ఇంత పెద్ద విగ్గు.. ఎప్పుడైనా చూశారా?

ఈ రోజుల్లో తమదైన ప్రతిభను ప్రదర్శించి రికార్డులు సృష్టించేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందులో ఎక్కువభాగం మహిళలే ఉంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డానీ రెనాల్డ్స్ కూడా ఇదే కోవకు చెందుతుంది. 2017లో అమెరికా తార డ్రూ బ్యారీమోర్ ఓ టీవీ కార్యక్రమంలో 7 అడుగుల 4 అంగుళాల వెడల్పు....

Published : 06 Apr 2023 12:55 IST

(Photos: Guinness World Records)

ఈ రోజుల్లో తమదైన ప్రతిభను ప్రదర్శించి రికార్డులు సృష్టించేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందులో ఎక్కువభాగం మహిళలే ఉంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డానీ రెనాల్డ్స్ కూడా ఇదే కోవకు చెందుతుంది. 2017లో అమెరికా తార డ్రూ బ్యారీమోర్ ఓ టీవీ కార్యక్రమంలో 7 అడుగుల 4 అంగుళాల వెడల్పు గల విగ్గు ధరించి రికార్డు సృష్టించింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న డానీ తను కూడా అంతకంటే పెద్ద విగ్గు తయారుచేసి ధరించాలనుకుంది. ఈక్రమంలో ఇటీవలే 8 అడుగుల 6 అంగుళాల విగ్గు ధరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...

ఆ కార్యక్రమం చూసి...

అమెరికా తార డ్రూ బ్యారీమోర్ 2017లో ఓ కార్యక్రమంలో 7 అడుగుల 4 అంగుళాల విగ్గు ధరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ విగ్గును నిపుణులైన కెల్లీ హాన్సన్‌, రాండీ కార్ఫాగ్నోలు తయారుచేశారు. ఆస్ట్రేలియాకు చెందిన డానీ రెనాల్డ్స్ ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతో స్ఫూర్తి పొందింది. తను కూడా పెద్ద విగ్గు తయారు చేసి ధరించాలనుకుంది. అయితే స్వతహాగా ఆర్టిస్ట్‌ అయినా డానీకి ఇలా విగ్గు తయారు చేయడంలో ఎలాంటి అనుభవం లేదు. కానీ, తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకుంది.

రెండు నెలలు శ్రమించి...

డానీ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పక్కా ప్రణాళికను రూపొందించుకుంది. విగ్గు డిజైన్‌ కోసం డ్రూ ధరించిన విగ్గునే స్ఫూర్తిగా తీసుకుంది. అందులో చిన్న చిన్న మార్పులు చేస్తూ ఒక డిజైన్‌ను రూపొందించింది. ఇందుకు కావాల్సిన సింథటిక్‌ జుట్టు, పెద్ద రిబ్బన్లు, ఫ్యాబ్రిక్‌ను సిద్ధం చేసుకుంది. అయితే విగ్గు తయారు చేయడంలో ఇంతకు ముందు ఎలాంటి నైపుణ్యం లేకపోవడంతో విగ్‌ ఆర్టిస్ట్‌ మెగ్‌ విల్సన్ సహాయం తీసుకోవాలనుకుంది. అయితే విగ్గు తయారు చేసే క్రమంలో ఆమెకు ఒక సవాలు ఎదురైంది. రికార్డు సాధించాలంటే పెద్ద విగ్గు తయారు చేయడమే కాకుండా దానిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ధరించాలి. అప్పుడే రికార్డు సాధ్యమవుతుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మెగ్‌తో కలిసి రెండు నెలలు నిర్విరామంగా శ్రమించి విగ్గు తయారు చేసింది. ఇందుకోసం దాదాపు నాలుగు వేల ఆస్ట్రేలియా డాలర్లు ఖర్చు పెట్టిందట. అంటే మన కరెన్సీలో సుమారు 2.20 లక్షలు అన్నమాట.

ప్రదర్శన కూడా భారీగానే..!

రెండు నెలల పాటు శ్రమించి తయారు చేసిన విగ్గుకు అంతే స్థాయిలో ప్రచారం కల్పించాలనుకుంది డానీ. ఇందుకోసం అడిలైడ్‌లోనే అతి పెద్ద గ్యాలరీ అయిన ‘ఏస్‌ గ్యాలరీ’ని ఎంచుకుంది. ఇటీవలే జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల ముందు దీనిని ప్రదర్శించింది. ప్రదర్శనకు ముందు డ్రూ రికార్డును ప్రస్తావిస్తూ మెగ్‌తో కలిసి తాను స్వయంగా పెద్ద విగ్గు తయారుచేశానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అభిమానుల చప్పట్ల నడుమ ఆ విగ్గును ధరించింది. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీ విగ్‌ మేకర్‌ మ్యాట్‌ జాన్సన్‌ కూడా ఉన్నారు. ఆ తర్వాత గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్ వారు ఆమెకు ప్రశంసాపత్రాన్ని అందించారు. అయితే దీనికి సంబంధించిన వీడియోని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు ఇటీవలే తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని