మా అమ్మాయి దిగాలుగా ఉంటుంది.. సమస్యేంటో చెప్పదు..!

మా అమ్మాయి వయసు పాతికేళ్లు. ఓ ఐటీ సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కుటుంబపరంగా కూడా సమస్యలు లేవు. మంచి స్నేహితురాళ్లు ఉన్నారు.

Published : 04 Sep 2023 14:01 IST

మా అమ్మాయి వయసు పాతికేళ్లు. ఓ ఐటీ సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కుటుంబపరంగా కూడా సమస్యలు లేవు. మంచి స్నేహితురాళ్లు ఉన్నారు. అయినా ఈ మధ్య దిగాలుగా ఉంటోంది. మాతో తక్కువగా మాట్లాడుతోంది. నేను ఉండబట్టలేక ‘ప్రేమ సమస్యలు ఏమైనా ఉన్నాయా?’ అనడిగా. దానికి ‘అలాంటివి ఏమీ లేవు’ అని సమాధానమిచ్చింది. కానీ అసలు సమస్యేంటో చెప్పడం లేదు. ఎన్ని విధాలుగా ఆలోచించినా తన సమస్యేంటో తెలియడం లేదు. మా అమ్మాయిలో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు పోవాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ అమ్మాయి గురించి మీరు ఎంతో ముందుచూపుతో ఆలోచిస్తున్నారు. మీలాంటి తల్లి లభించినందుకు ఆమె సంతోషపడాలి. ఎలాంటి సమస్యలు లేకపోయినా ఆమె దిగాలుగా ఉంటోందని అంటున్నారు. సాధారణంగా మధ్యవయసు వారిలో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఈ లక్షణాలు పాతికేళ్ల వయసు వారిలో కూడా కనబడుతున్నాయి. సాధారణంగా ఈ వయసు వారు కెరీర్‌, రిలేషన్‌షిప్‌, ఆర్థిక సమస్యలు.. వంటి కారణాల వల్ల డిప్రెషన్‌కు లోనవుతుంటారు. అయితే మీ అమ్మాయి విషయంలో ఇలాంటి సమస్యలు లేవని చెబుతున్నారు. ఇవి కాకుండా అంతర్గతంగా మీతో చెప్పుకోలేని ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయేమో పరిశీలించండి.

మీ అమ్మాయి అసలు సమస్యను తెలుసుకోవడానికి ఆమెతోటే మాట్లాడానని చెప్పారు. అయితే ఆమె నుంచి సరైన సమాధానం రాలేదని అంటున్నారు. కాబట్టి, ఆమెకు కొంత సమయం ఇవ్వండి. ఈ సమయంలో ఆమెను ఒక కంట కనిపెడుతుండండి. అలా ఏదైనా కారణం తెలిసే అవకాశం ఉంటుంది. అప్పటికీ తెలియకపోతే ఆమె సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది చాలా సున్నితమైన అంశం. కాబట్టి, ఆమెతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైనా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ లక్షణాలకు తోడు నిద్ర, ఆకలి, ఆహారపుటలవాట్లలో కూడా తేడాలు కనిపిస్తే ఒకసారి మానసిక నిపుణులను సంప్రదించండి. వారు మీ అమ్మాయితో వివరంగా మాట్లాడి అసలు విషయం ఏమిటో రాబట్టడానికి ప్రయత్నిస్తారు. తగిన సలహా/చికిత్స అందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని