మార్పు మన నుంచే..!

పెరిగిపోతున్న చెత్త, కాలుష్యం... ఎన్ని అనారోగ్యాలకి కారణమవుతున్నాయో కదా! ఒక్కోసారి రేపటి తరాల భవిష్యత్తేంటన్న ఆందోళననీ కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తే బాగుండని కోరుకుంటే సరిపోదు. మనవంతుగా ప్రయత్నించాలి కూడా. ఎలాగంటారా... ఇదిగో ఇలా!

Published : 27 Jun 2024 04:43 IST

పెరిగిపోతున్న చెత్త, కాలుష్యం... ఎన్ని అనారోగ్యాలకి కారణమవుతున్నాయో కదా! ఒక్కోసారి రేపటి తరాల భవిష్యత్తేంటన్న ఆందోళననీ కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తే బాగుండని కోరుకుంటే సరిపోదు. మనవంతుగా ప్రయత్నించాలి కూడా. ఎలాగంటారా... ఇదిగో ఇలా!

సస్టెయినబిలిటీ... ఈ మధ్య బాగా వినిపిస్తోన్న పదం. అవసరాలతో రాజీపడకుండానే భవిష్యత్‌ తరాలకు ఇబ్బంది కలగకుండా జీవించడం దీని ఉద్దేశం. వస్తువు పాడవగానే ఏం చేస్తాం? మరొకటి తెప్పించుకుంటాం. బాగు చేసుకోవడం రాదు, రిపేర్‌ చేసేవారు దొరుకుతారో లేదో... ఇలా అనేక కారణాలు వెతుక్కుంటాం. తరవాత నెమ్మదిగా చెత్తబుట్ట పాలు చేస్తాం. కానీ దానివల్ల భూమిపై చెత్త పేరుకుంటోంది. కొన్ని భూమిలో కలవడానికి వందల ఏళ్లు కూడా తీసుకుంటాయి. కాబట్టి, విరిగిన కుర్చీలు, బొమ్మలు, పగిలిన సీసాలు... ఏవైనా మరమ్మతు చేసి తిరిగి వాడటమో, వాటికి కొత్త రూపు ఇవ్వడమో చేస్తే సరి. వృథా చాలావరకూ తగ్గుతుంది.

స్మార్ట్‌గా ఆలోచిస్తే...

‘మేం పేపర్‌ బ్యాగులనే తీసుకుంటున్నాం’... ప్లాస్టిక్‌ గురించి అవగాహన పెరిగాక చాలామంది చెప్పే మాటే ఇది. కానీ అవి త్వరగా చినిగిపోతాయి. పైగా వీటివల్ల బలయ్యే చెట్లూ ఎక్కువే. ఆ నష్టాన్ని ఆపాలంటే బయటికి వెళ్లేటప్పుడు వెంట ఓ క్లాత్‌ బ్యాగ్‌ తీసుకెళ్లండి. ఎలక్ట్రిక్‌ వస్తువులు తీసుకునేప్పుడు బ్యాటరీవి ఎంచుకోండి. పేపర్‌ టవళ్లకు బదులు వస్త్రాలతో చేసినవి, ప్లాస్టిక్, పేపర్‌ కప్‌లకు బదులు పిండితో చేసినవి... ఆలోచించాలేగానీ ప్రత్యామ్నాయాలు బోలెడు. ఏం చేసేముందైనా క్షణం ఆగి, నిర్ణయం తీసుకుంటే చాలు. చెత్త పేరుకోకుండా ఆపొచ్చు.

వంటింటి వ్యర్థాల సంగతేంటి?

కాఫీ పొడి దగ్గర్నుంచి ఉల్లిపొట్టు వరకు రోజూ చెత్తబుట్టను చేరే వ్యర్థాలెన్నో. ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ మొక్కలు సాధారణం అయ్యాయి కదా! వాటికి బయటి నుంచి ఎరువు కొని తెస్తుంటాం కూడా. బదులుగా కాస్త శ్రమిస్తే వృథా బయటికి పోదు, ఎరువూ సొంతంగా తయారు చేసుకున్నట్లు అవుతుంది. ఎలాగంటే... వాడని డబ్బాలోనో నేలలో గుంటతీసో... ఎండిన ఆకులు, కాస్త మట్టి, ఈ వంటింటి వ్యర్థాలను వేస్తూ వెళ్లండి. మధ్యలో కలుపుతూ ఉంటే చాలు. చక్కని ఎరువు. కొన్ని కూరగాయల మొక్కలు వేశారంటే ఇంటి పంటతో శరీరానికీ, మొక్కల పెంపకంతో మనసుకీ ఆరోగ్యం.

శుభ్రత కాదది...

ఇల్లు, పాత్రలు, దుస్తులు మెరిసిపోవాలని ఎన్నెన్ని క్లీనింగ్‌ డిటర్జెంట్‌లను వాడతామో! వీటితో మనతోపాటు పర్యావరణానికీ హానే. నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. కాబట్టి, వాడిన నీటినే శుద్ధి చేసుకుని వాడుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఈ డిటర్జెంట్లలోని రసాయనాలు త్వరగా పోవు. పైగా పొరపాటున వీటిని తాగితే జంతువులకీ హాని. కాబట్టి, ఇప్పుడు సహజ ప్రత్యామ్నాయాలెన్నో మార్కెట్‌లోకి వస్తున్నాయి. నురగ తక్కువ అన్న అసంతృప్తిని పక్కనపెట్టి, వాటిని వాడితే ఆరోగ్యమూ మన దరిచేరుతుంది.

ఇంకా... ‘మినిమమ్‌’ మంత్రం పఠించేయండి. తిరిగి వాడుకోవడం కాదు... వాడకాన్ని తగ్గించండి. దుస్తులు, కాస్మెటిక్స్‌ సహా ఏవి కొంటున్నా ‘ఇది లేకపోతే మనకు కష్టమా’ అని ప్రశ్నించుకోండి. తప్పనిసరి అనిపిస్తే సరే... లేకపోయినా పర్లేదు అనిపించిందా కొనొద్దు. కాంపాక్ట్‌ ఫ్లోరసెంట్‌ లైట్‌ బల్బులు వాడటం, పైపులను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడం, అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు వేయడం వంటివి తగ్గించినా పర్యావరణానికి మేలు చేసినట్టే. ఇవన్నీ మన చేతిలో ఉన్నవే... అశ్రద్ధ చేస్తుంటాం. గమనించుకుంటే  చాలు... పర్యావరణానికి తద్వారా భవిష్యత్తు తరాలకు సాయపడ్డట్టే. ప్రయత్నిద్దామా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్