Published : 27/07/2021 19:20 IST

మాస్క్‌తో మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?

కరోనా రాకతో రోజూ మాస్క్‌ ధరించడం మన జీవన విధానంలో ఓ భాగమైపోయింది. నిజానికి మాస్క్‌ లేకుండా బయటికి వెళ్తే ఏదో మర్చిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక నిరంతరాయంగా ఇలా మాస్కులు ధరించడం వల్ల వైరస్‌ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చన్న మాట వాస్తవమే అయినా దీని కారణంగా పలు చర్మ సమస్యలు రావడం మనలో చాలామందికి అనుభవమే! అయితే మాస్కుల వల్ల ఇలాంటిదే మరో సమస్య కూడా ఈ మధ్య చాలామందిలో కనిపిస్తోంది.. అదేంటంటే.. కళ్లద్దాలున్న వారు మాస్క్‌ పెట్టుకుంటే.. ముక్కు ద్వారా మనం బయటికి వదిలే వెచ్చటి గాలి లెన్స్‌లపై పొగమంచులాగా పరచుకొని అద్దాలను మసకబారేలా చేస్తుంది. కళ్లజోడు పెట్టుకునే చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. దీంతో సరిగ్గా కనిపించకపోవడం, పదే పదే ఇలా జరగడంతో అసౌకర్యానికి గురవడం.. వంటివి సహజమే! మరి, ఈ సమస్యకు పరిష్కారమేదైనా ఉందా? అంటే.. అందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

* మనం బయటికి వదిలిన గాలి వెచ్చగా, తేమతో కూడుకొని ఉంటుంది. అయితే మనం ధరించిన మాస్క్‌ వదులుగా ఉండడం వల్ల ఆ గాలి లెన్సులపై పొగమంచులాగా పరచుకుంటుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే ముఖానికి ఫిట్‌గా ఉండే మాస్క్‌ ధరిస్తే సరిపోతుంది. ఈ క్రమంలో మెటల్‌ నోస్‌ బ్రిడ్జ్‌ ఉన్న మాస్కులు ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ముక్కు ఆకృతిని బట్టి నోస్‌ బ్రిడ్జిని ఎడ్జస్ట్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది.

* కళ్లద్దాలను సోప్‌ లిక్విడ్‌/బేబీ షాంపూ, గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసినా ఈ సమస్య ఎదురుకాదని ఓ అధ్యయనం వెల్లడించింది. ఎందుకంటే ఈ పదార్థాలు తేమను గాజుపై పడకుండా అడ్డుకుంటాయట! ఇలా శుభ్రం చేసిన కళ్లద్దాలను గాలికి ఆరనిచ్చి.. ఆపై మైక్రోఫైబర్‌ క్లాత్‌తో తుడిచేసి వాడుకుంటే ఫలితం ఉంటుందట.

* కొంతమంది ఏదో పైపైన మాస్క్‌ పెట్టుకుంటుంటారు. దీనివల్ల కూడా మనం ముక్కు నుంచి బయటికి వదిలే గాలి కళ్లద్దాలపై పొగమంచులాగా పరచుకుంటుంది. కాబట్టి ముక్కు పైభాగం వరకు కవరయ్యే తరహాలో రూపొందించిన మాస్కులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ధరించి.. ఆపై కళ్లద్దాలు పెట్టుకుంటే అసలు ఈ సమస్యే రాదు.

* గురక, ముక్కు దిబ్బడ.. వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి నోస్‌ టేప్‌ లేదా నాసల్‌ స్ట్రిప్స్‌ ఉపయోగించడం మనకు తెలిసిందే! అయితే ఇదే చిట్కాను మాస్క్‌ పెట్టుకున్నప్పుడు కూడా పాటిస్తే.. మనం వదిలే గాలిలోని తేమ వల్ల కళ్లద్దాలు మసకబారకుండా జాగ్రత్తపడచ్చు. ఇందుకోసం మాస్క్‌ పెట్టుకున్నాక.. దానిపై ఓ నోస్‌ టేప్‌ లేదా నాసల్‌ స్ట్రిప్‌ను అంటిస్తే సరి!

* వదులైన మాస్క్‌ పదే పదే జారిపోతూ ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు మన మాస్క్‌కి ఒక మాస్క్‌ ఎక్స్‌టెండర్‌ని జోడిస్తే.. మాస్క్‌ని మనకు కావాల్సినంత ఫిట్‌గా ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. తద్వారా మనం వదిలే గాలి వల్ల కళ్లద్దాలు మసకబారకుండా ఉంటుంది.

* ఒక టిష్యూ పేపర్‌ను మడిచి మాస్క్‌ లోపలి వైపు అంటే మెటల్‌ నోస్‌ బ్రిడ్జ్‌ ఉన్న చోట అమర్చుకుంటే మాస్క్‌ మరింత బిగుతుగా మారుతుంది.. అలాగే దీనివల్ల అక్కడి చర్మంపై మాస్క్‌ అచ్చులు పడకుండా కూడా జాగ్రత్తపడచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి