Published : 04/07/2022 17:57 IST

పిల్లల్ని వాళ్ల గదిలో ఎప్పుడు పడుకోబెట్టాలి?

నిఖితకు ఐదేళ్ల కొడుకున్నాడు. చిన్నప్పట్నుంచీ తమతో పాటే వాడిని పడుకోబెట్టుకునే ఆమె.. ఇప్పుడు పిల్లల గదిలోకి మార్చుదామంటే వాడు అస్సలు వినట్లేదు.. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోవట్లేదు.

నమిత కూతురికి ప్రత్యేకంగా ఓ గది ఉంది. తనకు అందులో పడుకోవడమంటే ఇష్టమున్నా.. భయంతో ఒంటరిగా పడుకోలేదు.

సాధారణంగా మన దేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు 10-12 ఏళ్లొచ్చేదాకా తమ గదిలోనే పడుకోబెట్టుకుంటారు. ఇలా అలవాటవడం వల్ల ఆ తర్వాత వాళ్లకు ప్రత్యేకంగా గదిని కేటాయించినా ఆ పిల్లలు పడుకోలేరు. ఇది ఇటు దాంపత్య బంధాన్ని దెబ్బతీయడంతో పాటు.. అటు పిల్లల్లో స్వతంత్ర భావాలు రేకెత్తకుండా అడ్డుపడుతుందంటున్నారు నిపుణులు. అందుకే పసి వయసు నుంచే వాళ్లకు ప్రత్యేకమైన గదిని కేటాయించడం మేలంటున్నారు. ఇంతకీ, చిన్నారుల్ని ఏ వయసు నుంచి వాళ్ల గదిలో పడుకోబెట్టడం అలవాటు చేయాలి? దీనివల్ల అటు తల్లిదండ్రులకు, ఇటు పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి..!

కారణాలివే!

పిల్లల్ని పసి వయసు నుంచే విడిగా పడుకోబెట్టడం వల్ల ఎదిగే కొద్దీ వారిలో స్వేచ్ఛ, స్వతంత్ర భావాలు మెరుగవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మన దేశంలో మాత్రం చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పెద్దవాళ్లయ్యే దాకా వారికి తమ గదిలోనే చోటిస్తుంటారు. ఇందుకు పలు కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!

ఇంట్లో పిల్లలకంటూ ప్రత్యేకమైన గది లేకపోవడం.. ఒకవేళ ఉన్నా అందులో ఏసీ సదుపాయం లేకపోవడంతో కొన్నిసార్లు తల్లిదండ్రులతో కలిసి పడుకోవాల్సి వస్తుంది.

పిల్లల్ని విడిగా పడుకోబెడితే వాళ్లు భయపడతారేమో, లేదంటే టీవీ/మొబైల్‌.. వంటి గ్యాడ్జెట్స్‌కి అలవాటు పడతారేమోనన్న అనుమానంతో చాలామంది తల్లిదండ్రులు ఇందుకు నిరాకరిస్తున్నారట!

ఒంటరిగా పడుకోవడానికి భయపడి కొంతమంది చిన్నారులు మొదట్లో తమ గదిలో నిద్ర పోవడానికి భయపడుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

ఏ వయసులో గది కేటాయించాలి?

అప్పటిదాకా తమ తల్లిదండ్రులతో కలిసి పడుకున్న పిల్లలు.. ఊహ తెలిసే వయసొచ్చాక వారి నుంచి దూరంగా ఉండలేరు. ఒకవేళ వాళ్లు నిద్రపోయాక విడిగా పడుకోబెట్టినా.. మధ్యలో లేచి ఏడుస్తుంటారు. దీనివల్ల పేరెంట్స్‌ తమ గదిలో పడుకున్నా మనసంతా పిల్లల మీదే ఉంటుంది. ఇలా జరగకుండా చిన్నారులు తమ గదిలో హాయిగా పడుకోవాలంటే పసి వయసు నుంచే క్రమంగా వారిని విడిగా పడుకోబెట్టడం అలవాటు చేయాలంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

చిన్నారికి మూడు నెలల వయసున్నప్పట్నుంచే వారిని మీ మంచం నుంచి దూరంగా పడుకోబెట్టాలి. ఈ క్రమంలో బెడ్‌ పక్కనే ఉయ్యాల/క్రిబ్‌ వేసి అందులో పాపాయిని పడుకోబెట్టాలి. ఏడు నెలల నుంచి ఏడాది వయసొచ్చే దాకా ఇలా చేయచ్చు.

ఇక ఏడాది దాటిన పిల్లల్ని ప్రత్యేక గదిలో పడుకోబెట్టడం అలవాటు చేయించాలంటున్నారు నిపుణులు. అలాగని రాత్రంతా వారిని అలా వదిలేయడం కాకుండా.. కొన్ని గంటల చొప్పున పెంచుతూ పోవాలి. ఈ క్రమంలో వారిని మధ్యమధ్యలో గమనించడం, వారి అవసరాలు తీర్చడం ముఖ్యం.

ఇలా చేస్తే కొన్నాళ్లకు వాళ్ల గదిలో పడుకోవడానికి వారు అలవాటు పడతారు. అంతేకాదు.. మీ చిన్నారి పడుకున్న గదిలో ఓ కెమెరా/బేబీ మానిటర్‌ అమర్చడం, దాన్ని మీ మొబైల్‌కు కనెక్ట్‌ చేసుకోవడం, తరచూ వాళ్ల కదలికల్ని గమనించడం మర్చిపోవద్దు. దీనివల్ల వాళ్లు ప్రత్యేక గదిలో పడుకోవడానికి అలవాటు పడతారు. అలాగే వాళ్లెలా పడుకుంటారోనన్న భయమూ మీకు ఉండదు.


ఇవి గుర్తుంచుకోండి!

చిన్న వయసు నుంచే పిల్లల్ని విడిగా పడుకోబెట్టడంతో పాటు తల్లిదండ్రులు మరికొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల వాళ్ల గదిలో పడుకోవడానికి పిల్లలు మరింత ఉత్సాహం చూపుతారని చెబుతున్నారు.

పిల్లల పడకగదిని ప్రత్యేకంగా అలంకరించడం వల్ల కూడా వారిలో తమ గది పట్ల ఆసక్తిని పెంచచ్చు. ఈ క్రమంలో వాళ్లకు ఇష్టమైన వాల్‌ పెయింటింగ్స్‌, వాల్‌ హ్యాంగింగ్స్‌, థీమ్‌ బెడ్‌, బొమ్మలు, ఇతర అలంకరణ వస్తువులతో ఆ గదిని ప్రత్యేకంగా అలంకరించాలి. అలాగే పెరిగే వారి వయసును బట్టి వీటిలో మార్పులు-చేర్పులు చేయడం కూడా ముఖ్యమే.

పిల్లల్ని భయపెట్టే విషయాలు, వాళ్ల ముందే హారర్‌ సినిమాలు చూడడం వల్ల వాళ్లు ఒంటరిగా తమ గదిలో ఉండడానికి భయపడుతుంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్ని పిల్లలకు దూరంగా ఉంచడం మంచిది.

పిల్లలు ఒంటరిగా తమ గదిలో పడుకోలేకపోతే.. కొన్ని రోజులు మీరు కానీ, మీవారు కానీ వాళ్లతో కాసేపు పడుకొని.. క్రమంగా వారిని ఒంటరిగా పడుకునేలా అలవాటు చేయించాలి.

కొంతమంది పేరెంట్స్‌ తమ ఇంటికొచ్చిన అతిథుల్ని పిల్లలతో పాటే కలిసి పడుకునేలా ఏర్పాటుచేస్తుంటారు. ఇది అస్సలు కరక్ట్‌ కాదు. ఇలాంటప్పుడు మీ పిల్లల్ని మీతో పాటే పడుకోబెట్టుకొని.. అవసరమైతే వాళ్లకు పిల్లల పడకగదిని కేటాయించడం మంచిది.

చిన్నారులు తమ గదిలో పడుకునేలా ప్రోత్సహించాలంటే.. ముందు తల్లిదండ్రులు వాళ్లతో స్నేహంగా మెలగడం, వారికి తగిన సమయం కేటాయించడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. దీనివల్ల వారిలో అభద్రతా భావం నెలకొనకుండా ఉంటుంది.. అలాగే ఏ సమస్య ఉన్నా వారు నిర్మొహమాటంగా తల్లిదండ్రులకు చెప్పగలుగుతారు.

చిన్న వయసు నుంచే వారిని విడిగా పడుకోబెట్టినా.. మధ్యమధ్యలో వారి అవసరాలు తీర్చడం, వారికి అందుబాటులో ఉండడం, వారి గదిలో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే!


ఇద్దరికీ మంచిదే!

పిల్లల్ని విడిగా పడుకోబెట్టడం వల్ల అటు చిన్నారులకు, ఇటు తల్లిదండ్రులకు పలు ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

చిన్నారులకూ వాళ్ల గదిని ప్రత్యేకంగా అలంకరించుకోవాలన్న ఆరాటం ఉంటుంది. ఈ క్రమంలో వారిలో ఉన్న ఆర్ట్‌/క్రాఫ్టింగ్‌/డ్రాయింగ్‌.. వంటి మెలకువలు బయటపడుతుంటాయి. ఇవి వారిలో సృజనాత్మక ఆలోచనలు పెంచేలా చేస్తాయి.

విడిగా గదిలో పడుకున్న పిల్లల్లో స్వతంత్ర భావాలు మెరుగుపడతాయంటున్నారు నిపుణులు. అంటే వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడం అలవాటవుతుందన్న మాట! ఇది క్రమంగా ప్రతి విషయంలోనూ వారిని బాధ్యతాయుతంగా మారుస్తుందంటున్నారు నిపుణులు.

పిల్లలకంటూ ప్రత్యేక గది ఉండడం వల్ల.. వాళ్లకంటూ ఓ వ్యక్తిగత ప్రదేశం దొరుకుతుంది. అలాగే ఎలాంటి అంతరాయం లేకుండా చదువుకోవడం, ఇతర పనులు చేసుకోవడం అలవాటవుతుంది.

పిల్లలు తమతో కలిసి పడుకోవడం వల్ల తమకంటూ ఏకాంత సమయం దొరకట్లేదని చాలామంది దంపతులు చెబుతుంటారు. దీనివల్ల సంసార జీవితంలో కలతలు రేగే అవకాశం ఉంటుంది. అదే వారిని విడిగా పడుకోబెట్టడం వల్ల దాంపత్య బంధానికీ ఎలాంటి లోటూ ఉండదని చెబుతున్నారు నిపుణులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని