ఇవీ ఇంటిని కలుషితం చేస్తాయ్‌!

ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకోసమే ఇంటిని తరచూ శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు వస్తువుల దుమ్ము దులపడం.. ఇలాంటివెన్నో చేస్తుంటాం. అయితే మనం చేసే కొన్ని రోజువారీ పనులు మనకు తెలియకుండానే మన ఇంటిని కలుషితం....

Updated : 13 Sep 2022 15:12 IST

ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకోసమే ఇంటిని తరచూ శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు వస్తువుల దుమ్ము దులపడం.. ఇలాంటివెన్నో చేస్తుంటాం. అయితే మనం చేసే కొన్ని రోజువారీ పనులు మనకు తెలియకుండానే మన ఇంటిని కలుషితం చేస్తాయంటున్నారు నిపుణులు. అంతిమంగా అది మన ఆరోగ్యానికే చేటు చేస్తుందంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా పనులు? వాటి వల్ల ఇల్లు ఎలా కలుషితమవుతుందో తెలుసుకుందాం రండి..

కార్పెట్లు-రగ్గులు

ఆకర్షణీయమైన రంగులు, విభిన్న డిజైన్లతో కూడిన కార్పెట్లు-రగ్గులు లివింగ్‌ రూమ్‌, హాల్‌కు ఎంతో అందాన్ని తీసుకొస్తాయి. అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వీటి ఉపయోగం పెరిగిపోయింది. నిజానికి ఈ అందం, ఆకర్షణ వెనుక ఇంటిని కలుషితం చేసే ప్రమాదకర వాయువులూ దాగున్నాయంటున్నారు నిపుణులు. కొన్ని రకాల కార్పెట్లు, రగ్గులు వొలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌తో తయారవుతుంటాయి. అవి విడుదల చేసే ఘాటైన వాసనలు, రసాయనాలు.. ఇంటికి, ఒంటికి రెండింటికీ మంచివి కావు. అలాగే వీటిని శుభ్రం చేయకుండా ఎక్కువ రోజులు అలాగే వాడడం వల్ల వాటిపై చేరిన దుమ్ము-ధూళి మన శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తాయి. కాబట్టి ఇలాంటి రసాయనపూరిత రగ్గులకు బదులుగా జ్యూట్‌, ర్యాగ్‌ రగ్స్‌, చేత్తో నేసిన రగ్గులు-కార్పెట్లను ఉపయోగిస్తే ఏ ప్రమాదమూ ఉండదు. అలాగే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడమూ మర్చిపోవద్దు.

అవి ‘విష’ వాయువులు!

ఇంట్లోని ఘాటైన, చెడు వాసనల్ని పోగొట్టడానికి ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌, సెంటెడ్‌ క్యాండిల్స్‌.. వంటివి ఉపయోగించడం మనలో చాలామంది చేసే పనే! అయితే ఇవి మనసుకు ఆహ్లాదాన్ని పంచే సువాసనల్ని వెదజల్లినా.. వాటి తయారీలో వాడిన రసాయనాలు ఆస్తమా.. వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు కలిగించే అవకాశమే ఎక్కువంటున్నారు నిపుణులు. అందుకే వీటికి బదులు నాఫ్తలీన్‌ బాల్స్‌ని అక్కడక్కడా అమర్చడం, అత్యవసర నూనెల్ని ఉపయోగించడం, అత్యవసర నూనెలతో తయారుచేసిన క్యాండిల్స్‌ని వెలిగించడం, దుర్వాసనలు వచ్చే చోట బేకింగ్‌సోడా-వెనిగర్‌ వంటివి చల్లడం, సువాసనలు వెదజల్లే మల్లె-లావెండర్‌-పుదీనా-రోజ్‌మేరీ.. వంటి మొక్కల్ని పెంచడం.. ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించచ్చు.

హీటర్లకు బదులుగా..!

చల్లటి వాతావరణం ఉన్నప్పుడు గదిని వెచ్చగా ఉంచుకోవడానికి ఇప్పుడు చాలామంది ఇంట్లోనే ఎలక్ట్రిక్‌ హీటర్లు, ఫైర్‌ ప్లేస్‌.. వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవి కూడా ఇంటిని కలుషితం చేసి.. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. వీటి నుంచి వెలువడే వాయువులు, పొగ.. శ్వాస సంబంధిత సమస్యల్ని తెచ్చిపెడతాయి. అలాగే ఈ వేడి గదిలోని తేమను తొలగించి.. వాతావరణాన్ని మరింత పొడిగా మారుస్తుంది. తద్వారా చర్మ సంబంధిత అలర్జీలు, కంటి ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయట! కాబట్టి ఇంట్లోని చల్లటి వాతావరణాన్ని వెచ్చగా మార్చుకోవడానికి వివిధ రకాల సహజసిద్ధమైన ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించచ్చు. ఉదాహరణకు.. సోఫా-మంచంపై వెల్వెట్‌ కవర్లు-బెడ్‌షీట్స్‌ పరచుకోవడం, మందపాటి కర్టెన్లను వేలాడదీయడం, ఉదయాన్నే కిటికీలు తెరిచి ఇంట్లోకి ఎండ పడేలా చేయడం.. వంటివి అందులో కొన్ని!

పెర్‌ఫ్యూమ్‌ వాడుతున్నారా?

అందాన్ని సంరక్షించుకోవడానికి మనం రోజూ వివిధ రకాల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్ని ఉపయోగిస్తుంటాం. మేకప్‌, లోషన్లు, షాంపూలు, పెర్‌ఫ్యూమ్‌, హెయిర్‌ స్ప్రే.. వీటిలో కొన్ని. వీటి తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల మనకు ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లడమే కాదు.. ఇంటినీ అపరిశుభ్రంగా మార్చుతున్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి తెలిసి తెలిసి ఈ పొరపాటు చేయకుండా.. ఇంట్లో సహజసిద్ధంగా తయారుచేసుకునే స్క్రబ్‌, ఫేస్‌మాస్క్‌లు, శీకాకాయ షాంపూ, పెర్‌ఫ్యూమ్‌ కోసం అత్యవసర నూనెలు.. ఇలా ఆలోచిస్తే ప్రతిదానికీ ప్రత్యామ్నాయ మార్గాలుంటాయి. వాటితో అందం, ఆరోగ్యంతో పాటు ఇల్లూ పరిశుభ్రంగా ఉంటుంది.

పెట్స్‌ పరిశుభ్రంగా..!

ఇష్టంతోనో, ఒత్తిడిని దూరం చేసుకోవాలనో.. ఈ రోజుల్లో చాలామంది పెంపుడు జంతువుల్ని ఇంట్లో భాగం చేసుకోవడం చూస్తున్నాం. అయితే వీటిని పెంచుకోవడమే కాదు.. పరిశుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. లేదంటే వాటి వల్ల ఇంట్లో నేల, సోఫా కవర్లు, బెడ్‌షీట్లపై దుమ్మ, క్రిములు చేరతాయి. అవి ఇంటిని అపరిశుభ్రంగా మార్చుతాయి. తద్వారా మన ఆరోగ్యానికి నష్టం కూడా! కాబట్టి మనం ఎలాగైతే రోజూ స్నానం చేస్తామో.. అలాగే పెంపుడు జంతువులకు కూడా తరచూ స్నానం చేయించాలి. వాటి కోసం ప్రత్యేకంగా డెన్‌ను ఏర్పాటుచేయాలి. అవి తిరిగిన ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, సోఫా కవర్లు-బెడ్‌షీట్లను తరచూ ఉతకడం.. వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్