Father’s Day: నాన్నతో అనుబంధం.. ఎంతని చెప్పం..?

మన జీవితంలో ఎంతమంది మనకు తోడున్నా.. అడుగడుగునా నాన్న అందించే ప్రోత్సాహం, ప్రేరణ మాత్రం ప్రత్యేకం. ఆయనతో గడిపిన ప్రతి క్షణం అపురూపం. వ్యక్తిగతంగా విలువలు నేర్పడమే కాదు.. ఎంచుకున్న కెరీర్‌లో సక్సెస్‌ కావడానికీ మార్గనిర్దేశనం చేస్తాడీ హీరో..! అలా మన జీవితాలకే రోల్‌ మోడల్‌గా నిలుస్తాడు.

Updated : 17 Jun 2024 18:48 IST

(Photos: Instagram)

మన జీవితంలో ఎంతమంది మనకు తోడున్నా.. అడుగడుగునా నాన్న అందించే ప్రోత్సాహం, ప్రేరణ మాత్రం ప్రత్యేకం. ఆయనతో గడిపిన ప్రతి క్షణం అపురూపం. వ్యక్తిగతంగా విలువలు నేర్పడమే కాదు.. ఎంచుకున్న కెరీర్‌లో సక్సెస్‌ కావడానికీ మార్గనిర్దేశనం చేస్తాడీ హీరో..! అలా మన జీవితాలకే రోల్‌ మోడల్‌గా నిలుస్తాడు. తామూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సక్సెసవడానికి తమ తండ్రే కారణం అంటున్నారు కొందరు సెలబ్రిటీలు. పసి వయసులో బుడిబుడి అడుగులు వేయించడం దగ్గర్నుంచి, విజయాల్లో ‘శెభాష్‌’ అంటూ వెన్నుతట్టే దాకా.. నాన్నతో తమకున్న జ్ఞాపకాలు అంతులేనివంటున్నారు. ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా.. ఆ మధుర స్మృతుల దొంతరల్ని ఇలా నెమరువేసుకుంటున్నారు!

నాన్నే నా బలం! - రష్మిక

నేను పుట్టకముందు నుంచే నాన్న నా గురించి కలలు కనేవాడట! సరిగ్గా నేను పుట్టడానికి రెండు రోజుల ముందు.. పెద్ద కళ్లు, పొడవాటి జుట్టు, అందమైన ముక్కు, పట్టీలేసుకొని.. తన పొట్టపై నేను ఆడుకుంటున్నట్లుగా తనకు ఓ కల వచ్చిందట! ఆ రెండు రోజులు ఈ ఊహల్లోనే గడిపానంటూ అప్పుడప్పుడూ చెబుతుంటారు నాన్న. నా చిన్నతనంలో తన వ్యాపార రీత్యా నాన్న ఎక్కువ రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక పెద్దయ్యాక పైచదువుల దృష్ట్యా నేను హాస్టల్‌లో ఉంటూ ఇంటికి దూరమవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయా. ఇలా చాలా సందర్భాల్లో నాన్నను మిస్సయిన ఫీలింగ్‌ కలిగేది. ఇలాంటి భావన కలిగినప్పుడల్లా మా మధ్య ఉన్న ప్రేమానుబంధం దీన్ని దూరం చేసేది. నిజానికి వృత్తిఉద్యోగాల రీత్యా దూరంగా ఉన్నప్పటికీ.. తను అనుక్షణం నా కెరీర్‌ గురించే ఆలోచించేవారు. సరైన మార్గనిర్దేశనం చేసేవారు. ఇలా మానసికంగా నాన్న ఎప్పుడూ నా పక్కనే ఉండేవారు. తనే నా బలం!


నాన్నకే కాల్‌ చేస్తా! - కృతీ సనన్

ఏ సమస్య వచ్చినా మన మనసుకు బాగా దగ్గరైన వ్యక్తితో పంచుకుంటాం. ఈ విషయంలో నేను మా నాన్న పేరే చెప్తా. నా వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో ఏ సమస్య వచ్చినా ముందు నాన్నకే ఫోన్‌ వెళ్తుంది. అంతెందుకు.. ఆఖరికి నా గదిలో వై-ఫై పనిచేయకపోయినా తనకే ఫోన్‌ చేస్తా. ఏ సమస్యైనా నాన్న చిటికెలో పరిష్కరిస్తారన్న నమ్మకం. నేను సినిమాల్లోకొస్తానన్న మొదట్లో నాన్న భయపడ్డారు. కానీ ఒక్కసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటానని ఒప్పించా. అయితే నా నిర్ణయమే సరైందని నాన్న ఇప్పటికీ నాతో అంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది.


‘తెలుగబ్బాయినే పెళ్లి చేసుకో..’ అంటారు! - సాయి పల్లవి

నేను ఇంట్లో అప్పుడప్పుడూ తెలుగు మాట్లాడుతుంటా. ఎక్కువ శాతం బడగా భాష మాట్లాడినా తెలుగు పదాలతో చర్చను ముగిస్తుంటా. ఈ సమయంలో నాన్న.. ‘తెలుగు బాగా మాట్లాడుతున్నావ్‌గా.. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకో..’ అంటూ ఆటపట్టిస్తుంటారు. అయితే చిన్నప్పుడు ఓసారి నాన్న చేతిలో దెబ్బలు తిన్న సందర్భం నాకు ఇప్పటికీ గుర్తే! అప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నా. ఆ సమయంలో ఓ అబ్బాయికి ప్రేమలేఖ రాశా. ఇది నాన్న కంట పడింది. దాంతో రెండు దెబ్బలు వేశారు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంటుంది. నాన్న కూడా ఇదే విషయంపై అప్పుడప్పుడూ నన్ను ఆటపట్టిస్తుంటారు కూడా! ఇదొక్క విషయమే కాదు.. నా వ్యక్తిగత, కెరీర్‌ విషయాల్లోనూ నాన్న ఎప్పుడూ ఫ్రెండ్లీగానే వ్యవహరిస్తుంటారు.. నాకు మార్గనిర్దేశనం చేస్తుంటారు.


ఆ విషయంలో రాజీపడను! - తమన్నా

నా 15వ ఏట ఇండస్ట్రీలోకొచ్చా. నిజానికి అప్పుడు నాది స్కూలుకెళ్లే వయసు. ఈ సమయంలో మనం తీసుకునే నిర్ణయం సరైందా, కాదా అన్న విషయాల్లో మనకు పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే నాన్న నాకు అండగా నిలిచారు. నటనపై నాకున్న మక్కువను ప్రోత్సహించారు. నేను వేసే ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. అందుకు అమ్మానాన్నల ప్రోత్సాహమే కారణం. సినిమా షూటింగ్స్‌ కారణంగా తరచూ వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా గడపాల్సి వచ్చేది. అప్పుడు ఇంటిని మిస్సవుతున్నానన్న ఫీలింగ్‌ కలిగేది. కానీ ముంబయి వెళ్లినప్పుడు మాత్రం నా పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తా.


నేను నాన్న కూచిని! - అనన్యా పాండే

తండ్రులకు కూతుళ్లతో ఎక్కువ అటాచ్‌మెంట్‌ ఉంటుందంటారు. నాకు, మా నాన్నకు మధ్య అంతకుమించిన ప్రేమానుబంధం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. నేను నాన్న కూచిని! వ్యక్తిగత విషయాల్లోనే కాదు.. నటనను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు సైతం నాన్న నన్నెంతో ప్రోత్సహించారు. నాకు సరైన మార్గనిర్దేశనం చేశారు. ఇంట్లో ఎంత ప్రేమగా, సరదాగా ఉంటారో.. అంతే క్రమశిక్షణతో ఉంటారు. ఓటమినీ గెలుపుతో సమానంగా స్వీకరించమని చెబుతుంటారు. అది వ్యక్తిగత జీవితమైనా, కెరీర్‌ అయినా.. ప్రతి అడుగునూ సానుకూల దృక్పథంతో వేయాలని చెబుతుంటారు. ప్రస్తుతం నేను ఓటములనైనా, విమర్శలనైనా సానుకూలంగా తీసుకుంటున్నానంటే అందుకు కారణం.. నాన్న నింపిన స్ఫూర్తే!


లెక్కల్లో సందేహాలు తీర్చేవారు! - ఈషా అంబానీ

అమ్మానాన్నలు తమ వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రాత్రి డిన్నర్ సమయానికి ఇంటికొచ్చేవాళ్లు. అక్కడే మేం బోలెడన్ని విషయాలు పంచుకునేవాళ్లం. ఇక చిన్నప్పుడు నాకు మ్యాథ్స్‌లో ఏ చిన్న సందేహం వచ్చినా నాన్నే దాన్ని నివృత్తి చేసేవారు. నాన్న బోర్డ్‌ మీటింగుల్లో ఉన్నా.. మీటింగ్‌ పూర్తికాగానే నా గణిత సమస్యను పరిష్కరించేవారు. నా వ్యాపార కెరీర్‌కూ నాన్నే స్ఫూర్తి. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. స్వయంగా నిర్ణయాలు తీసుకోగలగడం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, కష్టపడి పనిచేసే తత్వం.. ఇలా నా కెరీర్‌లో అడుగడుగునా నాన్న ప్రోత్సాహం, ప్రేరణ దాగున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్