Inner Wear: వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!

చక్కటి ఎద సౌష్ఠవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం కామనే. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్‌, బ్రాలెట్‌, స్పోర్ట్స్‌ బ్రా.. వంటివి ఎంచుకుంటాం.  అయితే ఒక్కోసారి ఈ లోదుస్తులు ఎద భాగానికి పట్టినట్లుగా ఉండడం, తద్వారా ఛాతీలో నొప్పి రావడం, ఆ ప్రదేశంలో చెమట వచ్చి రాషెస్‌లా ఏర్పడడం..

Updated : 15 Aug 2022 14:50 IST

చక్కటి ఎద సౌష్ఠవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం కామనే. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్‌, బ్రాలెట్‌, స్పోర్ట్స్‌ బ్రా.. వంటివి ఎంచుకుంటాం.  అయితే ఒక్కోసారి ఈ లోదుస్తులు ఎద భాగానికి పట్టినట్లుగా ఉండడం, తద్వారా ఛాతీలో నొప్పి రావడం, ఆ ప్రదేశంలో చెమట వచ్చి రాషెస్‌లా ఏర్పడడం.. జరుగుతుంది.  ఈ క్రమంలో- మరీ అసౌకర్యంగా అనిపిస్తే బ్రా ధరించకపోయినా ఎలాంటి నష్టం ఉండదంటున్నారు సంబంధిత నిపుణులు. ఒకవేళ అంతలా ధరించాలనుకుంటే కాస్త వదులుగా ఉండే బ్రాను ఎంచుకోవడం లేదంటే వదులుగా ఉండే ఇతర లోదుస్తులు ధరించడం అలవాటు చేసుకున్నా మంచిదేనంటున్నారు. ఇంకా చెప్పాలంటే అత్యవసరం కానప్పుడు బ్రా వేసుకోకపోతే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

రక్తప్రసరణ సాఫీగా..!

మనం ఎప్పుడైనా కాస్త బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంటుంది. ఎక్కడైతే బాగా బిగుతుగా ఉందో ఆ శరీర అవయవానికి రక్తప్రసరణ కూడా సరిగ్గా అందదు. బ్రా కూడా అలాంటిదే. వక్షోజాలను పట్టి ఉంచే ఈ ఇన్నర్‌వేర్‌ మరీ బిగుతుగా ఉన్నట్లయితే ఛాతీ భాగానికి, రొమ్ములకు సరైన రక్తప్రసరణ జరగక ఛాతీలో నొప్పి రావడం మనం గమనించచ్చు. ముఖ్యంగా అండర్‌వైర్‌ తరహా బ్రాలు ధరించే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి బ్రా వేసుకోకపోతే ఆయా భాగాలకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. మరీ కచ్చితంగా బ్రా ధరించాలనుకుంటే మాత్రం మరీ బిగుతుగా ఉండే దానికి బదులుగా కాస్త వదులుగా, వక్షోజాలకు సౌకర్యవంతంగా ఉండే బ్రాను ఎంపిక చేసుకోవడం, లేదంటే ఇతర లోదుస్తులు వేసుకోవడం మంచిది.

ఇన్ఫెక్షన్లూ రావచ్చు..!

కాలమేదైనా కొందరికి పదే పదే చెమటపోస్తుంటుంది. ఇలాంటి వారు శరీరానికి అతుక్కునేలా ఉండే బ్రా వంటి దుస్తులు ధరించడం వల్ల చర్మంపై అచ్చులు పడడం, ఆ ప్రదేశంలో ఎరుపెక్కడం, అలర్జీలు రావడం.. జరుగుతుంది. అలాగే ప్యాడెడ్‌ బ్రాల వల్ల నిపుల్స్‌ పొడిబారిపోతాయంటున్నారు నిపుణులు. తద్వారా ఆ ప్రదేశంలో దురద రావడం, ఎరుపెక్కడం.. వంటివి జరుగుతుంటాయి. మరి, ఈ సమస్యలన్నీ రాకూడదంటే వదులుగా ఉండే బ్రాలను ఎంచుకోవడం, అత్యవసర సమయాల్లో మాత్రమే వాటిని ధరించడం.. వంటివి చేయచ్చు.

నిద్ర పోయేటప్పుడు..

సాధారణంగా మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే దుస్తులు మార్చుకోవడం, మనకు కంఫర్టబుల్‌గా ఉండే నైట్‌వేర్‌, నైటీ లాంటివి వేసుకోవడం కామన్‌. ఎందుకంటే ఇవి వదులుగా ఉండి రాత్రుళ్లు పడుకునేటప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉంటామన్న ఉద్దేశంతోనే! అలాంటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కూడా బిగుతుగా ఉండే బ్రా వేసుకొని పడుకోవడం వల్ల అసౌకర్యంతో నిద్ర కూడా సరిగ్గా పట్టదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. రోజూ ఇలాంటి బిగుతుగా ఉండే దుస్తులు, లోదుస్తులు వేసుకొని పడుకోవడం వల్ల క్రమంగా నిద్ర కరువై పలు అనారోగ్యాలూ దరిచేరతాయట.

ఆ ముప్పు తక్కువ!

బాగా బిగుతుగా ఉండే బ్రా వల్ల రొమ్ముల్లో ఉండే కణజాలాలు డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఇది క్రమంగా రొమ్ము క్యాన్సర్‌కు కూడా దారితీయచ్చంటున్నారు నిపుణులు. బ్రా ధరించకపోతే ఈ క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు కొంత వరకు తగ్గుతాయంటున్నారు. అయితే వక్షోజాల పరిమాణం కాస్త ఎక్కువగా ఉన్న వారు బ్రాతో కవర్‌ చేసుకుంటుంటారు. అలాంటి వారు కూడా రోజంతా ఈ బిగుతైన లోదుస్తులు ధరించడం కాకుండా అత్యవసరమైనప్పుడు మాత్రమే వేసుకోవాలని సూచిస్తున్నారు.

వారికి ఉపశమనం..

సాధారణంగా ఆస్తమాతో బాధపడే వారు అప్పుడప్పుడూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వారు బిగుతుగా ఉండే బ్రా వంటి లోదుస్తులు ధరించడం వల్ల డయాఫ్రమ్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆస్తమా రోగులు బ్రా వేసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ ఈ విషయంలో ఇంకా మీకేమైనా సందేహాలుంటే మీరు చెకప్‌ కోసం వెళ్లే డాక్టర్‌ లేదా గైనకాలజిస్ట్‌ని సంప్రదించినా వారు మీకు తగిన సలహా ఇస్తారు.

ఇలాంటప్పుడు తప్పదు!

అయితే కొన్ని అత్యవసర సమయాల్లో బ్రా తప్పనిసరి కావచ్చు.  ఉదాహరణకు.. వ్యాయామం చేసేటప్పుడు, క్రీడల్లో పాల్గొన్నప్పుడు వక్షోజాలకు సపోర్టివ్‌గా ఉండడానికి బ్రా ధరించడం తప్పనిసరి. లేదంటే రొమ్ముల కణజాలాలు డ్యామేజ్‌ అయి నొప్పి రావడంతో పాటు అసౌకర్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో స్పోర్ట్స్‌ బ్రా చక్కగా ఉపయోగపడుతుంది.

బయటికి వెళ్లినప్పుడు, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనూ చక్కటి శరీర సౌష్ఠవం కోసం లోదుస్తులు వేసుకోవడం చాలామందికి అలవాటే. అయితే అవి మరీ బిగుతైనవి కాకుండా వదులుగా ఉండేవి ఎంచుకున్నప్పుడే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా కంఫర్టబుల్‌గా ఉండచ్చన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పటికే బిగుతుగా ఉండే బ్రాలు ధరిస్తూ.. ఛాతిలో నొప్పి, నడుం నొప్పి, వెన్ను నొప్పి.. వంటి అనారోగ్యాలతో బాధపడుతున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్