జాగ్రత్త.. ఈ అలవాట్లతో షుగర్ పెరగచ్చు!
ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బందిపెడుతోన్న సమస్య మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం సమస్యతో బాధపడుతోన్న వారిలో మనదేశం రెండవ స్థానంలో ఉంది. దీనికి మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు ఈ సమస్యను ముందుగా గుర్తించకపోవడం....
ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బందిపెడుతోన్న సమస్య మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం సమస్యతో బాధపడుతోన్న వారిలో మనదేశం రెండవ స్థానంలో ఉంది. దీనికి మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు ఈ సమస్యను ముందుగా గుర్తించకపోవడం కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. చాలామందికి ఏదైనా సందర్భంలో పరీక్ష చేయించుకుంటే కానీ మధుమేహం ఉన్న సంగతి తెలియడం లేదు. ఈ క్రమంలో మనం రోజూ చేసే చిన్న చిన్న తప్పులు కూడా రక్తంలోని చక్కెర స్థాయులను ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా...
బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారా?
రోజూ బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. ఉదయం ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా చురుగ్గా ఉండచ్చు. అయితే కొంతమంది వివిధ కారణాల వల్ల బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా లంచ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయులు పెరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయడంతో పాటు డైట్‌లో ఏవైనా మార్పులు చేసుకున్నప్పడు డాక్టర్‌ని సంప్రదించాలని సూచిస్తున్నారు.
కృత్రిమ చక్కెరలతో..
మధుమేహం ఉన్నవారు తీపి కోసం శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా కృత్రిమ తీపి పదార్థాలను తీసుకుంటారు. వీటి వల్ల షుగర్ లెవెల్స్ పెరగవని భావిస్తారు. కానీ, వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ ప్రభావితమవుతుందని నిపుణులు అంటున్నారు. తద్వారా చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయిని చెబుతున్నారు. కాబట్టి, వీటి వాడకాన్ని సాధ్యమైనంత మేరకు అదుపులో ఉంచుకోవడం మంచిది.
కెఫీన్‌తో...
చాలామందికి కాఫీ/టీ తాగనిదే రోజు మొదలవదు. కొంతమంది లేచిన దగ్గర్నుంచి పడుకునే దాకా అనేకసార్లు తీసుకుంటారు. ఇలాంటివారు ‘మేము కాఫీ, టీలలో చక్కెర వేసుకోం.. కాబట్టి ఏం కాదు’ అనుకుంటారు. అయితే మధుమేహం ఉన్నవారికి ఇది అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. పంచదార వేసుకోకపోయినప్పటికీ కొంతమందికి కాఫీ, టీ పౌడర్‌లో ఉండే కెఫీన్ రక్తంలోని చక్కెర స్థాయులను ప్రభావితం చేస్తుంటుంది. ఇలాంటివారు సాధ్యమైనంత మేరకు వీటికి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
డీహైడ్రేషన్..
పనిలో పడో, అశ్రద్ధ వల్లనో కొంతమంది నీళ్లు తాగడం కూడా మర్చిపోతుంటారు. ఫలితంగా రోజులో తాగాల్సిన దానికంటే తక్కువగా నీళ్లు తాగుతుంటారు. దానివల్ల డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమవుతుంది. అంతేకాదు.. రక్తంలోని చక్కెర స్థాయులు కూడా పెరుగుతాయి. కాబట్టి, రోజూ సరిపడినన్ని నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నించండి.
సరిగ్గా నిద్ర పోతున్నారా?
రోజంతా యాక్టివ్‌గా పనిచేయాలంటే సరిపడినంత నిద్ర ఉండాలి. కానీ, ఈ రోజుల్లో చాలామంది వివిధ కారణాల వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీరానికి సరిపడినంత విశ్రాంతి లభించకపోతే ఇన్సులిన్ హార్మోన్ కూడా ప్రభావితమవుతుంటుంది. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు సరిపడినంత సమయం నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.