ఈ చిన్నారుల ధైర్యసాహసాలకు ఫిదా అవ్వాల్సిందే..!

సినిమాల్లో అగ్ని ప్రమాదాలు, సునామీలు, భూకంపాలు, ఉగ్రదాడులు.. వంటి విపత్తులు సంభవించినప్పుడు హీరో పాత్రధారి సమయస్ఫూర్తితో ప్రజలను కాపాడటం మనం చూస్తుంటాం. ఇలాంటివి నిజ జీవితంలో జరిగినప్పుడు మనకు మనమే రక్షణ పొందాల్సి ఉంటుంది. మరొకరి కోసం వేచి చూస్తే భరించలేని నష్టం జరగచ్చు.

Updated : 24 Nov 2022 15:20 IST

(Photos: Twitter)

సినిమాల్లో అగ్ని ప్రమాదాలు, సునామీలు, భూకంపాలు, ఉగ్రదాడులు.. వంటి విపత్తులు సంభవించినప్పుడు హీరో పాత్రధారి సమయస్ఫూర్తితో ప్రజలను కాపాడటం మనం చూస్తుంటాం. ఇలాంటివి నిజ జీవితంలో జరిగినప్పుడు మనకు మనమే రక్షణ పొందాల్సి ఉంటుంది. మరొకరి కోసం వేచి చూస్తే భరించలేని నష్టం జరగచ్చు. కాబట్టి, పిల్లలకు చిన్న వయసు నుంచే చదువుతోపాటే ఇలాంటి జీవన నైపుణ్యాలను కూడా నేర్పిస్తుండాలి. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆ నైపుణ్యాలే ప్రాణాలను కాపాడుతుంటాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు ఇద్దరమ్మాయిలు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిమప్రియ, మహారాష్ట్రకు చెందిన శివాంగి కాలేలు క్లిష్ట సమయాల్లో తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడారు. దానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం వీరిని ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’తో సత్కరించింది.

ఎనిమిదేళ్ల వయసులో ఉగ్రవాదికి ఎదురు నిలిచింది!

గురుగు హిమప్రియది శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామం. వారిది సైనిక కుటుంబం. ఆమె తండ్రి సత్యనారాయణ ఆర్మీ జవానుగా పని చేస్తున్నారు. తల్లి పద్మావతి గృహిణి. వారు జమ్మూ కశ్మీర్‌లోని ఆర్మీ క్వార్టర్స్‌లో ఉన్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు వీరున్న క్వార్టర్స్‌ను చుట్టుముట్టారు. రైఫిల్స్, గ్రెనేడ్లతో బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో సత్యనారాయణ ఇంట్లో లేరు. దాంతో పద్మావతి.. హిమప్రియతో పాటు తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఓ గదిలో దాక్కుంది. గ్రెనేడ్ దాడిలో పద్మావతి చేతికి తీవ్ర గాయమైంది. ఉగ్రవాదులు ఒక్కో ఇంటి తలుపును బద్దలుకొడుతూ అడ్డు వచ్చిన వారిని కాల్చేస్తున్నారు. దాంతో తన ధైర్యాన్నంతా కూడదీసుకుని హిమప్రియ తల్లిని, ఇద్దరి చెల్లెళ్లను ఒక గదిలో ఉంచి ఉగ్రవాదికి ఎదురు నిలిచింది. దాదాపు మూడు గంటలపాటు ఉగ్రవాదితో సంభాషించి అతని దృష్టి మళ్లించింది. ఆ తర్వాత సైన్యానికి సమాచారం ఇచ్చి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ సంఘటన ఫిబ్రవరి 10, 2018లో జరిగింది. అప్పటికి ఆమె వయసు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే. ఈ సంఘటనలో హిమప్రియ భుజానికి గాయాలయ్యాయి. హిమప్రియ ధైర్యసాహసాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘ధైర్య సాహసాల’ విభాగంలో ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’తో సత్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని వర్చువల్‌గా అందజేశారు.


తల్లి, చెల్లి ప్రాణాలను కాపాడింది!

మహారాష్ట్రకు చెందిన శివాంగి కాలే స్వస్థలం జల్గామ్. శివాంగి వయసు ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం ‘పోదార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో ఒకటో తరగతి చదువుతోంది. శివాంగి యూకేజీ చదివే సమయంలోనే కరెంట్‌ షాక్‌ నుంచి తన తల్లి, చెల్లి ప్రాణాలను కాపాడింది. శివాంగి తల్లి గుల్బక్షి రిటైర్ట్ నేవీ ఆఫీసర్. శివాంగి ఎలక్ట్రిక్ షాక్ నుంచి తనను ఎలా రక్షించిందో వివరిస్తూ-  ‘నేను స్నానం చేద్దామని స్టీల్‌ బకెట్‌లో నీళ్లు పోసి ఎలక్ట్రిక్‌ హీటర్‌ పెట్టాను. కొద్ది సేపటికే నేను కరెంట్‌ షాక్‌కు గురయ్యాను. దాంతో నా చేతులు షేక్‌ అయ్యాయి. నన్ను అలా చూసిన మా చిన్న పాప ఇషాన్వి నా వైపు పరుగెత్తుకుంటూ వచ్చింది. నేను తనను చూస్తున్నాను కానీ, మాట్లాడలేకపోయాను. ఆ సమయంలో శివాంగి స్విచ్‌బోర్డు వైపు చూసి నా పరిస్థితిని అర్థం చేసుకోవడం గమనించాను. తను ఇషాన్విని నా దగ్గరకు రాకుండా వెనక్కి లాగింది. ఒక స్టూల్ తీసుకుని స్విచ్ ఆఫ్‌ చేసింది. దాంతో నా చేతులు షేక్‌ అవ్వడం ఆగిపోయాయి. కానీ, నేను షాక్‌ నుంచి వెంటనే బయటకు రాలేకపోయాను. సోఫాలో అలా కూలబడిపోయాను. శివాంగి నన్ను తట్టి ఎలా ఉందని అడిగింది. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది’ అంటూ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు గుల్బక్షి.

ఈ వయసులో నీకు ఈ విషయాలు ఎలా తెలుసని శివాంగిని అడిగితే ‘కరెంటు ఉపకరణాలు, కరెంట్‌ దగ్గర జాగ్రత్తగా ఉండాలని స్కూల్‌లో చెప్పారని’ చెప్పిందీ చిన్నారి. అదృష్టవశాత్తు గుల్బక్షికి ఎటువంటి గాయాలు కాలేదు. తన సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలు కాపాడిన శివాంగి పలువురి ప్రశంసలు అందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ చిన్నారికి ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారా’న్ని అందించింది.

ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ర్యాంకుల పోటీల్లో పడి పిల్లలకు ఇతర నైపుణ్యాలను నేర్పించడం లేదు. ఈ క్రమంలో- పిల్లలకు స్విమ్మింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే వంటి విద్యలతో పాటు పాము కాటుకు గురవడం, గుండెపోటు రావడం, వడదెబ్బ తగలడం.. లాంటి అత్యవసర సమయాల్లో ఎలా ప్రతిస్పందించాలో నేర్పాల్సిన అవసరం ఎంతో ఉందంటున్నారు నిపుణులు. దానివల్ల కొన్నిసార్లు ప్రాణాలను కూడా కాపాడగలమని ఈ చిన్నారులు నిరూపిస్తున్నారు. మరి, మీరూ మీ పిల్లలకు ఇలాంటి విద్యలు, నైపుణ్యాలు నేర్పిస్తారు కదూ..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్