అమెరికా క్రికెట్‌ జట్టులో మన తెలుగమ్మాయిలు!

మన దేశ క్రీడ కాకపోయినా.. క్రికెట్‌పై అభిమానం భారతీయుల రక్తంలోనే ఉందేమో అనిపించకమానదు. ఈ అభిమానం ఖండాలు దాటినా తరగదని నిరూపిస్తున్నారు భారత సంతతికి చెందిన కొందరు అమెరికన్‌ అమ్మాయిలు. క్రికెట్‌పై మక్కువతో ఈ క్రీడనే కెరీర్‌గా మలచుకున్న వీరు.. తాజాగా అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన....

Updated : 17 Dec 2022 13:13 IST

మన దేశ క్రీడ కాకపోయినా.. క్రికెట్‌పై అభిమానం భారతీయుల రక్తంలోనే ఉందేమో అనిపించకమానదు. ఈ అభిమానం ఖండాలు దాటినా తరగదని నిరూపిస్తున్నారు భారత సంతతికి చెందిన కొందరు అమెరికన్‌ అమ్మాయిలు. క్రికెట్‌పై మక్కువతో ఈ క్రీడనే కెరీర్‌గా మలచుకున్న వీరు.. తాజాగా అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన అమెరికన్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. మొత్తం 15 మందితో కూడిన ఈ జట్టులో ఒక్కరు మినహా మిగతా 14 మంది భారత సంతతికి చెందిన అమ్మాయిలే కావడం విశేషం. అందులోనూ ఆరుగురు తెలుగమ్మాయిలు ఉండడం మరో విశేషం. ఈ నేపథ్యంలో ఈ యువ కెరటాల క్రికెట్‌ జర్నీ మీకోసం..!

గీతికా కొడాలి, కెప్టెన్

పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గీతికా కొడాలి. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జన్మించిన ఆమె.. చదువుతో పాటు ఆటల్లోనూ రాణించేది. ముఖ్యంగా క్రికెట్‌ను ఇష్టపడే గీతికను తన తల్లిదండ్రులు ఈ దిశగానే ప్రోత్సహించారు. పదకొండేళ్ల వయసు నుంచే స్నేహితులు, బంధువులతో కలిసి క్రికెట్‌ ఆడుతూ మురిసిపోయిన ఈ క్రికెట్‌ లవర్‌.. 15 ఏళ్ల వయసులో క్యాలిఫోర్నియాలోని ‘క్రికెట్‌ జీల్‌ అకాడమీ’లో శిక్షణలో చేరింది. అక్కడే ఈ క్రీడలో మరిన్ని నైపుణ్యాలు సంపాదించిన గీతిక.. 2019లో అమెరికా మహిళల క్రికెట్‌ జట్టులో చోటుదక్కించుకుంది. తన ఆటతీరును అంతకంతకూ మెరుగుపరచుకుంటూ పోయిన ఆమె.. తాజాగా ‘అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌’ కోసం ఎంపిక చేసిన అమెరికా జట్టుకు నాయకత్వం వహించనుంది. మీడియం పేస్‌ బౌన్సర్లతో ప్రత్యర్థికి చెమటలు పట్టించగల ఈ ట్యాలెంటెడ్‌ గర్ల్‌.. మరోవైపు ఆల్‌ రౌండర్‌గానూ తనను తాను నిరూపించుకుంటోంది. ఇలా జాతీయ జట్టుకే కాదు.. ఈ ఏడాది వెస్టిండీస్‌ వేదికగా తొలిసారి జరిగిన దేశవాళీ టోర్నీ ‘విమెన్స్‌ కరీబియన్ ప్రీమియర్‌ లీగ్‌’లో భాగంగా ‘ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌’ జట్టు తరఫున ఆడిందామె. ఆస్ట్రేలియా క్రికెటర్‌ జోష్‌ హేజెల్‌వుడ్‌ తన అభిమాన క్రికెటర్‌ అంటోంది గీతిక.


అంకితా రెడ్డి కొలన్‌, వైస్ కెప్టెన్

క్రికెట్‌పై మక్కువతో తొమ్మిదేళ్ల వయసులోనే బ్యాట్‌ పట్టుకుంది అంకిత. మొదట్లో తన ఫ్యామిలీ గ్యారేజ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడేదామె. ఈ క్రమంలో ఆటపై తనకున్న ఇష్టాన్ని, తపనను గుర్తించిన ఆమె తండ్రి అంకితకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆపై అమెరికాలోనే ప్రముఖ దేశవాళీ క్రికెట్‌ అకాడమీ అయిన శాన్‌ రామన్‌ క్రికెట్‌ అకాడమీ తరఫున పలు మ్యాచులాడి సత్తా చాటిందామె. గతేడాది జాతీయ జట్టులోకొచ్చిన ఆమె.. మెక్సికోలో నిర్వహించిన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌ అమెరికాస్‌ క్వాలిఫైయర్‌ టోర్నమెంట్‌లో పాల్గొంది. అయితే ఎన్ని మ్యాచులాడినా.. బెంగళూరులోని ‘కర్ణాటక క్రికెట్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో తాను చేసిన తొలి అర్ధ సెంచరీ తన కెరీర్‌లో మరపురానిదంటోంది అంకిత. ప్రస్తుతం కుడిచేతి వాటం బ్యాట్స్‌ఉమన్‌గా, వికెట్‌ కీపర్‌గా కొనసాగుతోన్న ఈ యూత్‌ స్టార్‌కు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ అలిస్సా హీలే అంటే ఎనలేని అభిమానమట. ఇక ‘గర్ల్స్‌ క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌’లో భాగంగా ‘ఉత్తమ వికెట్‌ కీపర్‌ అవార్డు’ను కూడా అందుకుంది అంకిత.


లాస్య ముళ్లపూడి

తమ ఆటతీరుతో దేశానికి గర్వకారణంగా నిలవాలనుకుంటారు ఎంతోమంది క్రీడాకారులు. లాస్య ముళ్లపూడి కూడా ఇందుకు మినహాయింపు కాదు. క్రికెట్‌పై మక్కువతో చిన్న వయసులోనే ఈ క్రీడలో ఓనమాలు నేర్చుకున్న ఆమె.. క్యాలిఫోర్నియా క్రికెట్‌ అకాడమీలో తన నైపుణ్యాలకు మరిన్ని మెరుగులద్దుకుంది. ఎడం చేతి వాటం బ్యాట్స్‌ఉమన్‌గా, కుడి చేతి వాటం స్పిన్నర్‌గా ఎదిగిన లాస్య.. తన కోరిక మేరకే.. పిన్న వయసులోనే దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. తాను ఈ క్రీడలో రాణించడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌ల ప్రోత్సాహమే కారణమంటోన్న ఈ యంగ్‌ క్రికెటర్‌.. మ్యాచ్‌ మొదటి బంతి నుంచి ఆఖరి బంతి వరకు తగ్గని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటుంది.


సాయి తన్మయి

అటు కెరీర్‌లో రాణిస్తూనే.. ఇటు తమ అభిరుచులకూ సమప్రాధాన్యమిస్తుంటారు కొందరు. సాయి తన్మయి కూడా ఇదే కోవకు చెందుతుంది. క్రికెట్‌పై మక్కువతో ఈ క్రీడలో నైపుణ్యాలు నేర్చుకున్న ఆమె.. యూఎస్‌ఏ మహిళా జట్టులో సభ్యురాలిగా, అండర్‌-19 జట్టులోనూ చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఓ టోర్నీలో భాగంగా యూఎస్‌ఏ అండర్ - 19 మహిళల క్రికెట్‌ జట్టులో పాలుపంచుకొని సత్తా చాటిన తన్మయి.. లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయడంలో నిపుణురాలు. ఇలా క్రికెట్లోనే కాదు.. సంగీతంలోనూ ఈ అమ్మాయికి పట్టుంది. అమెరికాలో పుట్టి పెరిగినా తెలుగు మూలాలు మర్చిపోలేదామె. తెలుగు భాషలో స్పష్టంగా మాట్లాడగలిగే తన్మయి.. తెలుగు భక్తి పాటలు, ఇతర పాటల్ని పాడుతూ యూట్యూబ్‌ వీడియోలు చేస్తుంటుంది. ఇప్పటికే పలు సంగీత పోటీల్లో గెలుపొందిన ఈ మ్యూజిక్‌ లవర్‌.. 2017లో ఓ ఆల్బమ్‌ని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌, అమెరికాల్లో లైవ్‌ షోస్‌ చేస్తూ సంగీతంపై తనకున్న మక్కువను చాటుకుంటోన్న తన్మయి.. క్రికెట్‌, సంగీతం.. ఈ రెండూ తనకు రెండు కళ్లంటోంది.

వీరితో పాటు మరో ఇద్దరు తెలుగమ్మాయిలు కస్తూరి వేదాంతం, భూమిక భద్రిరాజు.. కూడా అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ టోర్నీ కోసం ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ టోర్నీ జనవరి 7-29 వరకు కొనసాగనుంది.

Photos: www.usacricket.org

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్