ఆప్తుల జ్ఞాపకాల్ని అందమైన ఆభరణాలుగా మలుస్తోంది!

అయిన వారు చనిపోతే ఆ బాధను దిగమింగుకోవడం అంత తేలికైన విషయం కాదు.. వారు మన మధ్య లేకపోయినా.. వారికి సంబంధించిన ఏదో ఒక వస్తువును వారి జ్ఞాపకార్థం మన వద్ద ఉంచుకొని ఆ బాధ నుంచి కాస్త ఉపశమనం పొందుతాం. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి ఆప్తుల్ని కోల్పోయిన వారి కన్నీరు తుడుస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన జ్యుయలరీ డిజైనర్‌ జాక్వీ విలియమ్స్‌. తమ ఆత్మీయుల కోరిక మేరకు మరణించిన వారి దంతాలు, జుట్టు, చితాభస్మంతో విభిన్న ఆభరణాలు తయారుచేస్తూ ఆ కుటుంబీకులకు అందిస్తోంది..

Updated : 15 Dec 2022 16:34 IST

Photo: Instagram

అయిన వారు చనిపోతే ఆ బాధను దిగమింగుకోవడం అంత తేలికైన విషయం కాదు.. వారు మన మధ్య లేకపోయినా.. వారికి సంబంధించిన ఏదో ఒక వస్తువును వారి జ్ఞాపకార్థం మన వద్ద ఉంచుకొని ఆ బాధ నుంచి కాస్త ఉపశమనం పొందుతాం. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి ఆప్తుల్ని కోల్పోయిన వారి కన్నీరు తుడుస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన జ్యుయలరీ డిజైనర్‌ జాక్వీ విలియమ్స్‌. తమ ఆత్మీయుల కోరిక మేరకు మరణించిన వారి దంతాలు, జుట్టు, చితాభస్మంతో విభిన్న ఆభరణాలు తయారుచేస్తూ ఆ కుటుంబీకులకు అందిస్తోంది.. వారి ముఖాల్లో సంతోషాన్ని నింపుతోంది. ‘అయినా ఇదేం పని.. అసహ్యంగా..!’ అని చుట్టూ ఉన్న వాళ్లు అన్నా.. తాను చేసే పని తనకు నచ్చితే చాలంటూ సూటిగా చెబుతోంది.

జాక్వీ విలియమ్స్‌.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నివాసముండే ఈ 29 ఏళ్ల డిజైనర్‌కు ఆభరణాలు తయారుచేయడమంటే ముందు నుంచీ మక్కువే! ఈ క్రమంలోనే 2017లో ‘జ్యుయలరీ-ఆబ్జెక్ట్‌ డిజైన్‌’ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన ఆమె.. ఆ తర్వాత ఉద్యోగ వేట మొదలుపెట్టింది. అయితే కొన్నాళ్ల పాటు బార్లు, రెస్టరంట్లలో పనిచేసింది. ఆ తర్వాత తానే ఓ సొంత వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంది.

ఫ్రెండ్‌ చనిపోవడంతో..!

అదే సమయంలో తాను ప్రాణానికి ప్రాణంగా భావించే ఫ్రెండ్‌ ఒకరు చనిపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైంది జాక్వీ. ఇలా ఆప్తుల్ని కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో గ్రహించిన ఆమె.. వారిలోని ఆ బాధను ఎలాగైనా దూరం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. అయితే అప్పటికే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న జాక్వీ.. తన ఆలోచనను జ్యుయలరీ డిజైనింగ్‌ వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే మరణించిన వారి దంతాలు, కేశాలు, చితాభస్మంతో విభిన్న ఆభరణాలు రూపొందించి వారి కుటుంబ సభ్యులకు అందించి.. వారి కన్నీళ్లు తుడవాలనుకుందామె. ఈ ఆలోచనే ‘గ్రేవ్‌ మెటాలమ్‌ జ్యుయలరీ’ (Grave Metallum Jewellery) అనే ఆభరణాల తయారీ కంపెనీని ప్రారంభించేలా చేసిందని చెబుతోందీ ఆసీస్‌ డిజైనర్.

వాళ్ల కోరిక మేరకే..!

‘నా ప్రాణానికి ప్రాణమైన ఫ్రెండ్‌ ఒకరు చనిపోవడంతో ఈ ఆభరణాల తయారీ సంస్థను స్థాపించాను. దీని ద్వారా భౌతికంగా దూరమైన ఆప్తుల జ్ఞాపకాల్ని అందమైన జ్యుయలరీ రూపంలో అందించాలన్నదే నా ఆశయంగా పెట్టుకున్నా. మరణించిన వారి దంతాలు, జుట్టు, చితాభస్మం.. ఈ మూడింటినీ ఈ ఆభరణాల తయారీలో భాగం చేస్తున్నా. ఇందుకోసం ముందుగా ఆయా కుటుంబీకుల మనసులో ఏముందో, వారికి ఎలాంటి ఆభరణం కావాలో అడిగి తెలుసుకుంటాను. దాన్ని బట్టి ఉంగరాలు, చెవిదిద్దులు, నెక్లెస్‌, లాకెట్‌, బ్రేస్‌లెట్‌.. వంటివన్నీ చేత్తోనే రూపొందిస్తున్నాను. ఇందుకోసం బంగారం, వెండి, ప్లాటినం, నీలం-వజ్రం.. వంటి విలువైన లోహాల్ని, రాళ్లను ఉపయోగిస్తున్నా. మరికొంతమందైతే తాము కోల్పోయిన పెంపుడు జంతువుల జ్ఞాపకార్థం కూడా ఇలాంటి ఆభరణాలు తయారుచేయించుకుంటున్నారు..’ అంటోందీ ఆస్ట్రేలియన్‌ డిజైనర్.

‘ఇదేంటి అసహ్యంగా’.. అన్నారు!

అమ్మాయిలు విభిన్నంగా చేస్తానన్న పనిని ఈ సమాజం అస్సలు ఒప్పుకోదు. తన విషయంలోనూ ఇలాగే జరిగిందంటోంది జాక్వీ. ‘అందరిలా కాకుండా విభిన్నంగా చేయాలన్న ఆలోచన నాకు చిన్నతనం నుంచే అలవడింది. అందుకే నేను చేసే పనులు కొంతమందికి నచ్చక విమర్శిస్తుంటారు. ఇలా నేను ఈ జ్యుయలరీ డిజైనింగ్‌ కంపెనీని ప్రారంభించిన తర్వాత కూడా చాలామంది చాలా మాటలే అన్నారు. ‘ఏంటీ పని.. అసహ్యంగా..!’ అంటూ దెప్పిపొడిచేవారు. కానీ అవేవీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను చేసే పని నాకు నచ్చితే చాలనుకుంటాను. నా పని ఇతరుల్లో సంతోషం నింపితే అందులోనే సంతృప్తిని వెతుక్కుంటాను. నేను తయారుచేసిన ఆభరణాలు అందుకొని కస్టమర్లు తిరిగి సంతోషంతో వెనుదిరుగుతారు. అది నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంటుంది. ఈ జన్మకు ఇది చాలనిపిస్తుంటుంది..’ అంటూ తనకెదురైన సవాళ్లను గుర్తు చేసుకుందామె.

ఇలా వినియోగదారుల ఆలోచనలు, ఆభరణాల డిజైన్‌ని బట్టి.. ఒక్కో నగ తయారుచేయడానికి తనకు సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందట! అంతేకాదు.. ఆభరణాల డిజైన్‌, వాడిన మెటీరియల్‌ని బట్టి తాను తయారుచేసే నగల ధరలు రూ. 19,500 నుంచి రూ. 5.5 లక్షల దాకా ఉంటాయంటోందామె. ఏదేమైనా తనకున్న నైపుణ్యాలతో ఆప్తుల్ని కోల్పోయిన వారి ఆవేదన తీర్చుతోన్న జాక్వీ ఆలోచనను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న తన ఆభరణాల ఫొటోలు చూసి తన డిజైనింగ్‌ నైపుణ్యాలకు ముగ్ధులవుతున్నారు కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్