Published : 21/01/2022 18:14 IST

తగ్గేదేలే.. ఒక్కర్తే ప్రపంచాన్ని అలా చుట్టేసింది.. రికార్డు కొట్టేసింది!

(Photo: Instagram)

పైలట్‌గా మారి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని కలలు కనే అమ్మాయిల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్నో ఆంక్షలు! మరోవైపు STEM (Science, Technology, Engineering, Mathematics) వంటి రంగాల్లో పురుషాధిపత్యమే రాజ్యమేలుతోంది. దీంతో ఇలాంటి అరుదైన రంగాల్లో రాణించాలనుకునే ఎంతోమంది యువతుల కలలు ఊహలుగానే మిగిలిపోతున్నాయి. ఇదిగో ఇలాంటి ధోరణినే మార్చాలని కంకణం కట్టుకుంది 19 ఏళ్ల జరా రూథర్‌ఫర్డ్‌. శాస్త్రసాంకేతిక రంగాల్లో; ప్రత్యేకించి విమానయాన రంగంలో ప్రవేశించేలా అమ్మాయిలను ప్రోత్సహించే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు ౧౮ న ఓ బుల్లి విమానంలో ప్రపంచ యాత్రకు బయలుదేరింది. తాజాగా తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి, అమ్మాయిలు ఒంటరిగానైనా సరే ప్రపంచాన్ని చుట్టిరాగలరని నిరూపించింది. అంతేకాదు.. అతి చిన్న వయసులో ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టొచ్చిన మహిళగా గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పింది.

జరా రూథర్‌ఫర్డ్‌.. 19 ఏళ్ల ఈ బెల్జియన్‌-బ్రిటిష్‌ యువతికి వ్యోమగామి కావాలనేది చిన్ననాటి కల. తల్లిదండ్రులిద్దరూ పైలట్లు కావడంతో ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహం తోడైంది. అయితే తనొక్కర్తే ఇలా ఎదగడం కాకుండా.. STEM వంటి అరుదైన రంగాల్లో అమ్మాయిల్ని ప్రోత్సహించాలనుకుంది. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ప్రపంచమంతా చుట్టి రావాలని ప్లాన్‌ చేసుకుంది. అనుకున్నది సాధించేసి తానేంటో నిరూపించింది.

వారిలో ఆ ధైర్యం నింపడానికే!

ప్రస్తుతం గణితంలో ఎ- లెవెల్ (అడ్వాన్స్‌డ్ లెవెల్) పూర్తి చేసిన జరా.. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదవాలని తన తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే శాస్త్రసాంకేతిక రంగాల్లో అమ్మాయిలకు ప్రోత్సాహం కరువవుతోందని.. ఈ మూసధోరణిని అమ్మాయిలంతా బద్దలుకొట్టాలని కోరుకుంటోంది.

‘ఎప్పటికైనా వ్యోమగామి కావాలనేది నా కల. అమ్మానాన్నలిద్దరూ పైలట్లు కావడంతో.. వాళ్లను చూసి లక్ష్యం దిశగా నాలో కసి మరింతగా పెరిగింది. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించాను. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో ఆరితేరాను. పైలట్‌ లైసెన్స్ కూడా పొందాను. నాలాగే ఎంతోమంది అమ్మాయిలు శాస్త్రసాంకేతిక రంగాల్లోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇప్పటికీ కేవలం ౫ శాతం మంది మహిళలు మాత్రమే కమర్షియల్ పైలట్లుగా, ౧౫ శాతం మంది మాత్రమే కంప్యూటర్ సైంటిస్టులుగా పని చేస్తున్నారు. వివక్ష, పురుషాధిపత్యం, తగిన ప్రోత్సాహం లేకపోవడం.. వంటివన్నీ వారి కలలకు అడ్డుపడుతున్నాయి. వీటన్నింటినీ బద్దలుకొట్టి అమ్మాయిలు ధైర్యంగా ముందుకు రావాలి. వాళ్లలో ఆ ధైర్యం నింపడానికే ఒంటరిగా ప్రపంచమంతా చుట్టి రావాలని నిర్ణయించుకున్నా. నా లక్ష్యాన్ని సాధించా.. నన్ను చూసి ‘జరాలా నేను కూడా ఏదో ఒక రోజు నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటా’ అని ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటే నా సాహస యాత్రకు సార్థకత చేకూరినట్లే’ అంటోంది జరా.

అలా చుట్టొచ్చేసింది!

జరా.. గత ఏడాది ఆగస్టు ౧౮ న ‘షార్క్‌ అల్ట్రా లైట్‌ ప్లేన్‌’లో ప్రపంచ యాత్రకు బయలుదేరింది. రెండు సీట్లున్న ఈ విమానం చాలా తేలికైనది. ఒకవేళ ఇంజిన్‌ విఫలమైనా, ఇతరత్రా సాంకేతిక సమస్యలు తలెత్తినా.. త్వరగా ల్యాండయ్యే ప్రత్యేకత దీని సొంతం. వాస్తవానికి మూడు నెలల్లోనే జరా ప్రయాణం పూర్తి కావాలి. కానీ ఐదు నెలల సమయం పట్టింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా సమస్యల వల్ల ఆలస్యంగా స్వదేశంలోకి అడుగు పెట్టింది జరా. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బెల్జియం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు విమానాలు ఎస్కార్టుగా రావడం గమనార్హం.

అయినా తగ్గేదేలే.. !

ఈ సాహస యాత్రలో భాగంగా ఐదు ఖండాల్లోని ౪౦కి పైగా దేశాలను సందర్శించింది జరా. మొత్తం 52 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. తన యాత్ర గురించి మాట్లాడుతూ- ‘నేను ఊహించినదానికన్నా నా ప్రయాణం ఎంతో కష్టమైంది.. ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యంత కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెట్టేవి. మానవ సంచారమే కనిపించని ప్రాంతాల్లో కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించాను.. కొన్ని చోట్ల రోడ్లు, మనుషులు, ఎలక్ట్రిక్ కేబుల్స్.. ఇలా ఏవీ కనిపించేవి కావు.. అలాంటి చోట్ల ఒకవేళ ఇంజిన్ ఆగిపోతే ఎలా అన్న ఆలోచన ఒక్కోసారి భయం కలిగించేది.. అయినా సరే నా లక్ష్యం గుర్తుకు వచ్చి ఎక్కడా వెనకడుగు వేయలేదు.. కాలిఫోర్నియాలో కార్చిచ్చులు, రష్యాలో ఎముకలు కొరికే చలి వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మరీ ముందుకు సాగాను. ఓ దశలో అయితే ఉత్తర కొరియా గగనతలంలోకి ప్రవేశించకుండా తృటిలో తప్పించుకుని బయటపడ్డా.. మొత్తంమీద నా యాత్రను విజయవంతంగా పూర్తి చేసి స్వదేశానికి చేరుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది' అంటూ సంబరపడుతోంది జరా.

ఆ రికార్డును తిరగరాసింది!

మైక్రోలైట్‌ ప్లేన్‌లో ఒంటరిగా ఈ సాహసయాత్ర చేసిన కీర్తినీ మూటగట్టుకుంది జరా. ఈ క్రమంలో అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు మహిళల్లో ఈ రికార్డు 30 ఏళ్ల అమెరికన్‌ మహిళ షాయెస్టా వెయిజ్ పేరిట ఉంది. తన తాజా విజయంతో ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది ఈ బెల్జియం టీన్. ఇలా కేవలం తన యాత్రతో టీనేజీ అమ్మాయిల్లో స్ఫూర్తి నింపడమే కాదు.. వారిని స్టెమ్‌ రంగాల దిశగా ప్రోత్సహించడానికి నిధులు సైతం సమీకరిస్తోంది జరా. ఇక మరోవైపు స్నీకర్స్‌ షూ బిజినెస్‌ కూడా చేస్తోంది.

ఈ క్రమంలో- జరా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, అమ్మాయిలందరికీ  మరింత స్ఫూర్తిని పంచాలని కోరుకుందాం!


Advertisement

మరిన్ని