Published : 28/11/2021 12:30 IST

పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాల వెనకున్న రహస్యాలివే!

‘జగాన అతిశయాలు ఏడైనా... ఓ మాట్లాడే పువ్వా... నువ్వు ఎనిమిదో అతిశయమే.. నింగి లాంటి నీ కళ్లు.. పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాలు అతిశయమే..’ అంటూ మగువల సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక పాట రూపంలో వర్ణించాడో సినీ కవి. ఇంతటి అపురూప లావణ్యానికి తామేమీ తీసిపోమని, అందుకు పూర్వీకుల నుంచి తరతరాలుగా పాటిస్తూ వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులే కారణమంటున్నారు ‘స్పెయిన్‌ అతివలు’. బామ్మల సౌందర్య చిట్కాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ తమ అందానికి మెరుగులు దిద్దుతున్నారు. మరి, స్పెయిన్‌ ముద్దుగుమ్మల ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

‘ఆలివ్‌ నూనె’తో అందంగా..!

ఆలివ్‌ నూనె.. ఆరోగ్యానికి, అందానికి ఇది చేసే మేలు గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన ఈ తైలం.. చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలకూ చెక్‌ పెడుతుంది. అందుకే ఆలివ్‌ నూనెను తమ బ్యూటీ రొటీన్‌లో భాగం చేసుకుంటున్నారు స్పెయిన్‌ భామలు. స్నానం చేయడానికి గంట లేదా రెండు గంటల ముందు శరీరమంతా ఈ నూనెను అప్లై చేసుకుని నెమ్మదిగా మర్దన చేసుకుంటారు. ఫలితంగా చర్మానికి లోలోపలి నుండి పోషణ అంది.. మేను తేమను కోల్పోకుండా చేస్తుందీ నూనె. అలాగే ఎలాంటి ఫేస్‌మాస్క్‌ వేసుకోవాలన్నా.. గోరు వెచ్చని ఆలివ్‌ నూనెను ముఖానికి రాసుకుని ఆపై మాస్క్‌ని పూతలా రాసుకుంటారు స్పెయిన్‌ అతివలు. దీనివల్ల చర్మకణాలకు డ్యామేజ్‌ జరగకుండా కాపాడుకోవచ్చంటున్నారీ ముద్దుగుమ్మలు. ఇక తమ కురులకు కుదుళ్ల నుండి పోషణను అందించడంలో ముఖ్య పాత్ర ఆలివ్‌ నూనెదేనట. ఇందుకోసం జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ నూనెను పట్టించి.. ఆపై రెండు గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తారు. అంతేకాదు.. తాము తినే ఆహారంలో కూడా ఆలివ్‌ నూనెను భాగం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, అందం తమ సొంతమవుతుందంటున్నారు స్పెయిన్‌ భామలు.

‘ఉప్పు’తో స్క్రబ్‌..

పెరిగిపోతున్న కాలుష్యం, దుమ్ము శరీరంపై పేరుకుపోయి ఎన్నో చర్మ సమస్యలకు కారణమవుతున్నాయి. వీటి వల్ల అలర్జీ, మొటిమలు, మచ్చలు, ముడతలు, చర్మం తేమను కోల్పోయి పొడిబారడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చర్మ సమస్యలకు సంబంధించి పెద్ద లిస్టే తయారుచేయచ్చు. మరి, ఈ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందాలంటే.. చర్మంపై పేరుకుపోయిన మురికిని స్క్రబ్‌ ద్వారా శుభ్రం చేస్తే సరి. ఆ ప్రక్రియ కోసం ఉప్పును వాడుతూ తమ శరీరాన్ని మృదువుగా మార్చుకుంటున్నారు స్పెయిన్‌ అందాలు. స్నానమాచరించడానికి ముందు లేదా తీరిక సమయాల్లో ఉప్పుకి కాస్త తేనె, ఆలివ్‌ లేదా కొబ్బరి నూనె, ఏదైనా ఎసెన్షియల్‌ నూనెలను కలిపి స్క్రబ్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని శరీరానికి మాస్క్‌లా పట్టించి.. ఆపై మృదువుగా రుద్దాలి. ఈ ప్రక్రియ వల్ల ఉప్పు చర్మంపై పేరుకున్న మురికిని వదలగొడుతుంది. తేనె, నూనెలు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. ఇక ఎసెన్షియల్‌ నూనె వల్ల చర్మం పరిమళభరితంగా మారుతుంది. ఇలా స్పెయిన్‌ మహిళలు తమ చర్మాన్ని శుభ్రపరచుకోవడంతో పాటు.. అదే సమయంలో మేనికి పోషణను కూడా అందిస్తున్నారు.

‘బంగాళాదుంప’తో కంటికి స్వాంతన!

రుచిలోనే కాదు అందానికి మెరుగులద్దడంలోనూ బంగాళాదుంప కింగ్‌ అని చెప్పచ్చు. అందుకే స్పెయిన్‌ మగువలు కూడా తమ అందానికి అదనపు హంగులద్దడానికి బంగాళాదుంపను తమ బ్యూటీ రొటీన్‌లో చేర్చుకుంటున్నారు. విశ్రాంతి లేకపోవడం, నిద్రలేమి.. వంటి పలు కారణాల వల్ల కళ్లు అలసిపోవడం సహజం. ఈ సమస్యను పోగొట్టి కంటిని తిరిగి పునరుత్తేజితం చేయాలంటే బంగాళాదుంపని స్లైసుల్లా సన్నగా కట్‌ చేసి అలసిన కళ్లపై కాసేపు ఉంచుకుంటే సరిపోతుంది. అచ్చం కీరదోసలాగే కళ్లకు సాంత్వన అందిస్తుందీ దుంప. అంతేకాకుండా ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించడం వల్ల కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు. అలాగే మోచేతులు, మోకాళ్లు, మెడ భాగంలో కూడా చాలామందికి నల్లగా ఉంటుంది. అలాంటి వారు ఆయా ప్రదేశాల్లో గుండ్రంగా కట్‌ చేసిన బంగాళాదుంప ముక్కలతో కాసేపు రుద్దుకొని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆ సమస్య నుంచి త్వరగా బయటపడచ్చు.

కురులకు నేచురల్‌ కలర్‌..

ఫ్యాషన్‌ అని, అందంగా కనిపిస్తామని ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు తమ జుట్టుకు రకరకాల రంగులను అద్దడం కామనైపోయింది. కానీ ఆ కలర్స్‌లో వాడే రసాయనాల వల్ల జుట్టు పొడిబారడం, రాలిపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జుట్టుకు ఆరోగ్యాన్నందించడంతో పాటు.. కలర్‌ని అందించే అద్భుతమైన చిట్కా తమ వద్ద ఉందంటున్నారు స్పెయిన్‌ అతివలు. అది కూడా సహజసిద్ధమైనదేనట! అందుకోసం వారు పావు కప్పు క్రాన్‌ బెర్రీ రసానికి, పావు కప్పు నీళ్లను కలిపి మిశ్రమంగా తయారుచేస్తారు. తలస్నానం అనంతరం జుట్టును ఈ నీటితో శుభ్రం చేసుకుంటారు. ఫలితంగా జుట్టు సహజంగానే చక్కటి రంగులోకి మారడంతో పాటు కుదుళ్లకు పోషణ కూడా అందుతుంది. అలాగే ఈ మిశ్రమం జుట్టుకు కండిషనర్‌గానూ పనిచేస్తుంది. అందులో కాస్త లేత రంగు కావాలనుకుంటే దానికి ఓ చెంచా నిమ్మరసం కలిపితే సరి. ఈ చిట్కా వల్ల కురులకు లేత రంగును అద్దడంతో పాటు.. చుండ్రు కూడా మటుమాయం అవుతుంది.

హమామ్‌ బాత్‌..

హమామ్‌.. ఈ ప్రక్రియ ఇస్లామిక్‌ బ్యూటీ పద్ధతుల్లో ఒకటి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ దేశం నుంచి వలస వచ్చిన వారి ద్వారా ఈ పద్ధతి స్పెయిన్‌లోకి ప్రవేశించింది. అప్పటి నుండి దీన్ని తమ న్యాచురల్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌లో ఒకటిగా ఆచరిస్తున్నారు స్పెయిన్‌ బ్యూటీస్‌. ఆవిరి స్నానాన్ని పోలి ఉండే ఈ బాత్‌ ద్వారా నఖశిఖపర్యంతం ఏకకాలంలో శుభ్రం చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా ఏదైనా న్యాచురల్‌ స్క్రబ్‌ని ఉపయోగించి శరీరమంతా నెమ్మదిగా, మృదువుగా రుద్దుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇక స్నానమాచరించిన అనంతరం శరీరం మొత్తానికి ఏకకాలంలో ఆవిరి పట్టించాలి. ఫలితంగా చర్మగ్రంథులు తెరచుకొని లోపల ఉండిపోయిన మురికి, దుమ్ము బయటికి వెళ్లిపోతుంది. అలాగే ఈ ప్రక్రియ వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కనీసం వారానికి ఒక్కసారైనా ఈ హమామ్‌ బాత్‌ చేయడం వల్ల శరీరం శుభ్రమవడంతో పాటు మానసిక ఒత్తిళ్లు మటుమాయమై ప్రశాంతత దరిచేరుతుంది. ఇలా అటు అందానికి, ఇటు ఆరోగ్యానికి.. మరోవైపు మానసికంగానూ ఎంతో మేలు చేస్తుందీ స్నానం.

చూశారుగా.. ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో స్పెయిన్‌ మగువలు ఎంత అందంగా మెరిసిపోతున్నారో! మరి, మనం కూడా ఈ న్యాచురల్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌ని మన రోజువారీ బ్యూటీ రొటీన్‌లో భాగం చేసుకొని అందాల రాణులుగా వెలిగిపోదామా!!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని