వాళ్ల సమస్యలకు తాను గొంతుకై..
close
Updated : 18/01/2022 19:31 IST

వాళ్ల సమస్యలకు తాను గొంతుకై..!

(Photo: Twitter)

అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే సంతృప్తిని వెతుక్కునే వారు చాలా అరుదుగా ఉంటారు. తమ సేవతో సమాజాన్నే కాదు.. ప్రభుత్వాల్ని సైతం మెప్పిస్తుంటారు. న్యూజిలాండ్‌లో పుట్టిపెరిగిన భారత సంతతి అమ్మాయి గడ్డం మేఘనదీ ఇలాంటి మనస్తత్వమే! అందుకే ఆమె చేసిన సేవా కార్యక్రమాలే తనకు అరుదైన ఘనతను తెచ్చిపెట్టాయి. న్యూజిలాండ్ యువ పార్లమెంటుకు ఎంపికయ్యేలా చేశాయి. ఈ నేపథ్యంలోనే తన సేవల్ని మరింతగా విస్తరించే అద్భుత అవకాశం దొరికిందంటూ ఉప్పొంగిపోతోన్న ఈ తెలుగమ్మాయి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.

న్యూజిలాండ్‌లో యువ పార్లమెంట్‌ ప్రతి మూడేళ్లకోసారి నిర్వహిస్తుంటారు. ఆయా ప్రాంతాల పార్లమెంట్ సభ్యుల చేత నామినేట్ అయి, వారి ప్రతినిధులుగా ఎంపికైన వారు.. ఈ కార్యక్రమంలో భాగంగా యువతను ప్రభావితం చేసేలా పలు ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపిస్తారు. దేశ ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవడం, ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఆయా అంశాలపై నిర్మొహమాటంగా తమ అభిప్రాయాల్ని వెల్లడించడానికి వాళ్లకు ఇదో మహదవకాశం అని చెప్పచ్చు. పదో యువ పార్లమెంట్‌లో భాగంగా.. మొత్తం 120 మంది ఎంపికైన ఈ బృందంలో తెలుగమ్మాయి గడ్డం మేఘన కూడా చోటు దక్కించుకోవడం విశేషం.

ఆ పిల్లల కోసం కదిలింది!

18 ఏళ్ల మేఘనది భారతీయ మూలాలున్న కుటుంబం. ప్రకాశం జిల్లా టంగుటూరికి చెందిన ఆమె తల్లిదండ్రులు వృత్తి రీత్యా 21 ఏళ్ల క్రితమే న్యూజిలాండ్‌కి వలస వెళ్లారు. దాంతో అక్కడే పుట్టి పెరిగింది మేఘన. కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌లో స్కూలింగ్‌ పూర్తి చేసిన ఆమెకు చిన్న వయసు నుంచే సేవాదృక్పథం ఎక్కువ! స్కూల్లో హెడ్‌ గర్ల్‌గా కొనసాగుతూనే.. స్కూల్‌ తరఫున ఏర్పాటుచేసే వివిధ సేవా కార్యక్రమాల్లో తన స్నేహితులతో కలిసి పాల్గొనేది మేఘన. వాళ్లతో కలిసి సేకరించిన నిధుల్ని అనాథాశ్రయాలకు విరాళంగా అందించేది. మరోవైపు.. వివిధ దేశాల నుంచి వలస వచ్చిన శరణార్థ బాలల్ని అన్ని విధాలుగా ఆదుకుంటోందామె. వారికి ఉండడానికి వసతి, ఇతర సౌకర్యాలు సమకూర్చడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించడానికీ సహకరిస్తోంది.

అందుకు ఇదో గొప్ప వేదిక!

‘యువ పార్లమెంటుకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా నా సేవల్ని మరింత విస్తరించే అద్భుత అవకాశం నాకు దొరికింది. గత మూడేళ్లుగా శరణార్థ బాలల మంచి చెడులు చూస్తున్నాం.. వారు కొత్త దేశంలో త్వరగా ఇమిడిపోయేందుకు మా వంతు సహకారం అందిస్తున్నాం. అలాగే వారి చదువుకు ఆటంకం రాకుండా కొన్ని సబ్జెక్టులు బోధిస్తున్నాం. నేను యువ పార్లమెంటుకు ఎంపికవడం పట్ల అమ్మానాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు..’ అంటోంది మేఘన. నిజానికి చిన్నతనం నుంచి ఇలా తాను చేస్తోన్న సేవలకు గుర్తింపుగానే ఆమెకు ఈ అరుదైన అవకాశం లభించిందని చెప్పచ్చు. ప్రస్తుతం వాల్కోట్‌ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న మేఘన యువ పార్లమెంట్‌ సభ్యురాలిగా యువతకు సంబంధించిన సేవా కార్యక్రమాలు, యువత సమస్యలపై తన గళాన్ని వినిపించనుంది.Advertisement

మరిన్ని