‘బంగారు’ కలల్ని నిజం చేసుకుంది..!

నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డ... ఆరు నెలలకు పైగా ఇంక్యుబేటర్‌లోనే ఉంచాల్సి వచ్చింది. అతికష్టం మీద బతికి బయటపడింది. కానీ అంతలోనే ఆమెను దృష్టిలోపం వెక్కిరించింది. దానివల్ల నడకలోనూ మార్పు. ఫలితంగా పెరిగేకొద్దీ చుట్టుపక్కల వాళ్లనుంచి ఎన్నో హేళనలు. అలాంటి ఆ అమ్మాయి గురించి ఇప్పుడు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈసారి ఆమెలోని లోపాల గురించి కాదు, మా ఊరి అమ్మాయి ప్రపంచ ఛాంపియన్‌ అయిందని.

Updated : 31 May 2024 12:39 IST

నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డ... ఆరు నెలలకు పైగా ఇంక్యుబేటర్‌లోనే ఉంచాల్సి వచ్చింది. అతికష్టం మీద బతికి బయటపడింది. కానీ అంతలోనే ఆమెను దృష్టిలోపం వెక్కిరించింది. దానివల్ల నడకలోనూ మార్పు. ఫలితంగా పెరిగేకొద్దీ చుట్టుపక్కల వాళ్లనుంచి ఎన్నో హేళనలు. అలాంటి ఆ అమ్మాయి గురించి ఇప్పుడు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈసారి ఆమెలోని లోపాల గురించి కాదు, మా ఊరి అమ్మాయి ప్రపంచ ఛాంపియన్‌ అయిందని. ఆమే తాజాగా జపాన్‌లో జరిగిన వరల్డ్‌ పారా అథ్లెట్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన సిమ్రన్‌ శర్మ. టీ12 విభాగంలో విమెన్స్‌ 200మీటర్ల పోటీల్లో 24.95సెకండ్స్‌తో తన రికార్డును తనే బ్రేక్‌ చేసింది. 

‘‘నేను సాధించిన ఈ టైటిల్‌ నాలాంటి వాళ్లకు కొత్త మార్గం అవ్వాలి’’ అంటోన్న సిమ్రన్‌ది దిల్లీకి దగ్గర్లోని బురారి గ్రామం. నాన్న మెడికల్‌ ప్రాక్టిషనర్‌. అమ్మ సవితా శర్మ. ‘‘రెండున్నర నెలల ముందే అమ్మ కడుపులోంచి బయటకు వచ్చా. ఆరునెలలు ఇంక్యుబేటర్‌లోనే ఉంచారట. అమ్మానాన్నలు నాకోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఒకానొక దశలో నేను బతకడం కష్టమని వైద్యులు చెప్పారట. కానీ, అతికష్టం మీద బతికి బయటపడ్డా. కొద్ది రోజులకి దృష్టిలోపమూ తలెత్తింది. ఆరడుగుల దూరంలోని వస్తువుల్నీ చూడలేని స్థితి. దాంతో చుట్టుపక్కల పిల్లలు ‘ఇవి ఎన్ని వేళ్లో కనిపెట్టు’ అంటూ ఆటపట్టించేవాళ్లు. ఇరుగుపొరుగు నా నడకను చూసి వెక్కిరించేవాళ్లు. ఇలాంటి వాతావరణంలో అమ్మే నాకు ధైర్యం. రోజూ తనతోపాటు పార్కులో వాకింగ్‌కు తీసుకెళ్లేది. అమ్మ చేయి పట్టుకుని వాకింగ్‌ చేయడమంటే నాకెంతో ఇష్టం. అదే పరుగుపై ఆసక్తి కలిగించింది. చెప్పలేని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’’ అనే సిమ్రన్‌... ఆ తర్వాత మోదీనగర్‌లోని ‘రుక్మిణీ మోదీ మహిళా ఇంటర్‌ కాలేజీ’లో చేరింది. అక్కడ స్నేహితుల ప్రోత్సాహం తోడవడంతో, కాలేజీలో జరిగే రన్నింగ్‌ పోటీల్లో పాల్గొనేది. 

అన్నీ తానై నడిపించాడు...

2015లో అథ్లెట్, కోచ్‌ అయిన గజేంద్ర సింగ్‌ సిమ్రన్‌కు పరిచయమయ్యారు. ఇద్దరి భావాలూ కలవడంతో 2017లో పెళ్లిచేసుకున్నారు. మొదట్లో పెద్దవాళ్ల నుంచి వ్యతిరేకత వచ్చినా, ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. ప్రస్తుతం సింగ్‌ ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత పారా అథ్లెట్‌ నారాయణ్‌ ఠాకూర్‌ని కలిశాక తాను కూడా పారాస్పోర్ట్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంది సిమ్రన్‌. అందుకయ్యే ఖర్చుకోసం భర్త సింగ్, తనకున్న భూమిని రూ.9లక్షలకు అమ్మేశాడు. సరిపోకపోవడంతో బ్యాంకు నుంచి మరో మూడున్నర లక్షలు రుణం తీసుకున్నాడు. అలా  2019లో విమెన్స్‌ టీ13, విజన్‌ ఇంపెయిర్‌మెంట్‌ కేటగిరీలో వరల్డ్‌ పారా గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీలో పాల్గొని లైసెన్సు పొందింది సిమ్రన్‌. ‘‘మొదట్లో రన్నింగ్‌ లేన్‌లో పరుగెత్తాలంటే కష్టంగా అనిపించేది. ఎందుకంటే నా శరీరాకృతి ఎడమవైపునకు వంగినట్లు ఉండేది. దాంతో నా లేన్‌లో కాకుండా పక్క లేన్‌లోకి వెళ్లిపోయి పరుగెత్తేదాన్ని. ఈ సమస్యను అధిగమించేలా శిక్షణ ఇచ్చారు నా భర్త. గతేడాది తొడగాయంతో ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అప్పుడు నాతోపాటు షాడో రన్నింగ్‌ చేస్తూ లేన్‌పై మరింత సాధన చేయించారు’’ అంటోన్న సిమ్రన్‌ 2021లో ప్యారిస్‌ పారా ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గానూ గుర్తింపు పొందింది. గతేడాది చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియన్‌ గేమ్స్‌లో 100మీటర్లు, 200మీటర్ల టీ12 ఈవెంట్‌లలో రెండు సిల్వర్‌ పతకాలను గెలుచుకున్న ఈమె టెడెక్స్‌ స్పీకర్‌ కూడా.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్