ఆమె ఆటో.. ఈమె క్యాబ్.. కన్నబిడ్డలతో సహా జీవన పోరాటం..!

ఇంటి పని, పిల్లల ఆలనా పాలన, వృత్తిఉద్యోగాలు.. వీటన్నింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగడమంటే మహిళలకు కత్తి మీద సామే! కానీ ఈ ఇద్దరు మహిళలు మాత్రం వీటిని సమన్వయం చేసుకోవడమే కాదు.. కష్టాలకు ఎదురీదుతూ జీవితానికే సవాల్‌ విసురుతున్నారు. వ్యాపారంలో నష్టపోయి ఒకరు, కట్టుకున్నోడు వదిలేసి.....

Published : 03 Nov 2022 12:55 IST

(Photo: Twitter)

ఇంటి పని, పిల్లల ఆలనా పాలన, వృత్తిఉద్యోగాలు.. వీటన్నింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగడమంటే మహిళలకు కత్తి మీద సామే! కానీ ఈ ఇద్దరు మహిళలు మాత్రం వీటిని సమన్వయం చేసుకోవడమే కాదు.. కష్టాలకు ఎదురీదుతూ జీవితానికే సవాల్‌ విసురుతున్నారు. వ్యాపారంలో నష్టపోయి ఒకరు, కట్టుకున్నోడు వదిలేసి మరొకరు ఇబ్బందుల్లో పడినా.. ధైర్యంగా వాటిని అధిగమించేందుకు తమ కన్నబిడ్డలతో సహా పోరాటం చేస్తున్నారు. ఓవైపు పిల్లల్ని చూసుకుంటూనే, మరోవైపు తాము నమ్ముకున్న వృత్తినీ కొనసాగిస్తోన్న ఈ ఇద్దరు మహిళల కథ ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి రగిలిస్తుందనడంలో సందేహం లేదు.

వ్యాపారంలో నష్టపోయి..!

తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచినట్లు.. గొప్ప వ్యాపారవేత్త కావాలని కలలు కన్న బెంగళూరుకు చెందిన నందిని.. ఆఖరికి ఉబర్‌ డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తాను పొదుపు చేసిన డబ్బుతో ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ ప్రారంభించిన ఆమెను కరోనా రూపంలో దురదృష్టం వెంటాడింది. దాంతో వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన ఆమె.. తాను కోల్పోయిన డబ్బును తిరిగి పొందడానికి ఉబర్‌ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరింది. ఓ నెటిజన్ ఇటీవలే నందిని కథను ఫొటోతో సహా లింక్డిన్‌లో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరలవుతోంది.

‘నిన్న నా ఫ్రెండ్‌ నాకోసం ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేశాడు. దాంతో ఈ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తోన్న నందిని అనే ఈ మహిళ నన్ను పికప్‌ చేసుకోవడానికి వచ్చారు. ప్రయాణం ప్రారంభమయ్యాక ఆమె పక్క సీట్లో ఓ చిన్నారి నిద్రపోవడం నేను గమనించాను. ఉండబట్టలేక అడిగేశా.. ‘మేడం, ఆ పాప మీ కూతురా?’ అని. అవునంటూ తను సమాధానమిచ్చారు. తననూ రోజూ నాతో పాటే రైడ్‌కి తీసుకొస్తానని, ఓవైపు వృత్తిని-మరోవైపు పాప ఆలనా పాలన చూస్తానంటూ చెప్పుకొచ్చారామె. దీంతో ఆమె గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నా.

ఆమె కథ.. ఎందరికో స్ఫూర్తి!

కొన్నేళ్ల క్రితం తాను పొదుపు చేసుకున్న డబ్బుతో ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ ప్రారంభించినా.. కరోనా సమయంలో పెట్టిన పెట్టుబడంతా నష్టపోయానని, అందుకే ఆ డబ్బును తిరిగి సమకూర్చుకోవడానికే ఉబర్‌లో డ్రైవర్‌గా మారానంటూ నందిని చెప్పారు. ఈ క్రమంలో రోజుకు 12 గంటలు పనిచేస్తానని, ఈ సమయంలో తన కూతురిని తానే చూసుకుంటానని, ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేయడం కష్టమైనా.. ఇష్టంగా భరిస్తున్నానంటూ తాను పంచుకున్న కథ వింటుంటే ఎంతో స్ఫూర్తిగా అనిపించింది. చాలామంది ఓటమి ఎదురైతే కుంగిపోతారు. కానీ సవాళ్లకే సవాలు విసురుతూ గెలిచే దాకా పోరాటం ఆపనంటోన్న నందిని కథ అందరితో పంచుకోవాలనిపించింది. అందుకే ఆమె అనుమతి తీసుకొని ఆమె స్టోరీని లింక్డిన్‌లో పోస్ట్‌ చేశా..’ అంటూ నందిని స్ఫూర్తిదాయక కథను పంచుకున్నారు ఆ నెటిజన్. దీంతో ఉబర్‌ సంస్థ యాజమాన్యమే కాదు.. ఎంతోమంది నెటిజన్లు కూడా నందిని ప్రయత్నాన్ని కొనియాడుతున్నారు. ఓవైపు అమ్మతనాన్ని, మరోవైపు వృత్తినీ బ్యాలన్స్‌ చేస్తూ ముందుకు సాగుతోన్న ఆమె పోరాటపటిమను ప్రశంసిస్తున్నారు.


కట్టుకున్నోడు వదిలేసినా..!

జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త మధ్యలోనే వదిలేసినా.. నిరాశ చెందకుండా స్వశక్తితో రాణిస్తోంది నోయిడాకు చెందిన సింగిల్‌ మామ్‌ చంచల్‌ శర్మ. పదో తరగతి మధ్యలోనే ఆపేసిన ఆమెకు పెళ్లై ఓ కొడుకు పుట్టాడు. ఆపై వివిధ కారణాల రీత్యా భర్త నుంచి వేరుగా ఉంటోన్న ఆమె.. మొదట్లో పలు ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. అవి విఫలం కావడంతో ఈ-రిక్షా నడుపుతూ జీవనం కొనసాగిస్తోంది. తన ఏడాది కొడుకును నడుముకు కట్టుకొని మరీ ఆటో సవారీ చేస్తోందామె.
‘నా రోజువారీ దినచర్య ఉదయం 6.30 గంటలకు మొదలవుతుంది. ఇక మధ్యాహ్నం మళ్లీ ఇంటికెళ్లి బాబుకు స్నానం చేయించి, నేను భోజనం చేసి.. తిరిగి రైడ్‌ ప్రారంభిస్తా. ఇక బాబు ఆకలి తీర్చడానికి ఓ పాల బాటిల్‌, ఉగ్గు వెంటే ఉంచుకుంటా. నా కొడుకును ఇంట్లో వదిలేద్దామంటే అమ్మ, తమ్ముడు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండడంతో చూసుకునే వారు ఎవరూ లేరు. అందుకే నా కొడుకును ఎప్పుడూ నా వెంటే ఉంచుకుంటా. ఈ-రిక్షా నడుపుతూ రోజుకు 600-700 దాకా సంపాదిస్తున్నా. అందులో 300 ఈ వాహన రుణానికి పోగా.. మిగతా డబ్బుతో ఇల్లు చక్కదిద్దుకుంటున్నా. భవిష్యత్తులో నా కొడుక్కి ఉన్నత భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది చంచల్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని