ఏడడుగుల రుమెయ్‌సా.. అమెరికా ప్రయాణం ఇలా..!

తొలి విమాన ప్రయాణం ఎవరికైనా మధురానుభూతే! తనకు మాత్రం అంతకుమించి అంటోంది టర్కీ (తుర్కియే)కి చెందిన రుమెయ్‌సా  గెల్గీ. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు సృష్టించిన ఆమె.. తాజాగా 13 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం చేసింది. మరి, మనమైతే నేరుగా వెళ్లి....

Updated : 05 Nov 2022 18:12 IST

(Photo: Instagram)

తొలి విమాన ప్రయాణం ఎవరికైనా మధురానుభూతే! తనకు మాత్రం అంతకుమించి అంటోంది టర్కీ (తుర్కియే)కి చెందిన రుమెయ్‌సా  గెల్గీ. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు సృష్టించిన ఆమె.. తాజాగా 13 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం చేసింది. మరి, మనమైతే నేరుగా వెళ్లి సీట్లో కూర్చుంటాం.. కానీ ఏడడుగులకు పైగా ఎత్తున్న రుమెయ్సాకు ఇది వీలు కాదు. అందుకే టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఆమె కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఇలా తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోల్ని ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి.

ఒకటి కాదు... రెండు కాదు... రుమెయ్‌సా  గెల్గీ చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్యాలతో సహజీవనం చేస్తోంది. పుట్టుకతోనే దివ్యాంగురాలిగా ఈ భూమ్మీద అడుగుపెట్టింది. ఆ తర్వాత జన్యుపరమైన రుగ్మతల బారిన పడి అసాధారణంగా ఎత్తు పెరిగింది. కాళ్లు, చేతులు కూడా విపరీతమైన పొడవు పెరిగాయి. వీటికి తోడు కొన్ని శారీరక సమస్యలతో వీల్‌ఛైర్‌ లేకపోతే కానీ ముందుకు అడుగేయలేని పరిస్థితి ఆమెది!

7 అడుగుల పొడవుతో గిన్నిస్‌కెక్కింది!

ఇలా అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటున్నా తాను మాత్రం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానంటోంది రుమెయ్‌సా . తన ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తన సమస్యల గురించి నలుగురికీ చెబుతూ అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం 7 అడుగుల 0.7 అంగుళాల పొడవు ఉన్న ఈ టర్కీ యువతి ‘ప్రపంచంలో జీవించి ఉన్నవాళ్లలో అత్యంత పొడవైన మహిళగా’ గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

అయితే ఇలా గిన్నిస్‌కెక్కడం రుమెయ్‌సాకు కొత్తేమీ కాదు. 2014లో ‘ప్రపంచంలో అత్యంత పొడవైన టీనేజ్ యువతి’ గా మొదటిసారి అందరి దృష్టినీ ఆకర్షించిందామె. అప్పుడు తన వయసు 18 ఏళ్లు కాగా... ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు. గతేడాది తన పొడవుతో మరోసారి గిన్నిస్‌లో చోటు సంపాదించిందీ యంగ్‌ వుమన్‌. ఇవే కాదు.. అత్యంత పొడవైన వేళ్లు కలిగిన మహిళగా, అత్యంత పొడవైన వీపు కలిగిన మహిళగానూ ఆమె పేరిట రికార్డులున్నాయి.

అదే నా పొడవుకు కారణం!

తానింత పొడవు పెరగడానికి తనకున్న జన్యు సమస్యే కారణమంటోంది రుమెయ్‌సా. ‘నేనిలా పొడవు పెరగడానికి ‘వీవర్ సిండ్రోమ్‌’ సమస్యే కారణం. ఇది చాలా అరుదుగా కనిపించే ఓ జన్యుపరమైన సమస్య. మా కుటుంబీకులు, పూర్వీకుల్లో ఎవరికీ ఈ సమస్య లేదు. ఇక టర్కీలో కేవలం నేను మాత్రమే ఈ సమస్యతో బాధపడుతున్నాను. దీనివల్ల సాధారణం కంటే వేగంగా పొడవు పెరుగుతున్నాను. ఇదే కాదు.. నాకు పుట్టుకతోనే Scoliosis (వెన్నెముక వంపు తిరగడం) అనే రుగ్మత ఉంది. దీనివల్ల పలు శారీరక సమస్యలు తలెత్తాయి. కొన్నేళ్ల క్రితం సర్జరీ చేసి నా వెన్నెముకలో రెండు టైటానియం రాడ్లను అమర్చారు. ఇలా నాకున్న శారీరక సమస్యలతో నా జీవిత కాలంలో ఎక్కువ సమయం చక్రాల కుర్చీలోనే గడపాల్సి వస్తోంది. వాకర్స్‌ ఫ్రేమ్‌ సహాయంతో మాత్రమే నడవగలుగుతున్నాను..’

అయినా నేనెప్పుడూ దిగులు చెందలేదు!

‘నాకున్న శారీరక సమస్యల కారణంగా ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నాను. అయితే ప్రస్తుతం వాటి గురించి ఆలోచించడం లేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నన్ను నేను ప్రేమించుకుంటున్నా. సమస్యలను పక్కన పెట్టి ప్రశాంత జీవనం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాను. నా పొడవు గురించి నేను ఎప్పుడూ దిగులు చెందలేదు. ఎందుకంటే ఇదే నన్ను నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. రెండుసార్లు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లోకి ఎక్కేలా చేసింది. సోషల్‌ మీడియాలో ధైర్యంగా నా ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తాను. అదేవిధంగా నాకున్న సమస్యల గురించి వివరంగా చెబుతాను. వీటికి చాలామంది సానుకూలంగానే స్పందించి కామెంట్లు పెడుతుంటారు. ఇక బయటకు వెళుతున్నప్పుడు కూడా చాలామంది నాతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతారు. అప్పుడప్పుడూ కొందరు సమాధానం చెప్పలేని ప్రశ్నలతో విసిగిస్తారు. అలాంటప్పుడు కొంచెం బాధగా అనిపించినా కొద్దిసేపయ్యాక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తాను.. మనకున్న ప్రతికూలతల్ని సానుకూలంగా మార్చుకోవాలి. మనల్ని మనం అంగీకరించుకోవాలి. ప్రేమించుకోవాలి. మన శక్తి సామర్థ్యాలను గుర్తించి అందులో ఉత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నా..’

నెట్‌ఫ్లిక్స్‌తో రిలాక్స్ అవుతుంటా!

‘నా సమస్యలను అధిగమించడంలో నా కుటుంబ సభ్యుల పాత్ర మరవలేనిది. వారు నాకు అన్ని విషయాల్లో తోడుగా నిలుస్తున్నారు. ఇక రిలాక్స్ కావడానికి ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌ చూస్తాను. అమ్మతో ఎక్కువ సమయం గడుపుతాను. కుటుంబ సభ్యులతో కలిసి బయట డిన్నర్లకు వెళుతుంటాను. స్విమ్మింగ్‌ కూడా చేస్తుంటాను. ‘సుల్తాన్‌ కొజెన్’ (ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తి) టర్కీలోనే ఉంటారని తెలుసు. అతను కూడా బ్రెయిన్ ట్యూమర్ వంటి సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. అయితే నేనెప్పుడూ అతనిని కలవలేదు. భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా కలుస్తాను.. ’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకుంది రుమెయ్‌సా.

ఇది నా మొదటి విమాన ప్రయాణం..!

ప్రస్తుతం టర్కీలోని ఓ కంపెనీలో సాంకేతిక విభాగంలో పనిచేస్తోన్న రుమెయ్‌సా .. మరిన్ని అవకాశాల కోసం తాజాగా అమెరికా వెళ్లింది. ఈ క్రమంలో ఆమె మొదటిసారి విమాన ప్రయాణం చేసింది. టర్కీలోని ఇస్తాంబుల్‌ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిన్కోకు 13 గంటల సుదీర్ఘ ప్రయాణంలో తనకెలాంటి ఇబ్బంది కలగకుండా టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ విమానంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఆరు సీట్లను ఓ స్ట్రెచర్లా ఏర్పాటుచేసి.. ఆమె నిద్రించేందుకు అనువుగా మార్చింది. ఈ ఫొటోల్ని ఇన్‌స్టాలో పంచుకున్న రుమెయ్‌సా.. ‘ఇది నా తొలి విమాన ప్రయాణం. ఎంతో అద్భుతంగా సాగింది. అయితే ఇదే చివరిది కాకూడదని, ఇలాంటి ప్రయాణాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా..’ అంటూ తన అనుభవాల్ని పంచుకుంది. టర్కిష్‌ విమానయాన సంస్థకు ధన్యవాదాలు కూడా తెలిపింది. దీనికి వాళ్లు స్పందిస్తూ.. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉంటామంటూ రీపోస్ట్‌ పెట్టారు.

‘నాకు సాఫ్ట్‌వేర్‌, కంప్యూటర్లపై బాగా అవగాహన ఉంది. ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్‌గా అనుభవం గడించాను. వెబ్ డెవలపర్‌గా శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాను. STEM (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) రంగంలో పనిచేయాలన్నది నా చిన్నప్పటి కోరిక.. ఈ అవకాశాల కోసమే అమెరికాలో వాలాను..’ అంటోన్న రుమెయ్‌సా తన చిరకాల కోరిక నెరవేర్చుకోవాలని మనమూ ఆశిద్దాం..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్