Weight Loss: ఈతకు ముందు, తర్వాత ఇవి!

బరువు తగ్గే క్రమంలో చాలామంది ఎంచుకునే వ్యాయామం ఈత. స్విమ్మింగ్ అంటే ఇష్టపడేవారు సీజన్ తో సంబంధం లేకుండా ఈత కొడుతుంటారు. అయితే ఈ క్రమంలో స్విమ్మింగ్‌కు ముందు, తర్వాత తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు....

Published : 09 Jul 2022 18:57 IST

బరువు తగ్గే క్రమంలో చాలామంది ఎంచుకునే వ్యాయామం ఈత. స్విమ్మింగ్ అంటే ఇష్టపడేవారు సీజన్ తో సంబంధం లేకుండా ఈత కొడుతుంటారు. అయితే ఈ క్రమంలో స్విమ్మింగ్‌కు ముందు, తర్వాత తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అప్పుడే మనం ఆశించిన ఫలితాన్ని పొందచ్చంటున్నారు. మరి, ఈత కొట్టే క్రమంలో ఎలాంటి ఆహారపుటలవాట్లు పాటించాలో తెలుసుకుందాం రండి..

పరగడుపున వద్దు!

శారీరక, మానసిక ఆరోగ్యానికి.. చక్కటి శరీరాకృతికి ఈత మంచి వ్యాయామం. అయితే దీనివల్ల చేకూరే ప్రయోజనాలన్నీ పొందాలంటే పరగడుపున స్విమ్‌ చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. కాబట్టి వర్కవుట్‌కు గంట ముందు చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్ల.. అందులోని పోషకాలు రక్తంలో కలిసి.. రక్తప్రసరణ ద్వారా కండరాలకు అందుతాయి. ఫలితంగా అలసట లేకుండా ఈత కొట్టచ్చు. అదే తిన్న వెంటనే ఈతకు ఉపక్రమించడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్తి, గ్యాస్ట్రిక్‌.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

శక్తి కోసం.. ఏం తినాలి?

ఈతకు ముందు తీసుకునే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోమంటున్నారు నిపుణులు. అయితే అది కూడా మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే ఈత తర్వాత కండరాలు తిరిగి దృఢత్వాన్ని సంతరించుకునేందుకు ఉపకరిస్తాయి. కాబట్టి ఈ క్రమంలో అరటిపండు, చిలగడదుంప, ఓట్స్‌, నట్స్‌, బ్రౌన్ రైస్‌, హోల్‌గ్రెయిన్‌ బ్రెడ్‌.. వంటివి తీసుకోవడం మంచిది.

4:1 నిష్పత్తిలో..!

ఏ వ్యాయామం తర్వాతైనా శరీరం శక్తిని కోల్పోవడం సహజం. అలాగే ఈత కొట్టడం పూర్తయ్యాక కూడా అలసట, నీరసం ఆవహిస్తాయి. కాబట్టి ఈ శక్తిని తిరిగి పొందాలంటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అది కూడా ఈ రెండూ 4:1 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అంటే కార్బోహైడ్రేట్లు 4 వంతులు ఉంటే, ప్రొటీన్లు ఒక వంతు ఉండాలన్న మాట! ఎందుకంటే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రొటీన్లు కండర కణజాలం దృఢమయ్యేలా చేసి చక్కటి శరీరాకృతిని మన సొంతం చేస్తాయి. ఈ క్రమంలో ఈ రెండు పోషకాలు లభించే బ్రౌన్‌రైస్‌, బంగాళాదుంపలు, పప్పులు, డ్రైఫ్రూట్స్‌, అవిసె గింజలు, తాజా పండ్లు.. వంటివి మెనూలో చేర్చుకోవాలి.

ఇవి గుర్తుపెట్టుకోండి!

* ఈత కొట్టే క్రమంలో శరీరం తేమను కోల్పోతుంది. తద్వారా త్వరగా నీరసించిపోతాం. కాబట్టి ఈతకు ముందు, తర్వాత, మధ్యమధ్యలో నీళ్లు, పండ్ల రసాలు తాగడం మర్చిపోవద్దు.

* తిన్న వెంటనే ఈత కొట్టడం కాకుండా.. కనీసం గంట గ్యాప్‌ ఇవ్వడం ఎంత మంచిదో.. ఈత పూర్తయ్యాక కూడా 20-30 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. అప్పుడే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా.. పోషకాలు కండర కణజాలానికి అందేలా చూసుకోవచ్చు.

* ఈతకు ముందు, తర్వాత.. కొవ్వులు, నూనె సంబంధిత పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం.. వంటివి తీసుకోవడం వల్ల కడుపుబ్బరంగా అనిపించచ్చు. తద్వారా వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. అలాగే ఇవి ఆరోగ్యానికీ మంచివి కావు.

* మితంగా తింటేనే ఆయాసం దరిచేరదు. కాబట్టి ఈతకు ముందైనా, తర్వాతైనా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని