Updated : 15/06/2021 16:05 IST

ఈ లక్షణాలుంటే సి-విటమిన్ లోపం కావచ్చట!

కరోనా బారిన పడకూడదంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఇమ్యూనిటీని పెంచే కొన్ని రకాల విటమిన్లను సంతృప్త స్థాయుల్లో తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అలా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ అందించడంలో విటమిన్‌ ‘సి’ది కీలక పాత్ర. అంతేకాదు.. పలు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, చర్మ సౌందర్యం, జుట్టు సంరక్షణకు సంబంధించిన అనేక అంశాలు ఈ విటమిన్‌తో ముడిపడి ఉన్నాయి.


సి-విటమిన్‌ లోపం ఉంటే..
అయితే చాలామంది తమకు సి-విటమిన్‌ లోపం ఉందనే విషయం కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా చిన్న చిన్న అనారోగ్యాల నుంచి సైతం త్వరగా కోలుకోలేకపోతున్నారు. అయితే కొన్ని లక్షణాలు, సంకేతాలతో మన శరీరంలో సి-విటమిన్‌ లోపాన్ని ముందే పసిగట్టవచ్చంటున్నారు నిపుణులు. ఆ తర్వాత డాక్టర్‌ సలహాల ప్రకారం పోషకాహారం లేదా సప్లిమెంట్లు తీసుకుని జాగ్రత్తపడచ్చు. మరి సి-విటమిన్‌ లోపంతో కనిపించే కొన్ని లక్షణాలేంటంటే..


చర్మం పొడిబారడం
చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సి-విటమిన్‌ పాత్ర కీలకం. అందుకే మార్కెట్లో దొరికే చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో సి-విటమిన్‌ ఉంటుంది. ఒకవేళ శరీరంలో తగినంతగా ఈ విటమిన్‌ స్థాయులు లేకపోతే చర్మం పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. తద్వారా సహజమైన నిగారింపు కోల్పోతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు ఏర్పడతాయి. ఫలితంగా చిన్న వయసులోనే వయసుమళ్లిన వారిలా కన్పిస్తారు.


గాయాల బెడద
శరీరంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచడంలో సి- విటమిన్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ లోపం ఉన్నవారి శరీరంలో కొలాజెన్‌ ఉత్పత్తి క్రమంగా తగ్గిపోయి ఏ చిన్న గాయమైనా త్వరగా మానదు. అలాగే వివిధ రకాల అనారోగ్యాల నుంచి కూడా త్వరగా కోలుకోలేరు. అంతేకాదు.. వీటిని అలాగే నిర్లక్ష్యం చేస్తే కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు.


చిగుళ్ల నుంచి రక్తస్రావం
సి-విటమిన్‌ లోపం కారణంగా చర్మ సౌందర్యం దెబ్బతినడమే కాదు దంత సమస్యలు కూడా ఎదురవుతాయి. చిగుళ్ల వాపు, నొప్పి లాంటి సమస్యలతో పాటు అప్పుడప్పుడు రక్తం కూడా కారుతుంది. ఏ కారణం లేకుండా ముక్కు నుంచి రక్తం కారడం కూడా శరీరంలో సి-విటమిన్‌ లోపానికి ఒక సంకేతమని చెప్పవచ్చు.
రక్తహీనత
మనం తీసుకునే పోషకాహారంలోని ఐరన్‌ను శరీరానికి అందేలా చేయడంలో సి-విటమిన్‌ ఎంతో కీలకం. ఒకవేళ ఈ విటమిన్‌ లోపిస్తే శరీరం తగినంత ఐరన్‌ను గ్రహించక రక్తహీనత తలెత్తుతుంది.


బరువు పెరగడం
బరువు పెరిగేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా కొందరి పొట్ట చుట్టూ కొవ్వు అమాంతం పెరిగిపోతుంది. ఇలా అకారణంగా అనూహ్యంగా బరువు పెరుగుతున్నారంటే కొందరిలో దానికి ఒక్కోసారి సి-విటమిన్ లోపం కూడా కారణం కావచ్చునంటున్నారు నిపుణులు.
నీరసం, అలసట
శరీరంలో తగినంతగా సి-విటమిన్‌ స్థాయులు లేనివారు మాటిమాటికీ నీరసపడిపోతుంటారు. చిన్నచిన్న పనులకే బాగా అలసిపోతుంటారు. చిరాకు లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయట!


ఈ తరహా ఇన్ఫెక్షన్లు!
శరీరంలోని రోగ నిరోధక శక్తిని మెరుగుపరచి పలు ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షణ కల్పిస్తుంది సి-విటమిన్‌. అందుకే ఈ విటమిన్‌ లోపం ఉన్న వారు తరచుగా బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అంతేకాదు వీటి నుంచి త్వరగా కోలుకోలేరు కూడా!
వీరిలోనే ఎక్కువ!
మద్యపానం, ధూమపానం అలవాట్లున్న వారిలో సి-విటమిన్‌ తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేవిధంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారిలోనూ ఈ విటమిన్‌ లోపం ఉంటుందట!


ఈ పండ్లతో ప్రయోజనం!
ఆహారంలో నిమ్మజాతి పండ్లను చేర్చుకోవడం ద్వారా శరీరంలో సి-విటమిన్‌ స్థాయుల్ని బాగా పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. నారింజ, నిమ్మకాయ, ఉసిరి, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌, తర్బూజా, మామిడి పండ్లను తరచుగా తీసుకుంటే మంచిది. అదేవిధంగా పాలకూర, క్యాప్సికం లాంటి కూరగాయలను కూడా డైట్‌లో చేర్చుకోవాలి. మరీ అత్యవసరమైతే సప్లిమెంట్స్‌ రూపంలో కూడా ఈ విటమిన్‌ను పొందవచ్చు. అయితే అది కూడా వైద్యుల సలహా మేరకే అని గుర్తు పెట్టుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని