వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

Updated : 07 Aug 2021 15:54 IST

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి. అవేంటో తెలుసుకొని వాటిని ఎలా వాడాలో తెలుసుకుంటే అమ్మల పని మరింత ఈజీ అవుతుంది. ఇలాంటి కొన్ని బ్రెస్ట్‌ఫీడింగ్ యాక్సెసరీస్, గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం రండి...

బ్రెస్ట్‌ఫీడింగ్ పిల్లో!

పిల్లలకు పాలివ్వడం ఎంత ముఖ్యమో.. ఆ సమయంలో వారు సౌకర్యవంతంగా పాలు తాగడమూ అంతే ముఖ్యం. ఈ క్రమంలో చాలామంది తల్లులు కూర్చొని లేదంటే పడుకొని పిల్లలకు పాలిస్తుంటారు. అయితే కొన్ని సమయాల్లో బిడ్డకు తల్లి స్తన్యం అందకపోవడం.. పాపాయిని చేతుల్లోకి తీసుకొని పాలివ్వడం వల్ల అటు తల్లికి, ఇటు బిడ్డకి అసౌకర్యంగా అనిపించడం.. వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నింటికీ చెక్ పెట్టడానికే ప్రస్తుతం 'బ్రెస్ట్‌ఫీడింగ్ పిల్లోస్' మార్కెట్లో కొలువుదీరాయి. ముందుభాగంలో బిడ్డ పడుకోవడానికి వీలుగా ఉండే ఈ పిల్లోకు బెల్టులుంటాయి. వాటి సహాయంతో ఆ పిల్లోను తల్లి పాలిచ్చేటప్పుడు ఎంత ఎత్తులో కావాలంటే అంత ఎత్తులో నడుముకు అమర్చుకోవచ్చు. దానిపై బిడ్డను పడుకోబెట్టుకొని సులభంగా పాలు పట్టచ్చు. కేవలం కూర్చొనే కాదు.. నిల్చొని కూడా బిడ్డకు ఈజీగా పాలివ్వచ్చు. తద్వారా ఎక్కువ సేపు పాలివ్వడం వల్ల తల్లికి నడుంనొప్పి రాకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

అలాగే ఇటు తల్లికి, అటు పాపాయికి సౌకర్యవంతంగా ఉండేలా లేయర్డ్‌ తరహా బ్రెస్ట్‌ఫీడింగ్‌ పిల్లోస్‌ కూడా ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేశాయి. వాటి సహాయంతో బేబీని కాస్త ఏటవాలుగా పడుకోబెట్టుకొని పాలివ్వచ్చు. ఇక తల్లికి మరింత కంఫర్టబుల్‌గా ఉండేందుకు ముందు భాగంలో కవరయ్యేలా ఉండే మరో తరహా బ్రెస్ట్‌ఫీడింగ్‌ పిల్లోస్‌ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీకు, మీ బేబీకి సౌకర్యవంతంగా ఉండే పిల్లోని ఎంచుకుంటే సరిపోతుంది.

బ్రెస్ట్ పంప్స్, స్టోరేజ్ బ్యాగ్స్

శిశువులకు ఆరు నెలలు లేదా ఏడాది వరకు తల్లిపాలు ఎంత పడితే అంత మంచిది. అయితే కొందరు మహిళలు బిడ్డకు జన్మనిచ్చిన మూడునాలుగు నెలల్లోనే తిరిగి వృత్తిఉద్యోగాల్లో చేరుతుంటారు. ఫలితంగా బిడ్డకు తల్లిపాలు కరువవుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే.. బయటికి వెళ్లే ముందే తల్లులు తమ పాలు సేకరించి నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆ పనిని సులభతరం చేయడానికే ప్రస్తుతం బ్రెస్ట్ పంప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో తల్లి తన స్తనాల నుంచి సులభంగా పాలను సేకరించచ్చు. అందులోనూ సాధారణ బ్రెస్ట్ పంప్స్ కొన్నైతే, ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్ కూడా ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

అలాగే ఎక్కువ పాలు ఉత్పత్తయినప్పుడు వాటిని నిల్వ చేయడానికి స్టోరేజ్ బ్యాగ్స్ సైతం ఇప్పుడు లభ్యమవుతున్నాయి. పిండిన పాలను వాటిలో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేయచ్చు. వీటిని పిల్లలకు తాగించే ముందు గది ఉష్ణోగ్రత వద్దకొచ్చేలా వేడి చేసి తాగించడం మంచిది. ఈ క్రమంలో ఏవైనా సందేహాలుంటే శిశు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మరీ మంచిది.

బ్రెస్ట్ షెల్స్, నిపుల్ షీల్డ్స్

పిల్లలు తల్లిపాలు చక్కగా తాగాలంటే చనుమొనలు(నిపుల్స్) వారి నోటికి అనువుగా ఉండాలన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే కొందరు తల్లుల నిపుల్స్ ఫ్లాట్‌గా ఉండి చిన్నారుల నోటికి అందవు. తద్వారా వారు పాలు తాగడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు 'నిపుల్స్ షీల్డ్స్' సహాయంతో నిపుల్స్‌ని సరిచేసుకోవచ్చు. వీటిని కాస్త సాగదీసి రొమ్ములకు అమర్చుకొంటే బిడ్డకు పాలిస్తున్న క్రమంలో నిపుల్ బిడ్డకు సౌకర్యవంతంగా మారతాయి. కాబట్టి కొన్ని రోజులయ్యాక వీటి అవసరం లేకుండానే బిడ్డకు సులభంగా పాలివ్వచ్చు.

అలాగే నిరంతరంగా బిడ్డకు పాలివ్వడం వల్ల నిపుల్స్ ఎర్రగా మారడం, పగుళ్లు రావడం.. తద్వారా నొప్పి పుట్టడం.. వంటివి జరుగుతాయి. ఇక వాటిపై నుంచి డ్రస్ వేసుకోవడం, లోదుస్తులు ధరించడం వంటివి చేస్తే ఆ దుస్తుల రాపిడి వల్ల గాయం మరింతగా రేగుతుంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి 'బ్రెస్ట్ షెల్స్' ఉపయోగపడతాయి. ఇందుకు మనం చేయాల్సిందల్లా వీటిని రొమ్ములకు అమర్చుకోవడమే! తద్వారా అవి నిపుల్స్‌కి రక్షణ కవచంలా పనిచేస్తాయి. అలాగే కొన్ని రకాల లోషన్లు, క్రీములు సైతం ఎరుపెక్కిన, పగిలిన నిపుల్స్‌ని త్వరగా నయం చేయడానికి దోహదం చేస్తాయి. అయితే వాటిని మీరే కొని తెచ్చుకోవడం కాకుండా.. నిపుణుల సలహా మేరకు మాత్రమే వాడాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

ఫీడింగ్ క్లాత్స్

బహిరంగ ప్రదేశాల్లో తమ పిల్లలకు పాలివ్వడానికి చాలామంది తల్లులు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇందుకు ముఖ్య కారణం వారు ధరించే దుస్తులే. అందుకే చాలామంది తమ చిన్నారుల్ని తీసుకొని బయటికి వెళ్లేటప్పుడు తమకు సౌకర్యవంతంగా ఉన్నా, లేకపోయినా సరే.. చీరలు కట్టుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. అందుకే అలాంటి అమ్మల కోసం ప్రత్యేకంగా 'ఫీడింగ్ క్లాత్స్' ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. క్యాజువల్ ట్యాంక్ టాప్స్, ప్రొఫెషనల్ దుస్తులు.. ఇలా అవుట్‌ఫిట్ ఏదైనా రొమ్ముల వద్ద జిప్ అమరి ఉన్నవి లేదంటే ఫ్రంట్ ఓపెన్ టాప్స్, కుర్తీస్, పీసెంట్‌ టాప్స్‌, కేప్‌ తరహా ఫీడింగ్‌ షాల్స్‌.. వంటివీ ఇప్పుడు మార్కెట్లో ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీలో లభ్యమవుతున్నాయి. తద్వారా వీటిని ధరించి తల్లులు సౌకర్యవంతంగా ఉండడమే కాదు.. బహిరంగ ప్రదేశాల్లోనూ తమ బుజ్జాయిలకు కంఫర్టబుల్‌గా పాలివ్వగలుగుతున్నారు.

నర్సింగ్ ప్యాడ్స్

చంటి పిల్లల్ని ఇంట్లో ఎవరో ఒకరి దగ్గర వదిలేసి ఉద్యోగానికి వెళ్లే తల్లులే ఈ రోజుల్లో ఎక్కువ. దాంతో బిడ్డకు ఎక్కువ సమయం పాలిచ్చే అవకాశం వారికి ఉండదు. తద్వారా తల్లుల స్తనాల్లో ఎక్కువ పాలు ఉత్పత్తయి కాసేపటికి అవి లీకవుతుంటాయి. ఫలితంగా మనం వేసుకున్న దుస్తులపై పాల మరకలు పడుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే 'నర్సింగ్ ప్యాడ్స్' చక్కటి ఎంపిక. బ్రెస్ట్ ప్యాడ్స్‌గా పిలిచే వీటిని బ్రా లోపల అమర్చుకుంటే వీటికి ఉండే పీల్చుకునే గుణం వల్ల లీకైన పాలను ఈ ప్యాడ్స్ పీల్చేసుకుంటాయి. తద్వారా సమస్య కొంత వరకు తగ్గుతుంది. ఫలితంగా ఎలాంటి అసౌకర్యానికి గురికావాల్సిన అవసరం ఉండదు.

 

ఇవి కూడా..!

* కొత్తగా తల్త్లెన మహిళల్లో, బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో స్తనాలు పాలతో నిండి కాస్త హెవీగా అనిపించడం సహజం. ఇలాంటి సమయంలో రొమ్ములకు చక్కటి సపోర్ట్ అవసరం. అందుకు 'నర్సింగ్ బ్రా'లు తోడ్పడతాయి. సాధారణ బ్రాల కంటే ఇవి కంఫర్టబుల్‌గా కూడా ఉంటాయి. వీటిలో కొన్నింటికి నిపుల్స్ భాగంలో జిప్, హుక్ తరహా అమరిక ఉంటుంది. తద్వారా బేబీకి సులభంగా పాలివ్వచ్చు.

* కొంతమంది తల్లులు ఫీడింగ్ పిల్లో పెట్టుకున్నా కాళ్లకు కింద ఏదో ఒక సపోర్ట్ పెట్టుకోవాలనుకుంటారు. అలాంటివారు 'బ్రెస్ట్‌ఫీడింగ్ స్టూల్'ని ఎంచుకోవడం ఉత్తమం. కాస్త ఎత్తులో, ఏటవాలుగా ఉండే ఈ స్టూల్ సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం ఇందుకే కాదు.. గర్భిణిగా ఉన్న సమయంలోనూ కాళ్లు నీరు పట్టకుండా కాస్త ఎత్తులో పెట్టుకోమంటారు నిపుణులు. అప్పుడూ దీన్ని ఉపయోగించుకోవచ్చు.

*ఇక పాలిచ్చే తల్లుల సౌకర్యార్థం ప్రస్తుతం నర్సింగ్‌ ఛెయిర్స్‌ కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. సోఫా ఛెయిర్‌ మాదిరిగా ఉండే దీనిలో హాయిగా వెనక్కి ఒరిగి పాలివ్వచ్చు. అలాగే దాంతో పాటే వచ్చిన చిన్న స్టూల్‌పై కాళ్లు చాపుకొని పాలిస్తే తల్లీబిడ్డలిద్దరికీ మరింత సౌకర్యంగా ఉంటుంది.

* ఫీడింగ్ డ్రస్ వేసుకున్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడానికి కాస్త ముందూ వెనకా అయ్యే తల్లులూ లేకపోలేదు. అలాంటివారు మరింత కంఫర్టబుల్‌గా పాపాయికి పాలివ్వడానికి ఉపయోగపడేదే 'నర్సింగ్ కవర్అప్'. అచ్చం టీషర్ట్‌ని పోలి ఉండే దీన్ని మీరు పాలిచ్చే సమయంలో పైనుంచి వేసేసుకుంటే సరి.. ఎంతో సౌకర్యవంతంగా బిడ్డకు పాలిచ్చేయచ్చు.

* బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి నెలనెలా కొంత బరువు పెరగాల్సి ఉంటుంది. అప్పుడే బిడ్డ సరిగ్గా ఎదుగుతున్నట్లు లెక్క! మరి, వారి బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంటే.. పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా 'బేబీ వెయింగ్ స్కేల్'ని కొనేస్తే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బుజ్జాయిల బరువును చెక్ చేసుకోవచ్చు. ఇందులోనూ డిజిటల్, అనలాగ్.. అనే రెండు రకాల స్కేల్స్ అందుబాటులో ఉన్నాయి.

బ్రెస్ట్‌ఫీడింగ్ ప్రక్రియలో అటు తల్లి, ఇటు బిడ్డ.. ఇద్దరూ సౌకర్యవంతంగా ఉండేందుకు దోహదం చేసే కొన్ని రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్ గురించి తెలుసుకున్నారుగా! మరింకెందుకాలస్యం.. బయట మార్కెట్లోనే కాదు.. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్‌లోనూ లభ్యమవుతోన్న వీటిని ఉపయోగించి మీరూ మీ బుజ్జాయికి సులభంగా పాలిచ్చేయండి.. వారి సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేయండి.. ఈ క్రమంలో మీరూ ఎంతో కంఫర్టబుల్‌గా ఫీలవ్వండి.. ఏమంటారు??

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్