరంగానూ.. ఐరన్ పొందచ్చు!
ఇనుము.. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. అలసట, నీరసం.. వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో....
ఇనుము.. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. అలసట, నీరసం.. వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు.. నెలసరి సమయంలో బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు, గర్భం ధరించలేకపోవడం, ఒకవేళ గర్భం వచ్చినా అది నిలవకపోవడం.. వంటి ప్రత్యుత్పత్తి సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని అధిగమించాలంటే ఐరన్ అధికంగా ఉండే పదార్థాల్ని మెనూలో చేర్చుకోమంటున్నారు.
అయితే ఐరన్ అనగానే పాలకూర, తోటకూర లాంటివి తినాలి.. అవి రుచికరంగా ఉండవు అంటూ కొంతమంది బాధపడుతుంటారు. కానీ కొన్ని రుచికరమైన పదార్థాల్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం రండి..
కిస్‌మిస్
ఇనుము లోపం ఉన్నవారు కేవలం తోటకూర, పాలకూర వంటివి తింటూ గడపాలని ఎవరన్నారు..? కిస్‌మిస్ తినడం వల్ల కూడా ఎక్కువ మొత్తంలో ఐరన్ లభిస్తుందంటున్నారు నిపుణులు. ఇటు రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఐరన్‌తో పాటు మరెన్నో పోషకాలు ఉండడం వీటి ప్రత్యేకత. స్వీట్ తినాలనిపించినప్పుడల్లా నాలుగైదు కిస్‌మిస్‌లను నోట్లో వేసుకుంటే తీపి తినాలన్న కోరిక కూడా ఉండదు. వీటిని ఉదయాన్నే ఓట్‌మీల్‌లో, సలాడ్స్‌లో, పెరుగులో కలిపి తీసుకోవచ్చు. ఇవి చక్కటి బ్యాలన్స్‌డ్ బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్‌గా పనికొస్తాయి.
నువ్వులు
నువ్వులు తింటే వేడి చేస్తుందని వాటిని దూరంగా ఉంచుతుంటారు చాలామంది. కానీ అసలు విషయం తెలిస్తే రోజూ వీటిని తప్పకుండా తీసుకుంటారు. రోజూ తీసుకోవాల్సిన ఐరన్‌లో దాదాపు ఎనభై శాతం నువ్వుల నుంచి లభిస్తుందట. నువ్వులను సలాడ్లు, పెరుగు, ఇతర ఆహారపదార్థాల్లో చల్లుకొని తీసుకోవడం, కూరల్లో నువ్వుల పొడి వేసుకోవడంతో పాటు నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు, చిక్కీలు తీసుకోవడం వల్ల ఐరన్ శాతం ఇట్టే పెరుగుతుంది. ముఖ్యంగా గర్భధారణ వయసులో ఉన్న మహిళలకు ఐరన్ చాలా అవసరం కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
డార్క్ చాక్లెట్
చాక్లెట్ తినడం అంటే చాలామందికి ఇష్టం. అయితే మనం రోజూ తీసుకోవాల్సిన మొత్తం ఐరన్‌లో నలభై ఐదు శాతానికి పైనే.. డార్క్ చాక్లెట్‌లో ఉంటుందట. ఇందులో కేవలం ఐరన్ మాత్రమే కాదు.. మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఇంకెన్నో పోషకాలు కూడా ఉంటాయి. అయితే ఎంత మంచిదైనా డార్క్ చాక్లెట్‌ని రోజూ ఓ చిన్న ముక్క కంటే ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
ఎండు ఫలాలు..
ఎండిన టొమాటోలు, అల్‌బుకారా, పీచ్, ప్రూన్స్, ఆప్రికాట్స్.. ఇలా ఎండిన ఫలాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. ఈ ఫలాలన్నింటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు.. ఇందులోని ఎన్నో పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ క్యాలరీలే ఉండడంతో బరువు పెంచకుండానే పోషకాలన్నింటినీ అందిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.