విదేశాల్లో చదువులా? అయితే ఈ కథ వినాల్సిందే!

విదేశాల్లో చదువుకోవడం, ఉద్యోగం చేయడం.. చాలామందికి కల. మనకు తెలిసిన వారెవరైనా ఉన్నత చదువుల కోసం అమెరికా, యూకే.. వంటి దేశాలకు వెళ్తున్నారంటే.. ‘ఇంకేంటి.. చదువు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగమొచ్చేస్తుంది.. ఇక జీవితంలో స్థిరపడ్డట్లే!’ అంటుంటాం.. కానీ తెర వెనుక పరిస్థితులు ఇందుకు భిన్నంగా....

Published : 30 Jun 2023 21:03 IST

విదేశాల్లో చదువుకోవడం, ఉద్యోగం చేయడం.. చాలామందికి కల. మనకు తెలిసిన వారెవరైనా ఉన్నత చదువుల కోసం అమెరికా, యూకే.. వంటి దేశాలకు వెళ్తున్నారంటే.. ‘ఇంకేంటి.. చదువు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగమొచ్చేస్తుంది.. ఇక జీవితంలో స్థిరపడ్డట్లే!’ అంటుంటాం.. కానీ తెర వెనుక పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయంటోంది హైదరాబాద్‌కు చెందిన యువ ఆర్కిటెక్ట్‌ శ్రీ ప్రణవి. ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లిన ఆమె.. చదువు పూర్తిచేసుకొని అక్కడే భవన నిర్మాణ రంగంలో స్థిరపడాలనుకుంది. కానీ మనమొకటి అనుకుంటే దైవమొకటి తలచినట్లు.. వంద శాతం నైపుణ్యాలు, నాలెడ్జ్‌ ఉన్నా.. అక్కడ ఉద్యోగం దొరకడం గగనంగా మారిందంటోంది. చదువు కోసం అక్కడికి వెళ్లిన నాటి నుంచి నేటి దాకా తానెదుర్కొన్న ఆర్థిక, మానసిక కష్టాల్ని గుదిగుచ్చి లింక్డిన్లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది ప్రణవి. విదేశాల్లో చదువు, ఉద్యోగం అంటూ అడుగు ముందుకేసే వారిని ఒక్క క్షణం ఆగి ఆలోచించేలా చేస్తోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ప్రణవి చిన్నతనం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం.. తద్వారా తన నైపుణ్యాల్ని విస్తృతం చేసుకోవడం పైనే దృష్టి పెట్టేది. అయితే టీనేజ్‌లో ఉన్నప్పుడే ఆర్కిటెక్చర్‌ రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్న ఆమె.. అదే దిశగా తన చదువు కొనసాగించింది. హైదరాబాద్‌లో బ్యాచిలర్‌ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ పూర్తిచేసిన ఆమె.. యూకేలో మాస్టర్స్‌ చేయాలనుకుంది. తాను అనుకున్నట్లుగానే 2021లో యూకే వెళ్లింది. స్కాట్లాండ్‌లోని ‘ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ’లో ‘అర్బన్‌ స్ట్రాటజీస్‌ అండ్‌ డిజైన్‌’ విభాగంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది ప్రణవి.

ఆ లక్ష్యంతోనే యూకే వెళ్లా..!

అయితే ఇక్కడ డిగ్రీ చదివేటప్పుడే ఓ సంస్థలో ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌గా ఏడాది పాటు పని చేసింది ప్రణవి. ఇక లండన్‌లో మాస్టర్స్‌ చేసే క్రమంలో అక్కడి ‘అర్బన్‌ డిజైన్‌ లండన్‌’ అనే ఎన్జీవోలో అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా మూడు నెలల పాటు విధులు నిర్వర్తించింది. ఇక గతేడాది డిసెంబర్‌లో చదువు పూర్తిచేసుకున్న ఆమె.. భవన నిర్మాణ రంగంలో స్థిరపడాలన్న లక్ష్యంతో అప్పట్నుంచే ఉద్యోగ వేట ప్రారంభించింది. కానీ మంచి మెరిట్‌ ఉన్నా, ఇప్పటికే పలు వృత్తినైపుణ్యాలు సంపాదించినా.. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం సఫలమవ్వట్లేదంటోంది ప్రణవి. ఈ ఒక్క విషయంలోనే కాదు.. తాను యూకే వెళ్లినప్పట్నుంచి.. ఆర్థికంగా, మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆమె.. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించకపోయేసరికి ఒక రకమైన అసహనానికి లోనయ్యానంటోంది. ఈ క్రమంలోనే తన యూకే అనుభవాల్ని, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి తానెదుర్కొంటోన్న సవాళ్లను ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ రూపంలో లింక్డిన్‌లో ఇలా పంచుకుంది.

వీసా పోయింది!

‘ఆర్కిటెక్చర్ రంగంలో అంచెలంచెలుగా ఎదగాలని కలలు కన్నా. ముఖ్యంగా సకల సౌకర్యాలతో, పర్యావరణ హితంగా ఉండే భవనాలు నిర్మించాలన్నది నా కల. ఈ లక్ష్యంతోనే యూకే వెళ్లా. అది కూడా కేవలం రెండు వారాల్లోనే వీసా, విద్యా రుణం సమకూర్చుకొని! ఎలాగైతేనేం.. యూకేలో వాలిపోయాననిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక అసలు కష్టాలు మొదలయ్యాయి. నా పాస్‌పోర్ట్‌, బయోమెట్రిక్‌ రెసిడెన్స్‌ పర్మిట్‌ (బీఆర్‌పీ) ఎవరో చోరీ చేశారు. ఇల్లు వెతుక్కోవడం, రోజులు గడిచే కొద్దీ ఖర్చులు పెరగడం, ఒంటరితనం, ఒత్తిడి, కోపం.. ఇలా చెప్పుకుంటూ పోతే నేనెదుర్కొన్న సమస్యల చిట్టా పెద్దదే అవుతుంది. ఇవన్నీ ఓపికతో ఎదుర్కొంటూనే 2022 డిసెంబర్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశా.. మంచి మెరిట్‌ సాధించా.

ఉద్యోగమే కరువైంది!

అయితే ఇంత కష్టపడ్డా కొన్ని విషయాల్లో దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగం! ఒక అంతర్జాతీయ విద్యార్థినై ఉండి, తెలివితేటలు-నైపుణ్యాలున్నా.. నెలల తరబడి ప్రయత్నిస్తున్నా ఒక్క ఉద్యోగ అవకాశం కూడా రావట్లేదంటే చాలా బాధనిపిస్తోంది. నాకు, నా చదువుకు, నా నైపుణ్యాలకు ఇక్కడ ఎలాంటి విలువ లేదనిపిస్తోంది. చదువు పూర్తైన దగ్గర్నుంచి ఇప్పటి వరకు సుమారు 300లకు పైగా ఉద్యోగ దరఖాస్తులు చేసుకున్నా.. కొన్ని సంస్థల నుంచి ఉపయోగకరమైన సలహాలెన్నో పొందాను. అలాగే ఒక్కోసారి ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసినా.. ఫీడ్‌బ్యాక్‌/రిప్లై కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి! ఇలా నేనే కాదు.. నాలాంటి విద్యార్థులు ఇక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి రిక్రూటర్లు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి.. ఇలాంటి ఉద్యోగ దరఖాస్తుల వెనుక ప్రతిభ ఉన్న విద్యార్థులెందరో ఉన్నారు. వారు తమ సామర్థ్యాలు, తెలివితేటలతో ఏదైనా చేయగల సమర్థులు.

కాబట్టి ఇకనైనా మాలాంటి అంతర్జాతీయ విద్యార్థులకు అవకాశం ఇచ్చేలా పరిస్థితుల్లో మార్పులొస్తాయని ఆశిస్తున్నా. నేను ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా.. నా ప్రతిభ, నైపుణ్యాలు.. ఓపికతో నన్ను ఎంత దూరమైనా వెళ్లేలా చేస్తున్నాయి. నేను పాజిటివ్‌గా అడుగు ముందుకేసేలా ప్రేరేపిస్తున్నాయి..’ అంటూ చెప్పుకొచ్చిందీ యువ ఆర్కిటెక్ట్.
ఇలా ప్రణవి పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. భారతీయులే కాకుండా.. వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు తమదీ ఇదే పరిస్థితి అంటూ.. విదేశాల్లో విద్య-ఉద్యోగావకాశాల పరంగా తామెదుర్కొంటోన్న సమస్యలు, సవాళ్లను పోస్టుల రూపంలో పంచుకుంటున్నారు.

ఒకరకంగా- జాబ్ మార్కెట్‌లో ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను ఈ పోస్ట్ ప్రతిబింబిస్తోంది. అయితే.. అందరి పరిస్థితీ ఇలాగే ఉంటుందని చెప్పలేం. అలాగని- ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో పేరున్న యూనివర్సిటీల్లో అడ్మిషన్ వచ్చినంత మాత్రాన- వెంటనే జీవితం సెటిలైపోయినట్లు కాదు.. విదేశాల్లో చదివేటప్పుడు- ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారే పరిస్థితులను గమనించుకోవాల్సిందే.. కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సిందే.. వృత్తి ఉద్యోగాల పరంగా ఎప్పటికప్పుడు వ్యక్తిగత నైపుణ్యాలు, సామర్ధ్యాలను పెంపొందించుకోవాల్సిందే.. ఈ క్రమంలో- నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంతో- చదువైపోగానే ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాకపోవచ్చు..
కాబట్టి విద్య, ఉద్యోగావకాశాల పరంగా ఎక్కడ, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. నిరుత్సాహపడకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే.. మాత్రం తప్పకుండా సత్ఫలితాలొస్తాయంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని