ఇంటినిలా శుభ్రం చేస్తే.. ఇక అంతే సంగతులు!

ఇంటిని శుభ్రం చేయడంలో ఆడవారిది అందెవేసిన చేయి! ఇల్లు తళతళా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో మనకు ఓపిక ఉన్నా లేకపోయినా వీలు చూసుకొని మరీ క్లీనింగ్‌ పని పెట్టుకుంటాం. అయితే ఈ క్రమంలో మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు ఇంటిని....

Published : 16 Sep 2022 20:22 IST

ఇంటిని శుభ్రం చేయడంలో ఆడవారిది అందెవేసిన చేయి! ఇల్లు తళతళా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో మనకు ఓపిక ఉన్నా లేకపోయినా వీలు చూసుకొని మరీ క్లీనింగ్‌ పని పెట్టుకుంటాం. అయితే ఈ క్రమంలో మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు ఇంటిని శుభ్రంగా ఉంచడానికి బదులు మరింత మురికిగా మార్చుతుంటాయని చెబుతున్నారు నిపుణులు. దానివల్ల సమయం వృథా.. శ్రమా పెరిగిపోతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో చేయకూడని ఆ పొరపాట్లేంటో ముందుగా తెలుసుకోవాలి..!

ఇంటిని శుభ్రం చేయడానికి మనం ఎన్నో వస్తువుల్ని ఉపయోగిస్తాం. చీపురు, మాప్, వ్యాక్యూమ్‌ క్లీనర్‌, క్లీనింగ్‌ డస్టర్‌.. ఇలా చాలానే ఉంటాయి. అయితే వీటిలో దేని ఉపయోగం దానిదే! అలాకాకుండా ఒకదాన్ని మరొక పనికి వాడితే ఇల్లు మరింత మురికిగా తయారవుతుందంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. చీపురును ఇల్లు ఊడవడానికి ఉపయోగిస్తాం.. అదే చీపురుతో షెల్ఫులు, కిటికీలు శుభ్రం చేసే వారూ లేకపోలేదు. దానివల్ల గచ్చుపై మురికి చేరుతుంది. కాబట్టి ఈ పొరపాటు మరోసారి జరగకుండా చూసుకోవడం ఉత్తమం.

రగ్గులు, పరుపులు, సోఫాసెట్లపై ఉండే దుమ్మును తొలగించుకోవడానికి ప్రత్యేకమైన క్లీనింగ్‌ పరికరాలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి.. కొంతమంది టవల్స్‌, చిన్న చిన్న గుడ్డ ముక్కలతో వాటిపై కొడుతూ దుమ్ము దులుపుతుంటారు. దీనివల్ల వాటిపై ఉండే అతి సూక్ష్మమైన దుమ్ము రేణువులు ఇతర వస్తువులపై పడడం, వాటిని మనం పీల్చుకోవడం వల్ల మనకే నష్టం. అందుకే ఇకపై అలా చేయడం మానుకోండి.

కిటికీలు, అరలు, కొన్ని వస్తువులు.. వీటిని ఏ పండక్కో, ప్రత్యేక సందర్భానికో కానీ శుభ్రం చేయం. దీనివల్ల వాటిపై దుమ్ము పేరుకుపోయి.. ఇల్లంతా అపరిశుభ్రంగా తయారవుతుంది.

అలాగే ఈ వర్షాకాలంలో కొన్ని అరల మూలలు, గోడలు తేమగా మారతాయి. దానివల్ల అక్కడ ఉంచిన దుస్తులు, ఇతర వస్తువులు తడిగా మారి.. అదో రకమైన వాసన వస్తుంటుంది. ఈ వాసన ఇల్లంతా వ్యాపించి తద్వారా అపరిశుభ్రంగా మారుతుంది.

కొంతమంది ఇల్లంతా శుభ్రం చేయడానికి ఒకే క్లాత్‌/స్పాంజ్‌ని ఉపయోగిస్తుంటారు. దాంతోనే అరల్ని, వస్తువుల్ని, ఫ్యాన్లను, కిటికీలను.. ఇలా అన్నింటినీ క్లీన్‌ చేస్తుంటారు. దీనివల్ల ఒక చోట ఉన్న క్రిములు మరో చోట అంటుకొని.. తద్వారా ఇల్లు శుభ్రపడకపోగా.. మరింత మురికిగా మారుతుంది. కాబట్టి ఒకే క్లాత్‌ని కాకుండా విడివిడిగా వాడడం మంచిది.

ఇంటిని శుభ్రపరిచే క్రమంలో చాలామంది చేసే మరో పొరపాటు సరైన వెంటిలేషన్‌ పాటించకపోవడం. అంటే.. దుమ్ము దులిపేటప్పుడు, క్లీనింగ్‌ ఉత్పత్తుల్ని వాడే క్రమంలో కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. లేదంటే ఆ గాలి ఇంట్లోనే ఉండిపోయి.. ఆ ఘాటైన వాసనల ద్వారా మన ఆరోగ్యానికి చేటు కలుగుతుంది.. ఇల్లూ పూర్తిగా శుభ్రపడదు.

అలాగే శుభ్రం చేసిన ప్రతిసారీ క్లాత్స్‌/స్పాంజ్‌లు ఉతికి పొడిగా ఆరబెట్టాలి. అవి సరిగ్గా శుభ్రపరచకపోయినా, పూర్తిగా ఆరకపోయినా వాటిపై బ్యాక్టీరియా, క్రిములు వృద్ధి చెంది.. వాటిని మళ్లీ వాడినప్పుడు ఇంట్లోని వస్తువులపై చేరే అవకాశం ఎక్కువ! అలాగే వ్యాక్యూమ్‌ క్లీనర్లలోని దుమ్మును సైతం ఎప్పటికప్పుడు తొలగించడం మర్చిపోవద్దు.

మనం ఎక్కువగా వాడే వాటిని శుభ్రం చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. రోజులో ఎక్కువ శాతం కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, సింకు, వాష్‌బేసిన్‌.. వంటివి ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి వాటిని క్రిమి సంహారక ద్రావణాలతో రోజూ శుభ్రం చేస్తేనే.. ఎలాంటి దుర్వాసన దరి చేరకుండా ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది.

డిష్‌వాషర్‌, వాషింగ్ మెషీన్‌.. వంటివీ తరచూ శుభ్రం చేయాల్సిందే! లేదంటే వాటి పైపులు జామ్‌ అవడం, దుర్వాసన రావడం.. వంటివి జరుగుతాయి. కాబట్టి వాటి కోసం ప్రత్యేకమైన టబ్‌ వాషర్లు దొరుకుతాయి. వాటితో కనీసం నెలకోసారైనా లోపలి భాగాన్ని శుభ్రపరచాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్