Work-Life Balance: ఈ గ్యాడ్జెట్స్‌ మీ ఇంట్లో ఉన్నాయా?

ఆఫీస్ పనుల రీత్యా దివిజ గంటల తరబడి ల్యాపీతోనే గడుపుతుంటుంది. తద్వారా అది వేడెక్కి.. దాని ప్రభావం చేసే పనిపై పడుతుంది. దాంతో ఇంటి పనులూ ఆలస్యమవుతున్నాయంటోంది.మౌనిమను ప్రశాంతంగా పని చేసుకోనివ్వరు ఆమె ఇద్దరు పిల్లలు. ల్యాప్‌టాప్‌ కీబోర్డుపై ఏవేవో పదార్థాలు, పానీయాలు పడేస్తుంటారు. దాంతో అది మాటిమాటికీ మొరాయించి పనికి అంతరాయం కలిగిస్తుంటుంది.ఇలా చెప్పుకుంటూ పోతే మన వృత్తిగత జీవితానికి ఆటంకం కలిగించే అంశాలు.....

Published : 28 Mar 2022 19:00 IST

ఆఫీస్ పనుల రీత్యా దివిజ గంటల తరబడి ల్యాపీతోనే గడుపుతుంటుంది. తద్వారా అది వేడెక్కి.. దాని ప్రభావం చేసే పనిపై పడుతుంది. దాంతో ఇంటి పనులూ ఆలస్యమవుతున్నాయంటోంది.

మౌనిమను ప్రశాంతంగా పని చేసుకోనివ్వరు ఆమె ఇద్దరు పిల్లలు. ల్యాప్‌టాప్‌ కీబోర్డుపై ఏవేవో పదార్థాలు, పానీయాలు పడేస్తుంటారు. దాంతో అది మాటిమాటికీ మొరాయించి పనికి అంతరాయం కలిగిస్తుంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే మన వృత్తిగత జీవితానికి ఆటంకం కలిగించే అంశాలు బోలెడుంటాయి. తద్వారా సమయానికి పని పూర్తికాక.. ఒత్తిడికి లోనవుతాం.. దీంతో మరోవైపు ఇంటి పనులు/బాధ్యతల్నీ నిర్వర్తించలేక విసుగెత్తిపోతుంటాం. అయితే ఈ సమస్యల్ని/ఆటంకాల్ని అధిగమించి వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ సాధించాలంటే ఇప్పుడున్న టెక్నాలజీతో సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

ఇటీవలి కాలంలో మన రోజువారీ పనుల్ని సులభతరం చేయడానికి బోలెడన్ని గ్యాడ్జెట్లు అందుబాటులోకొచ్చాయి. ఇదే తరహాలో వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ని సాధించడానికీ కొన్ని టెక్‌ పరికరాలు మన సౌకర్యార్థం మార్కెట్లో కొలువుతీరాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!

ల్యాప్‌టాప్‌ కూలింగ్ ప్యాడ్

ఇంటి నుంచి పని చేసినా, ఆఫీస్‌కెళ్లి విధులు నిర్వర్తించినా.. గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను ఉపయోగించాల్సిందే! ఒక్కోసారి ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చాక కూడా ఇంకాసేపు పనిచేయాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు నిరంతరాయంగా పనిచేయడం వల్ల అది వేడెక్కుతుంది. తద్వారా పదే పదే షట్‌డౌన్‌ అవడం, త్వరత్వరగా రిపేర్‌కు రావడం.. వంటి సమస్యలొస్తాయి. దీనివల్ల పనికి అంతరాయం కలుగుతుంది. అంతేకాదు.. వేడెక్కిన ల్యాపీతో పనిచేయడం వల్ల ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. మరి, ఇలాంటి సమస్యకు చెక్‌ పెట్టాలంటే ‘ల్యాప్‌టాప్‌ కూలింగ్‌ ప్యాడ్‌’ చక్కటి పరిష్కారం. పలక మాదిరిగా ఉండే ఈ గ్యాడ్జెట్‌ లోపల ఫ్యాన్లు అమరి ఉంటాయి. అవి నిరంతరం తిరుగుతూ.. ల్యాపీ అడుగుభాగాన్ని చల్లగా ఉంచుతాయి. ఇందుకు మనం చేయాల్సిందల్లా దీనిపై ల్యాపీ పెట్టుకొని పని చేయడమే! ఈ తరహా కూలింగ్‌ ప్యాడ్స్‌ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో లభిస్తున్నాయి.

వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్

ఇప్పుడంతా వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌, ఇయర్‌బడ్స్‌, ఎయిర్‌పాడ్స్‌.. హవా కొనసాగుతోంది. అయితే వీటిని చాలామంది సాధారణ ఫోన్‌ కాల్స్‌ మాట్లాడడానికి, పాటలు వినడానికి.. ఇలా వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తుంటారు. కొంతమంది ఆఫీస్ కాన్ఫరెన్స్‌ కాల్స్‌ మాట్లాడడానికి కూడా వీటిని వాడుతుంటారనుకోండి! నిజానికి ఇలా వృత్తిపరమైన వాయిస్‌ కాల్స్‌ మాట్లాడేటప్పుడు.. ల్యాప్‌టాప్‌/సిస్టమ్‌తో పని లేదనుకుంటే.. ఓవైపు కాల్‌ మాట్లాడుతూనే.. మరోవైపు ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పనులుంటే పూర్తి చేసుకోవచ్చు. అయితే అది కూడా మీ ఆఫీస్‌ పనికి అంతరాయం కలగనంత వరకు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. నిజానికి ఇది సాధారణ విషయమే అయినా.. చాలామంది వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ కోణంలో ఆలోచించి ఉండరు కదూ!!

స్పిల్‌ రెసిస్టెంట్ కీబోర్డ్

అటు ఆఫీస్‌ పనిచేస్తూ.. ఇటు ఏవైనా స్నాక్స్‌ తినడం, నీళ్లు-ఇతర పానీయాలు తాగడం వల్ల అవి ఒలికి కీబోర్డ్‌పై పడుతుంటాయి. ఇంట్లో పిల్లలున్నా కీబోర్డ్‌ను ఇలా చిందరవందగా తయారు చేస్తుంటారు. తద్వారా అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పనికి ఆటంకం కలుగుతుంది. అలా జరగకూడదంటే.. సాధారణ కీబోర్డుకు బదులు ‘స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డ్‌’ అమర్చుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. దీనిపై ఉండే ప్రత్యేకమైన కోటింగ్‌ కీబోర్డ్‌ కీస్‌కి రక్షణ కల్పిస్తుంది.. అలాగే ప్రత్యేకమైన డిజైన్‌తో దీన్ని రూపొందించడం వల్ల పొరపాటున ఏవైనా పదార్థాలు ఒలికినా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు కూడా!

ఈ యాప్స్‌తో పని సులువు!

చేసే పనిలో ప్రాధాన్యతల్ని తెలుసుకోలేక కొందరు, మతిమరుపుతో మరికొందరు, నిర్లక్ష్యంతో ఇంకొందరు.. ఆఫీస్‌ పనుల్లో జాప్యం జరగడానికి ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన కారణం ఉంటుంది. అయితే వీటికి చెక్‌ పెట్టే ‘వర్క్‌ షెడ్యూల్‌ యాప్స్‌’ ప్రస్తుతం బోలెడన్ని అందుబాటులో ఉన్నాయంటున్నారు టెక్‌ నిపుణులు. ‘వర్క్‌ టైమ్‌’, ‘వెన్‌ ఐ వర్క్‌’, ‘గూగుల్‌ క్యాలండర్‌’.. వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. వీటిలో కొన్ని మనం చేసే పనులకు సంబంధించిన ప్రాధాన్యాల్ని/షెడ్యూల్స్‌ని గుర్తు చేస్తుంటాయి. మరికొన్ని యాప్స్‌ని కొలీగ్స్‌తో కలిసి బృందంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటాయి. ఈ తరహా యాప్స్‌ ద్వారా సహోద్యోగులకు రోజువారీ లేదా వారాంతాలకు సంబంధించిన పనుల్ని పురమాయించచ్చు. గూగుల్‌ క్యాలండర్‌ తరహా యాప్స్‌ ద్వారా బిజినెస్‌/ఆఫీస్‌ మీటింగ్స్‌, అపాయింట్‌మెంట్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను సహచరులతో పంచుకోవచ్చు.

మరి, ఇవి కాకుండా టెక్నాలజీ సహాయంతో మీరు వర్క్-లైఫ్ బ్యాలన్స్ ఎలా చేసుకుంటున్నారో Contactus@vasundhara.net ద్వారా మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్