ఈ భూలోక దేవతల సౌందర్య రహస్యం తెలుసా?

వారి సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక.. ప్రేమకు, సౌందర్యానికి ప్రతీకగా నిలిచే గ్రీక్‌ దేవత ‘అఫ్రోడైట్‌’తో పోల్చాడు ప్రముఖ జర్మన్‌ కవి హెన్రిచ్‌ హెయిన్‌. అంతటితో ఆగకుండా ‘భువిపై పుట్టిన దేవతలు’ అంటూ వారి పట్ల తన ఆరాధన భావానికి అక్షరరూపమిచ్చాడు. ఇంతకీ కవుల కలాన్ని సైతం పులకరింపజేసిన ఆ సౌందర్యరాశులెవరో తెలుసా..? పోలండ్‌ భామలు.

Updated : 23 Nov 2021 12:12 IST

వారి సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక.. ప్రేమకు, సౌందర్యానికి ప్రతీకగా నిలిచే గ్రీక్‌ దేవత ‘అఫ్రోడైట్‌’తో పోల్చాడు ప్రముఖ జర్మన్‌ కవి హెన్రిచ్‌ హెయిన్‌. అంతటితో ఆగకుండా ‘భువిపై పుట్టిన దేవతలు’ అంటూ వారి పట్ల తన ఆరాధన భావానికి అక్షరరూపమిచ్చాడు. ఇంతకీ కవుల కలాన్ని సైతం పులకరింపజేసిన ఆ సౌందర్యరాశులెవరో తెలుసా..? పోలండ్‌ భామలు. పొడుగు కాళ్ల సుందరీమణులుగా పేరుగాంచిన వీరి సోయగం వెనక గల రహస్యాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ! ప్రకృతి ప్రసాదించే వనరులే మా సౌందర్యానికి రక్షణ కవచం అంటున్నారీ ముద్దుగుమ్మలు. మరి ప్రకృతినే వారి సోయగానికి రక్షణగా ఏర్పాటుచేసుకున్న పోలండ్‌ సొగసుల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దాం రండి..!

తేమ కోసం తేనె!

మనకు ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన ఉత్పత్తుల్లో తేనె ఒకటి. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా తేనె చెడిపోదు. అంతటి అద్భుతమైన రహస్యాలను తనలో ఇముడ్చుకున్న ఈ బంగారు వర్ణ తైలం.. అటు ఆరోగ్యానికి, ఇటు అందానికీ అంతే గొప్ప ఫలితాలను అందిస్తుంది. మనకు అందుబాటులో ఉండే అద్వితీయమైన సౌందర్య సాధనం కూడా ఇదే. దీన్ని చర్మంపై పూతలా వేయడం వల్ల మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుందంటున్నారీ మగువలు. వారు తేనెను తమ ముఖంపై మాస్క్‌లా అప్లై చేసి.. కాసేపు అలాగే ఉంచుకుని, ఆపై నీటితో శుభ్రం చేసుకుంటారు. ఈ ప్రక్రియ ద్వారా చర్మం పొడిబారదు.. పైగా ఇది శరీరానికి సహజంగా తేమను అందిస్తుంది. అంతేకాదు.. ఇది వయసు ఛాయలను తగ్గించి నవయవ్వనంగా ఉండేలా చేస్తుంది. దీనితో పాటు సూర్యుని నుండి వెలువడే హానికారక కిరణాల నుండి కూడా చర్మానికి రక్షణ అందిస్తుందని చెప్తున్నారీ మగువలు.

ఆలివ్‌ నూనెతో మృదువైన చర్మం!

సౌందర్యమంటే మన మోము మాత్రమే అందంగా ఉండటం కాదు. నఖశిఖపర్యంతం అందంగా మెరిసినప్పుడే అది సంపూర్ణం అవుతుంది. మనలో చాలామంది వారి దృష్టి మొత్తాన్ని ముఖ సౌందర్యం ఇనుమడింపజేయడం గురించే ఆలోచిస్తుంటారు. చేతులు, కాలి వేళ్ల సౌందర్య పోషణను పట్టించుకోరు. అందువల్ల అవి నిర్జీవంగా తయారవుతాయి. కానీ పోలండ్‌ అతివలు తమ మోముతో పాటు చేతులు, కాలి వేళ్లు ఆరోగ్యంగా ఉండడానికి ఆలివ్‌ నూనెను ఉపయోగిస్తున్నారు. అందుకోసం ముందుగా ఆలివ్‌ నూనెను ఓ గిన్నెలో తీసుకుని అందులో చేతి వేళ్లను కాసేపు నాన బెట్టాలి. ఇలా చేయడం వల్ల చేతి వేళ్లకు తేమ అందడంతో పాటు మృదువుగా మారుతాయి. అంతే కాకుండా.. చేతి గోళ్లకు సరైన పోషణ లభించడం వల్ల అవి విరిగిపోకుండా దృఢంగా పెరుగుతాయి. దీనితో పాటు మృత చర్మాన్ని తొలగించడానికి చెరకు నుండి తయారుచేసిన పంచదార, ఆలివ్‌ నూనె, అవకాడో బటర్‌ను సమపాళ్లలో తీసుకొని.. కలిపిన మిశ్రమాన్ని స్క్రబ్‌లా ఉపయోగిస్తారు. దీంతో చేతులకు, కాళ్లకు మాత్రమే కాకుండా ముఖానికి కూడా మర్దన చేసుకుంటూ అందంగా మెరిసిపోతున్నారు పోలండ్‌ అతివలు.

బేకింగ్‌ సోడాతో మచ్చలు మాయం!

అందమైన మోముపై చిన్న మచ్చ కనిపించినా మనం భరించలేం. దాని నుండి ఉమశమనం పొందడానికి ఎన్నో క్రీమ్స్‌ రాస్తాం. వాటి వల్ల మంచి ఫలితం రాకపోగా.. ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలే ఎక్కువ. మరి మోముపై ఏర్పడిన మచ్చల నుండి విముక్తి పొందడానికి ఒకసారి పోలండ్‌ మగువలు పాటించే చిట్కాను అనుసరించి చూడండి! ఇది పాటించడం ఎంతో సులభం కూడా! బేకింగ్‌ సోడాకు కొన్ని చుక్కల నీటిని కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దాన్ని ముఖంపై మచ్చలున్న చోట రాసుకుని కొన్ని నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అలా తరచూ చేయడం వల్ల మచ్చలకు చెక్‌ పెట్టచ్చంటున్నారీ అతివలు. మరి మీరూ ఓసారి ట్రైచేసి చూడండి. అయితే ఇది అన్ని చర్మతత్వాల వారికి నప్పకపోవచ్చు. కాబట్టి ఒకసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసి ట్రై చేయడం మంచిది. దీనితో పాటుగా పండ్లతో తయారుచేసుకునే మాస్క్‌, బాత్‌ పౌడర్‌.. వంటి వాటిలో కాస్త నిమ్మరసాన్ని కలిపి ఉపయోగించడం వల్ల కూడా మచ్చలేని సౌందర్యాన్ని పొందవచ్చని వారి స్వీయానుభవంతో వివరిస్తున్నారు. మరి ఎంతో సులభంగా ఉన్న ఈ చిట్కాలను మీ సౌందర్య చిట్కాల లిస్ట్‌లో చేర్చుకోండి.

గుడ్డు సొనతో కురులకు పోషణ!

ఆడవారి అందమంతా జుట్టులోనే దాగుంది. అందుకే ప్రతి అమ్మాయి దాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతుంటుంది. ఖరీదైన నూనెల నుండి షాంపూల వరకు అన్నింటినీ ఉపయోగిస్తుంది. కానీ సహజసిద్ధమైన వాటితో వచ్చే ఫలితం ఎటువంటి ఖరీదైన ఉత్పత్తులు అందించలేవు. ఈ క్రమంలోనే తమ కురుల పోషణ కోసం గుడ్డులోని పచ్చసొనను ఉపయోగిస్తున్నారీ పోలండ్‌ యువతులు. గుడ్డులోని పచ్చసొనను వేరు చేసి అందులో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె, నిమ్మరసాన్ని కలిపి మాడుకు పట్టించి.. 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గుడ్డు సొన లోని విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, డి.. వంటి పోషకాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. ఇక ఆలివ్‌ నూనె జుట్టుకు తేమను అందించి కురులను పొడిబారనివ్వదు, అలాగే నిమ్మరసం చుండ్రును తొలగించి జుట్టు రాలకుండా ఆపుతుంది. దీనితో పాటు జుట్టు నిగనిగలాడడానికి చామొమైల్‌ టీని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి ఓ 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు.. జుట్టు కాంతివంతంగా కనిపిస్తుంది.

నల్లని రోజాలో దాగున్న సౌందర్యం!

ముఖం, చేతులు, కాళ్లు.. ఇలా నఖశిఖపర్యంతం అందంగా మెరిసిపోవడానికి పోలండ్‌ దేశ అతివలు ఉపయోగించే సహజసిద్ధమైన సౌందర్య సాధనం నల్లటి రోజాపూలు (ముదురు వర్ణంలో ఉండే రోజాపూలు). ఈ క్రమంలోనే వారు తమ పూర్తి శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఈ పూలతో తయారుచేసిన బాడీ వాష్‌ను ఉపయోగిస్తున్నారు. నల్లని రోజా పూ రేకులను ఎండబెట్టి పొడిగా చేసి.. దానికి బబాసు బటర్‌ని కలిపి స్నానం చేసేటప్పుడు బాడీ వాష్‌గా ఉపయోగించడం, ఈ మిశ్రమాన్ని బాత్‌టబ్‌లో కలుపుకోవడం.. వంటివి చేస్తున్నారు. ఇది పూర్తి శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు.. చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. అంతేకాదు.. చాలామంది స్నానం చేసే క్రమంలో పాలను ఉపయోగిస్తుంటారు. పోలండ్‌ మగువలు కూడా అంతే! అయితే వీరు ఇందుకోసం గోట్‌ మిల్క్‌ను వాడతారు. దాంతో పూర్తి శరీరానికి పోషణ లభిస్తుందని వారు నమ్ముతారు.

చూశారుగా.. తమ సౌందర్యంతో కవులను సైతం మైమరపిస్తూ.. అందానికి సరికొత్త నిర్వచనాన్ని అందిస్తున్న పోలండ్‌ మగువల సౌందర్య రహస్యాలేంటో! మరి, మీరు కూడా ఈ ప్రకృతి ప్రసాదించిన చిట్కాలతో సౌందర్య దేవతల్లా మెరిసిపోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్