Actress Talents : ఖాళీ సమయాల్లో మేమేం చేస్తామంటే..?!
షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ సినీ తారల జీవితం ప్రతినిత్యం బిజీబిజీగా గడిచిపోతుంటుంది. ఎప్పుడైనా కాస్త ఖాళీ సమయం దొరికినా వెకేషన్లకు చెక్కేస్తుంటారు చాలామంది ముద్దుగుమ్మలు. అయితే తాను మాత్రం చాలా వరకు తన విరామ...
(Photos: Instagram)
షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ సినీ తారల జీవితం ప్రతినిత్యం బిజీబిజీగా గడిచిపోతుంటుంది. ఎప్పుడైనా కాస్త ఖాళీ సమయం దొరికినా వెకేషన్లకు చెక్కేస్తుంటారు చాలామంది ముద్దుగుమ్మలు. అయితే తాను మాత్రం చాలా వరకు తన విరామ సమయాన్ని తన అభిరుచులకే కేటాయిస్తానంటోంది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. ఈ క్రమంలోనే ఇటీవలే తనలో దాగున్న పెయింటింగ్ ట్యాలెంట్‌ని వెలికి తీసిన ఈ అమ్మడు.. పెద్ద కాన్వాస్‌పై ఓ ప్రముఖుడి ఫొటోను చిత్రీకరించింది. నటన పరంగా, వ్యక్తిగతంగా అతడే స్ఫూర్తి అంటోంది. ఇలా తాను గీసిన చిత్రాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. చాలామంది ఆమె ప్రతిభను ప్రశంసిస్తున్నారు. అయితే ఇలా నభా ఒక్కర్తే కాదు.. మరికొంతమంది ముద్దుగుమ్మలూ ఖాళీ సమయాల్లో తమలో దాగున్న నైపుణ్యాలు/అభిరుచులపై దృష్టి పెడతామంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ విశేషాలేంటో వారి మాటల్లోనే..! ఇంతకీ వారెవరు? వారిలో దాగున్న ఆ ప్రత్యేక ట్యాలెంట్స్ ఏంటో తెలుసుకుందాం రండి..
ఇస్మార్ట్ ‘పెయింటర్’ ! - నభా నటేష్
నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే పెయింటింగ్‌పై దృష్టి పెట్టాను. ఆ సమయంలో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొన్నా. ఆపై పేపర్ క్రాఫ్ట్స్ చేయడం, పాటలు పాడడం, వీణ వాయించడం, కరాటే నేర్చుకోవడం.. ఇలా ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూ నన్ను నేను బిజీగా ఉంచుకునేదాన్ని. అయితే వీటన్నింటిలోకెల్లా పెయింటింగ్ వేయడానికే మక్కువ చూపేదాన్ని. కాలేజీలో ఉన్నప్పుడు వీలు చిక్కక కొన్నాళ్ల పాటు దీన్ని పక్కన పెట్టినా.. సినిమాల్లోకొచ్చాక తిరిగి కొనసాగించడం మొదలుపెట్టా. నిజానికి ఇది నాలో ఏకాగ్రతను, ఏదైనా చేయగలనన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రోజులు గడుస్తున్న కొద్దీ కాన్వాస్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్.. ఇలా ఇందులోనే విభిన్న రకాల చిత్రకళల్లో నైపుణ్యాలు సాధించా. ఎంతటి కఠినమైన చిత్రమైనా గరిష్టంగా 4 గంటల్లో పూర్తిచేస్తా. ఇక ఖాళీ సమయాల్లో పెయింటింగ్ వేయడానికే ఇష్టపడతా. కాన్వాస్ లేకపోయినా ఆఖరికి కనిపించిన టిష్యూ పేపర్‌పైనా ఏదో ఒక బొమ్మ గీస్తుంటా. నేను బ్యాట్‌మ్యాన్‌కు వీరాభిమానిని. ఆ స్ఫూర్తితో నేను గీసిన బ్యాట్‌మ్యాన్ చిత్రానికి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. అలా ఇటీవలే చార్లీ చాప్లిన్ బొమ్మ గీశాను. ఓ నటుడిగా, వ్యక్తిగా ఆయన నన్నెంతో ప్రభావితం చేశారు.
‘రయ్’మంటూ దూసుకెళ్తా! - నివేతా పేతురాజ్
నాకు చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం. నేను స్కూలింగ్‌లో ఉన్నప్పుడు మేం దుబాయ్‌లో ఉండేవాళ్లం. అప్పుడు నేను ఎనిమిదో తరగతిలో ఉన్నాననుకుంటా. ఆ సమయంలో మా పక్కింటి వారు స్పోర్ట్స్ కారు కొన్నారు. అది చూశాక నా మతి పోయింది. స్పోర్ట్స్ కార్లపై మక్కువ పెరిగింది. 2015లో డాడ్జ్ ఛాలెంజర్ స్పోర్ట్స్ కారు కొన్నా. ఆ సమయంలో యూఏఈలో ఈ కారు కొన్న రెండో అమ్మాయిని నేను. ఆపై క్రమంగా ఫార్ములా వన్ రేసింగ్‌పై పట్టు సాధించా. ఇక దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చాక కొన్ని మోటార్ ట్రాక్స్‌ని సందర్శించా. ఆపై డ్రైవింగ్ టెస్ట్ కోసం బీఎండబ్ల్యూ కారు స్టీరింగ్ పట్టుకున్నాక నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. ఇక మొన్నామధ్య ఫార్ములా కార్ రేసింగ్‌లో లెవల్-1 శిక్షణ కూడా పూర్తిచేసుకున్నా. ఇప్పటికీ షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు.. నాకు తొలుత గుర్తొచ్చేది ఈ ఆటే! ఏదో ఒక రోజు ఈ పోటీల్లో కచ్చితంగా పాల్గొంటా. చాలామంది దీన్ని పురుషుల ఆటగానే పరిగణిస్తారు.. కానీ కొంతమంది మహిళల్లో ఈ తరహా సాహస క్రీడలో రాణించే సత్తా ఉంటుంది. 60-65 కిలోల బరువు, 30 శాతం ఫిట్‌నెస్‌తో ఉంటే చాలు.. మహిళలూ ఫార్ములా వన్ రేసర్లుగా మారేందుకు అర్హత పొందచ్చు.
‘సాంబార్’ బాగా చేస్తా! - శృతీ హాసన్
మన అవసరాలే మనకు కొన్ని నైపుణ్యాలు నేర్పిస్తాయి. ఈ విషయానికొస్తే.. నేను వంట నేర్చుకున్నా. మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం యూఎస్ వెళ్లినప్పుడు ఇంటి ఆహారాన్ని చాలా మిస్సయ్యేదాన్ని. వంట ప్రాధాన్యమేంటో అప్పుడు నాకు అర్థమైంది. ఎలాగైనా సరే.. వంట నేర్చుకోవాలని పట్టుబట్టా. మా మేనత్తకు ఫోన్ చేస్తే.. తనే వివిధ వంటకాలు ఎలా చేయాలో వీడియో కాల్‌లో వివరించేది. ఆమె సూచనల మేరకు ఆయా వంటకాల్లో నైపుణ్యం సాధించా. ఓ సందర్భంలో మా బామ్మ ప్రత్యేకంగా తయారుచేసే సాంబార్ రెసిపీ కూడా నేర్పించిందామె.. అది చక్కగా కుదిరింది. దాంతో సాంబార్ నా ఫేవరెట్ వంటకంగా మారిపోయింది. మా బామ్మ పేరు రాజ్యలక్ష్మి.. తన స్టైల్‌లో నేను తయారుచేసిన సాంబార్‌ను ‘రాజ్యలక్ష్మి సాంబార్’గా పిలుస్తుంటా. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో వంట చేయడానికే ఆసక్తి చూపుతా. మన కుటుంబ సభ్యులకు వండి వార్చడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ దక్కదు.
‘గోల్ఫ్’ విడిచి ఉండలేను! - రకుల్ ప్రీత్ సింగ్
స్కూల్లో ఉన్నప్పుడు గోల్ఫ్ ఆటంటే నాకు అస్సలు నచ్చకపోయేది. పైగా ఇది పెద్ద వాళ్లు ఆడే ఆటేమో అనుకునేదాన్ని. కానీ నాన్న ఈ ఆటపై నాకున్న సందేహాలన్నీ నివృత్తి చేశారు. దాంతో క్రమంగా గోల్ఫ్ అంటే ఇష్టం పెరుగుతూ వచ్చింది. పదేళ్ల వయసులో ఈ ఆటలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టా. కాలేజీ రోజుల్లో జాతీయ జూనియర్ సర్క్యూట్ స్థాయిలో పోటీపడ్డా. నాకు ఇప్పటికీ గుర్తే.. స్కూల్ పూర్తయ్యాక అటు నుంచే అటే గోల్ఫ్ శిక్షణకు వెళ్లేదాన్ని. అలా ఈ ఆట నా జీవితంలో అంతర్భాగమైంది. ఒక్కసారి గోల్ఫ్ క్రీడను అలవాటు చేసుకున్నామంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వీడలేం. నేనూ అంతే! ఇప్పటికీ షూటింగ్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు.. గోల్ఫ్ కోసం కాస్త సమయం వెచ్చిస్తా. గుర్రపు స్వారీ, లాన్ టెన్నిస్, కరాటే.. వంటి అంశాలపైనా దృష్టి సారిస్తా.
అది థెరపీ లాంటిది! - కాజల్ అగర్వాల్
ఒత్తిడికి గురైనా, మనసు బాలేకపోయినా.. మనసుకు నచ్చిన పని చేసినప్పుడు ప్రశాంతత చేకూరుతుంది. ఈ విషయానికొస్తే.. నేను కుట్లు, అల్లికలతో రిలాక్సవుతా. ఇది నేను మా అత్తగారి దగ్గర్నుంచి నేర్చుకున్నా. ఈ నైపుణ్యాన్ని ఉపయోగించి మన చేతులతో స్వయంగా ఒక కొత్త వస్తువును రూపొందించే క్రమంలో మన మనసు పూర్తిగా దానిపైనే లగ్నం చేస్తాం. తద్వారా మరో ఆలోచన మనసులోకి రాకుండా జాగ్రత్తపడచ్చు. ఇప్పటికీ ఖాళీ దొరికినప్పుడల్లా నేను, అత్తయ్య సరదాగా మాట్లాడుకుంటూ కుట్లు-అల్లికలతో కొత్త వస్తువులకు రూపమిస్తాం. నిజానికి కుట్లు-అల్లికలు ఒక థెరపీ లాంటివి. దీంతో పాటు పుస్తకాలు చదవడం, వంట చేయడం, ధ్యానం.. వంటి అలవాట్లకూ ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
బ్యూటీ & ఫ్యాషన్
- అందాన్ని పెంచే ‘వెదురు’!
- స్ట్రెచ్‌మార్క్స్ పోయేలా!
- చుండ్రుని తగ్గించే మాస్కులివి..
- గోళ్ల అందం, ఆరోగ్యం.. మన చేతుల్లోనే!
- ‘గులాబీ’ లాంటి అందానికి!
ఆరోగ్యమస్తు
- కునుకు పడితేనే!
- Immunity Boosters: పరగడుపునే ఇవి తీసుకుంటున్నారా?
- అల్పాహారం తిన్నా.. కళ్లు తిరుగుతున్నాయి!
- టీనేజర్స్‌కి ప్రత్యేకంగా..
- గర్భనిరోధక మాత్రలతో సంతాన సమస్యలొస్తాయా?
అనుబంధం
- తరచూ అలుగుతున్నారా?
- నా పిల్లలతో ఆ అలవాటు మాన్పించాలంటే..?!
- Trial Separation : ఇలా దూరమైతే ప్రేమ పెరుగుతుందట!
- మీకు అనిపిస్తేనే అడగండి..
- స్కూల్ నుంచి ఫిర్యాదులొస్తే...
యూత్ కార్నర్
- సేంద్రియ ఉత్పత్తులు నేరుగా ఇంటికే పంపిస్తోంది!
- గాలి నుంచి వస్త్రాలు చేస్తున్నారు!
- సవాళ్లు దాటి...మెరిశారు!
- కాగితం కళ!
- రక్షించే రబ్బర్‌బ్యాండ్!
'స్వీట్' హోం
- ఎండు కొమ్మలు ఎంతందమో!
- మొక్కలకు కాఫీ ఇద్దామా!
- పాపాయి బయటికి పోకుండా..!
- సమయాన్ని మిగిల్చే సౌకర్యాలు...
- వంటగదే ఔషధ గని..
వర్క్ & లైఫ్
- బ్యాగులో ఇవి మర్చిపోవద్దు...
- దాచుకోవడానికి ఇదే మంచి సూత్రం
- Presenteeism : మనిషిక్కడ.. మనసెక్కడో!
- కుటుంబంతో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?
- చెల్లి ఇంట్లోకి రానివ్వడం లేదు..