ఉపవాసంతో నీరసించకుండా...

మహాశివరాత్రి ఉపవాసంతో శరీరం పూర్తిగా నీరసించిపోయే ప్రమాదం ఉంది. ఇలాకాకుండా ఉండాలంటే రోజు మధ్యలో పండ్లు, పండ్లరసాలు, సలాడ్లు, పాలతో చేసే పానీయాలు, నీటిలో నానబెట్టిన ఎండు ఖర్జూరం, ఎండుఫలాలు వంటివి తీసుకుంటే శక్తి కోల్పోకుండా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 18 Feb 2023 00:14 IST

మహాశివరాత్రి ఉపవాసంతో శరీరం పూర్తిగా నీరసించిపోయే ప్రమాదం ఉంది. ఇలాకాకుండా ఉండాలంటే రోజు మధ్యలో పండ్లు, పండ్లరసాలు, సలాడ్లు, పాలతో చేసే పానీయాలు, నీటిలో నానబెట్టిన ఎండు ఖర్జూరం, ఎండుఫలాలు వంటివి తీసుకుంటే శక్తి కోల్పోకుండా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే దీక్ష తర్వాత తీసుకోవాల్సిన ఆహారం గురించి కూడా సూచనలిస్తున్నారు.

పాలతో.. పది బాదం పప్పులను నీటిలో నానబెట్టి తొక్క తీసి చిటికెడు యాలకుల పొడి, నాలుగైదు కుంకుమపువ్వు రేకలు, పావుచెంచా చక్కెర, పావుకప్పు పాలు కలిపి మిక్సీలో మెత్తని పేస్టులా చేయాలి. ఆ తర్వాత కప్పు పాలను మరగనిచ్చి, అందులో మెత్తగా నూరి ఉంచిన మిశ్రమాన్ని కలిపి మరో రెండు నిమిషాలుంచి దించి చల్లార్చాలి. ఈ బాదం పాలను రోజు మధ్యలో తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అంది సాయంత్రం వరకు నీరసించిపోకుండా ఉండొచ్చు.

సగ్గుబియ్యంతో... నీటిలో నానబెట్టిన పావు కప్పు సగ్గుబియ్యాన్ని పావుగంట సేపు చిన్న మంటపై ఉడికించి రెండు కప్పుల పాలు కలపాలి. తర్వాత చిటికెడు యాలకుల పొడి, రెండు చెంచాల బెల్లంపొడి వేసి చిక్కగా అయ్యేంతవరకు ఉడికించి దించాలి. ఇందులో ముందుగానే నెయ్యిలో వేయించి ఉంచిన నాలుగైదు బాదంపప్పులు, ఎండుద్రాక్ష వేయాలి. ఇలా సిద్ధమైన సగ్గుబియ్యం ఖీర్‌ను చల్లార్చి తాగితే చాలు. ఇందులోని కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, జింక్‌ తదితర ఖనిజ లవణాలు శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తాయి. దీక్ష మధ్యలో దీన్ని తీసుకోవచ్చు.

ఉపవాసం తర్వాత.. కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని శుభ్రపరిచి కొంచెం నీళ్లు చల్లి మధ్యాహ్నం నానబెడితే సాయంత్రానికల్లా కిచిడీ చేసుకోవడానికి సిద్ధమవుతాయి. దీక్ష ముగిసే సమయానికి ముందుగానే ఒక బంగాళాదుంపను చిన్న ముక్కలుగా కోసి ఉడికించి చల్లార్చుకోవాలి. పొయ్యిపై గిన్నె ఉంచి చెంచా నూనె వేసి వేడెక్కిన తర్వాత చెంచాడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు మిశ్రమం,  చెంచా వేరుశనగపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉడికించి ఉంచిన బంగాళాదుంప ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. పావుచెంచా పసుపు, చిటికెడు రాళ్ల ఉప్పుతోపాటు ముందుగా నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలిపి మూతపెట్టి, అయిదు నిమిషాల తర్వాత దించేస్తే సగ్గుబియ్యం కిచిడీ సిద్ధమవుతుంది. ఉపవాసం తర్వాత దీన్ని తీసుకుంటే శరీరం తిరిగి శక్తిమంతమవుతుంది. ఇందులోని పోషకవిలువలు రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఎక్కువ గంటలు జీర్ణాశయం ఖాళీగా ఉండటంతో గ్యాస్‌ సమస్య. ఈ కిచిడీ సమస్యను దూరం చేస్తుంది. ఇందులోని కె విటమిన్‌ మెదడును తిరిగి ఉత్సాహపరుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్