దీర్ఘ కాలం శృంగారానికి దూరమైతే..!

మహిళల్లో వయసు పెరిగే కొద్దీ శృంగారపు కోరికలు తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి పది మందిలో ఒకరు ‘హైపోయాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌’తో బాధపడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Published : 14 Jun 2024 14:19 IST

శృంగారం.. ఆరోగ్యాన్ని, అనుబంధాన్ని పెంచుతుంది. కానీ ప్రెగ్నెన్సీ, ప్రసవానంతరం, మెనోపాజ్‌.. వంటి దశల్లో చాలామంది మహిళల్లో ఈ ఆసక్తి తగ్గిపోవడం సహజం! అంతేకాదు.. మహిళల్లో వయసు పెరిగే కొద్దీ శృంగారపు కోరికలు తగ్గుతాయని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి పది మందిలో ఒకరు ‘హైపోయాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌’తో బాధపడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే.. శృంగారపు కోరికలు అడుగంటిపోవడం, దాంతో కలయికకు దూరంగా ఉండడమన్నమాట! ఈ క్రమంలోనే కొందరు మహిళలు రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి శృంగారానికి దూరమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి దీనివల్ల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడంతో పాటు మానసికంగానూ ముప్పు తప్పదంటున్నారు. మరి, ఆ సమస్యలేంటో తెలుసుకుందాం రండి..

‘లవ్‌ హార్మోన్‌’.. ‘సెక్స్‌ హార్మోన్‌’!
జీవక్రియల పనితీరులో హార్మోన్ల పాత్ర కీలకం! వీటి విడుదలను బట్టే శరీరంలోని అవయవాలు ఆయా పనుల్ని పూర్తిచేయగలుగుతాయి. ఇదే విధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు, వెజైనా ఆరోగ్యంలో.. ఆక్సిటోసిన్‌, ఈస్ట్రోజెన్‌ హార్మోన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ‘లవ్‌ హార్మోన్‌’గా పిలిచే ఆక్సిటోసిన్‌ ప్రేమ భావనను ప్రేరేపిస్తుంది. ఇది భాగస్వామితో సాన్నిహిత్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇక ‘సెక్స్‌ హార్మోన్‌’గా పిలిచే ఈస్ట్రోజెన్‌ వెజైనాను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు లైంగిక కోరికల్ని కలగజేస్తుంది. అయితే శృంగారానికి దూరంగా ఉండే వారిలో ఈ రెండు హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. తద్వారా భవిష్యత్తులోనూ ఈ కోరికలు శాశ్వతంగా దూరమవడంతో పాటు శరీరంలో శక్తి స్థాయులు తగ్గిపోవడం, మూడ్‌స్వింగ్స్‌.. వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు. ఇవి దరిచేరకూడదంటే.. శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు.

ఆ ఇన్ఫెక్షన్లు తప్పవట!
దీర్ఘకాలం పాటు శృంగారానికి దూరమవడం వల్ల వెజైనా ఆరోగ్యం దెబ్బతింటుందని, కాలక్రమేణా ఇది వెజైనల్‌ ఇన్ఫెక్షన్లకూ దారితీసే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. వెజైనాకు రక్తప్రసరణ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు. తరచూ కలయికలో పాల్గొనకపోవడం వల్ల వ్యక్తిగత భాగాలకు రక్తప్రసరణ సరిగ్గా జరగక.. వెజైనా పొడిబారిపోతుంది.. స్థితిస్థాపకతనూ కోల్పోతుంది. దీనివల్ల తిరిగి కలయికలో పాల్గొన్నప్పుడు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అందుకే శృంగారాన్ని పూర్తిగా పక్కన పెట్టేయకుండా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు.

రోగనిరోధక శక్తికి!
రోజుల తరబడి కలయికకు దూరంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల శరీరానికి ఇన్ఫెక్షన్లు, వ్యాధుల్ని ఎదుర్కొనే సామర్థ్యం క్రమంగా తగ్గుతుందట! అదే.. వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే వారిలో ఎక్కువ మొత్తంలో కొన్ని రకాల యాంటీ బాడీలు విడుదలైనట్లు మరో అధ్యయనంలో రుజువైంది. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే శృంగారానికీ ప్రాధాన్యమివ్వమంటున్నారు.

ఒత్తిడి-ఆందోళనలు!
శృంగారాన్ని స్ట్రెస్‌ బస్టర్‌గా పేర్కొంటారు నిపుణులు. కలయికలో పాల్గొన్నప్పుడు ఎండార్ఫిన్లు విడుదలవడమే ఇందుకు కారణం! ఇవి ఫీల్‌గుడ్‌ హార్మోన్లు. ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా మనసును ప్రేరేపిస్తాయి. అదే.. శృంగారానికి దూరంగా ఉండడం వల్ల శరీరంలో ఈ హార్మోన్ల విడుదల తగ్గిపోతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యలు ఎక్కువవుతాయి. భాగస్వామి సాన్నిహిత్యాన్ని కూడా కోల్పోవడం వల్ల వీటి తీవ్రత మరింత పెరుగుతుంది. అందుకే శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదం చేసే శృంగారాన్ని జీవనశైలిలో భాగం చేసుకోమని నిపుణులు సూచిస్తున్నారు.


ఆ కోరిక పెరగాలంటే?!

చాలామంది మహిళలు కలయికకు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం.. శృంగారపు కోరికలు తగ్గిపోవడమే! అందుకే ఈ కోరికల్ని తిరిగి పెంచుకోవాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు.
దంపతులిద్దరూ కలిసి కపుల్‌ వ్యాయామాలు చేయడం, ఫ్యాంటసీలు పంచుకోవడం, రోజూ కాసేపు ఏకాంతంగా సమయం గడిపేలా ప్రణాళిక వేసుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం, ఒత్తిడి-ఆందోళనల్ని దూరం చేసుకోవడంలో దంపతులిద్దరూ ఒకరికొకరు సహకరించుకోవడం, అప్పుడప్పుడూ కలిసి వెకేషన్‌కు వెళ్లడం.. వంటివన్నీ వర్కవుట్‌ అవుతాయంటున్నారు.
ఇక కొంతమంది కలయిక సమయంలో కలిగే అసౌకర్యం వల్ల శృంగారాన్ని దూరం పెడుతుంటారు. ఇలాంటి వారికి వెజైనల్‌ లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు మేలు చేస్తాయి.
అంతేకాదు.. లైంగిక కోరికల్ని పెంచే ఆహార పదార్థాల్నీ మెనూలో చేర్చుకోవాలి. ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్‌, అత్తిపండ్లు, అరటిపండ్లు, అవకాడో.. వంటివి ఇందుకు సహకరిస్తాయంటున్నారు నిపుణులు.

అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కొంతమంది శృంగారంపై తిరిగి ఆసక్తిని పెంచుకోలేకపోతుంటారు. ఇలాంటి వారు సంబంధిత నిపుణుల్ని సంప్రదించి.. అసలు సమస్యేంటో గుర్తించాలి. అప్పుడే దానికి సంబంధించిన చికిత్స తీసుకొని ఫలితం పొందగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్