ప్లాస్టిక్‌ బాటిల్‌కు ప్రత్యామ్నాయాలివే!

ఏ కాలమైనా ఓ నీళ్ల బాటిల్‌ వెంట లేనిదే బయటికి కదలం. అది కూడా చాలామంది ప్లాస్టిక్‌ బాటిల్స్‌నే ఎంచుకుంటుంటారు. అయితే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగడం అంత శ్రేయస్కరం కాదంటోంది ఇటీవలే.....

Published : 03 May 2022 17:06 IST

ఏ కాలమైనా ఓ నీళ్ల బాటిల్‌ వెంట లేనిదే బయటికి కదలం. అది కూడా చాలామంది ప్లాస్టిక్‌ బాటిల్స్‌నే ఎంచుకుంటుంటారు. అయితే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగడం అంత శ్రేయస్కరం కాదంటోంది ఇటీవలే నిర్వహించిన ఓ అధ్యయనం! ఎండ వేడి వల్ల, ప్లాస్టిక్‌లో  ఉండే రసాయనాలు, విషపదార్థాలు నీటిలో కలిసే ప్రమాదం ఉందని, తద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్లు తప్పవని హెచ్చరిస్తోంది. అందుకే కాలమేదైనా ప్లాస్టిక్‌కి బదులు ఇతర ప్రత్యామ్నాయాల్ని వెతుక్కోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ బాటిల్‌ వాడకం వల్ల కలిగే నష్టాలు, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

ఏయే సమస్యలొస్తాయంటే..?!

బయటికి వెళ్లేటప్పుడు వెంట నీళ్లు తీసుకెళ్లడానికి ప్లాస్టిక్‌ బాటిల్స్‌నే ఉపయోగిస్తుంటారు చాలామంది. అయితే ఎండ వేడి, సూర్యరశ్మి ఈ బాటిల్స్‌కి నేరుగా తగలడం వల్ల ప్లాస్టిక్‌లోని హానికారక అవశేషాలు కరిగి నీటిలోకి విడుదలవుతాయని చెబుతోంది ఇటీవలే విడుదల చేసిన ‘నేషనల్‌ జియోగ్రాఫిక్‌’ సర్వే నివేదిక. ఇది క్రమంగా హార్మోన్ల సమస్యలు, పీసీఓఎస్‌, అండాశయ సమస్యలు, రొమ్ము క్యాన్సర్‌, పెద్ద పేగు క్యాన్సర్‌.. వంటి వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతుందని సర్వేలో తేలింది. అదెలాగంటే..!

* ఎండ వేడి వల్ల ప్లాస్టిక్‌ బాటిల్స్‌లోని డయాక్సిన్‌ అనే విషపదార్థం విడుదలవుతుంది. దీనివల్ల రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం క్రమంగా పెరుగుతుంది.

* ప్లాస్టిక్‌లోని బైఫినైల్‌-ఎ అనే రసాయనం ఈస్ట్రోజెన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా డయాబెటిస్‌, స్థూలకాయం, సంతానలేమి సమస్యలు, అమ్మాయిలు చిన్న వయసులోనే రజస్వల కావడం, ప్రవర్తన లోపాలు.. వంటి సమస్యలొస్తాయి.

* ప్లాస్టిక్‌ బాటిల్స్‌లోని రసాయనాలు, విష పదార్థాలు రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

* థాలేట్స్‌ అనే రసాయనాలు ప్లాస్టిక్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తాయి.

* వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి ఈ మధ్య విటమిన్‌ వాటర్‌ పేరుతో ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీళ్లు నింపి అమ్ముతున్నారు. నిజానికి ఇవి మరింత హానికరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఫుడ్‌ డైలు, ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌.. వంటి హానికారక పదార్థాలు ఇందులో కలిసే అవకాశం ఉందట.

ప్రత్యామ్నాయాలు బోలెడు!

ప్లాస్టిక్‌కు బదులు ప్రస్తుతం విభిన్న రకాల పర్యావరణహిత బాటిల్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..!

* గాజు బాటిల్స్‌ - సాధారణంగా ఈ వేసవిలో చల్లటి నీళ్లు వెంట తీసుకెళ్లడానికే మొగ్గు చూపుతుంటాం. ఇలాంటప్పుడు గాజు బాటిల్స్‌ని ఎంచుకుంటే.. నీళ్లు ఎక్కువ సమయం చల్లగా ఉంటాయి. అలాగే ఈ బాటిల్స్‌ను ఎన్నిసార్లు రీసైకిల్‌ చేసినా.. వీటి నాణ్యత దెబ్బతినదు. అయితే ఈ బాటిల్స్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాల్సి ఉంటుంది.

* సెరామిక్ బాటిల్స్‌ - ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో ఇవి సందడి చేస్తున్నాయి. గాజు లాగే నీళ్లు ఎక్కువ సమయం చల్లగా ఉండడానికి ఇవి దోహదం చేస్తాయి.

* స్టీల్‌ బాటిల్‌ - వాతావరణాన్ని బట్టి ఇందులో నిల్వ చేసిన నీళ్ల ఉష్ణోగ్రతలు మారుతుంటాయి. అలాగని ఈ వేడికి లోహం కరిగి నీళ్లలో కలిసిపోతుందన్న భయం అక్కర్లేదు.

* పేపర్‌ బాటిల్స్‌ - కొన్ని రకాల పండ్ల రసాలు, పాలను ఈ తరహా పేపర్‌ ప్యాక్స్‌లో నింపడం మనం చూస్తుంటాం. ఈ తరహా బాటిల్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని వినియోగించుకోవచ్చు.

* మట్టి బాటిల్స్‌ - ఇటు పర్యావరణహితంగా, అటు నీళ్లు ఎక్కువ సమయం చల్లగా ఉండాలంటే మట్టితో చేసిన వాటర్‌ బాటిల్స్‌ మంచి ప్రత్యామ్నాయం. ప్రస్తుతం ఈ తరహా బాటిల్స్‌ విభిన్న డిజైన్లు, ప్రింట్లతో రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు డిజైనర్లు.

* వెదురు బాటిల్స్‌ - ఇది వాతావరణానికి మేలు చేయడంతో పాటు తక్కువ బరువును కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఈ తరహా బాటిల్స్‌ని ఎంచుకోవచ్చు.

* కాపర్‌ బాటిల్స్‌ - శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపించడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి, బరువును అదుపులో ఉంచడానికి కాపర్‌ బాటిల్స్‌లో నిల్వ చేసిన నీళ్లు తాగడం శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు.

* పాకెట్‌ మగ్‌ - నీళ్ల బాటిల్‌ను వెంట తీసుకెళ్లలేని వారు.. సిలికాన్‌తో తయారయ్యే పాకెట్‌ మగ్‌ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఇవి చేతిలో ఇమిడిపోయేలా ఉంటాయి. వీటిని వెంట ఉంచుకుంటే.. మంచి నీటి సదుపాయం ఉన్న చోట నేరుగా వాటిలో నీళ్లు పట్టుకొని తాగేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్