International Youth Day: జీవితాల్ని మారుస్తున్నారు!
మన గురించి మనం ఆలోచించుకోవడం స్వార్థం.. అదే నలుగురి గురించి ఆలోచిస్తే అది సేవ.. అలా తమ నిస్వార్థమైన సేవాదృక్పథంతో తమ చుట్టూ ఉన్న ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు కొందరు యువతులు.
(Photos: Instagram)
మన గురించి మనం ఆలోచించుకోవడం స్వార్థం.. అదే నలుగురి గురించి ఆలోచిస్తే అది సేవ.. అలా తమ నిస్వార్థమైన సేవాదృక్పథంతో తమ చుట్టూ ఉన్న ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు కొందరు యువతులు. అవసరార్థుల్ని ఆదుకుంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుతూ, అవగాహనతో మహిళల తలరాతలు మార్చుతూ.. అందరూ ఒక్క తాటిపైకి వస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని నిరూపిస్తున్నారు. ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం’ సందర్భంగా.. తమ సేవాభావంతో సమాజంలో మార్పు తీసుకొస్తోన్న కొందరు యూత్ ఐకాన్స్ గురించి మీకోసం..!
‘కళ’తో నిధులు సమకూర్చుతోంది!
ఒక్కొక్కరిలో ఒక్కో కళా నైపుణ్యం దాగుంటుంది. అయితే దీంతో గుర్తింపు సంపాదించడమే కాదు.. సమాజ సేవ కూడా చేయచ్చని నిరూపిస్తోంది అంజలీ చంద్రశేఖర్. చెన్నైలో పుట్టిన ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తోంది. పెయింటింగ్‌పై మక్కువతో నాలుగేళ్ల వయసు నుంచే చిత్రాలు గీయడం ప్రారంభించిన ఆమె.. పదేళ్ల వయసులో ఓ గ్లోబల్ ఎన్జీవో స్థాపించింది. ఆ వేదికగా తన పెయింటింగ్స్‌ని విక్రయిస్తూ నిధులు సమకూర్చుతోంది. ఈ డబ్బుతో మధుమేహంతో బాధపడే చిన్నారులకు ఇన్సులిన్ అందించడం, పేద వారికి డయాలిసిస్ చేయించడం, రీహ్యాబిలిటేషన్ సెంటర్లకు అందించడం, సెరిబ్రల్ పాల్సీ ఉన్న వారి కోసం ఖర్చు చేయడం, వివిధ రకాల వేధింపులకు గురైన పిల్లల సంక్షేమం కోసం వినియోగించడం.. వంటి మంచి పనులకు వినియోగిస్తోంది అంజలి.
‘నా చిన్నప్పుడు మా బామ్మ బెంగళూరులో ఓ ట్రస్ట్ నడిపేది. దీని ద్వారా వివిధ రకాల అవసరాలున్న వారికి సేవలందించేది. ఆమెను చూస్తూ పెరిగిన నాకూ సమాజ సేవపై మక్కువ ఏర్పడింది. నాలో ఉన్న పెయింటింగ్ కళనే ఇందుకు వినియోగించుకోవాలనుకున్నా. ఈ ఆలోచనతోనే పదేళ్ల వయసులో ‘పిక్చర్ ఇట్’ అనే గ్లోబల్ ఎన్జీవో స్థాపించా. దీని ద్వారా నేను వేసే పెయింటింగ్స్‌ను విక్రయిస్తూ.. నిధులు సమకూర్చి ఆరోగ్య, మానవతా, పర్యావరణ సేవల కోసం వినియోగిస్తున్నా. ఈ క్రమంలో పలు జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నా. అలాగే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న పలు క్యాంపెయిన్స్‌లోనూ భాగమవుతున్నా. నా కళతో ఇప్పటివరకు నేను ఆర్జించిన కొన్ని వేల డాలర్ల సొమ్మును అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోని మధుమేహ చిన్నారులకు ఇన్సులిన్ అందించడానికి ఉపయోగించా. అలాగే చెన్నైలోని ‘కిడ్నీ రీసెర్చ్ ఫౌండేషన్’కు విరాళంగా అందించా..’ అంటోన్న అంజలి సేవా దృక్పథాన్ని UNEP, UNESCO, FAO.. వంటి ప్రముఖ సంస్థలు ప్రశంసించాయి. ‘కళతో మనసుల్ని కదిలించచ్చం’టోన్న ఈ యువ సోషల్ యాక్టివిస్ట్.. ప్రస్తుతం ‘బ్రిటిష్ కౌన్సిల్ గ్లోబల్ ఛేంజ్‌మేకర్’గా కొనసాగుతోంది. ‘ది న్యూయార్కర్’ పత్రికలో ప్రచురితమైన తొలి దక్షిణాసియా కార్టూనిస్ట్‌లలో ఒకరిగా పేరు సంపాదించిన అంజలి.. గతేడాది ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలోనూ స్థానం సంపాదించింది.
సాంకేతికతను పంచుతూ..!
శాస్త్ర సాంకేతిక రంగాల్లో (STEM) మహిళల ప్రాతినిథ్యం క్రమంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను గణనీయంగా పెంచడమే తన లక్ష్యమంటోంది మధ్యప్రదేశ్ టీనేజర్ అనూభా మనేశ్వర్. ఈ ఆలోచనతోనే టెక్నాలజీలో అమ్మాయిల్ని నిష్ణాతుల్ని చేయడానికి 2017లో ‘గర్ల్ స్క్రిప్ట్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిందామె. ఈ వేదికగా 18-40 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలు/మహిళలకు సాంకేతికతను చేరువ చేయడమే తన లక్ష్యమంటోంది.
‘నా 17 ఏళ్ల వయసులో మా నాన్న చనిపోవడంతో మా బంధువులంతా నా పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోమని మా అమ్మకు సలహాలిచ్చేవారు. కానీ అమ్మ అందుకు ఒప్పుకోలేదు. ఎవరేమన్నా నాకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించేందుకే నిర్ణయించుకుంది. తన కోరిక మేరకే ఇంజినీరింగ్ చదివి మంచి సంస్థలో కొలువు సంపాదించా. అయితే ఇదే సమయంలో చాలామంది అమ్మాయిలు సాంకేతిక పరిజ్ఞానం లేక అభద్రతా భావానికి లోనవడం గమనించా. అప్పట్నుంచి వీరిలో ఉన్న ఈ అభద్రతా భావాన్ని దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రస్తుతం మా సంస్థ దేశవ్యాప్తంగా 36కు పైగా నగరాల్లో సేవలందిస్తోంది. వర్క్‌షాప్స్, సెషన్స్, ఈవెంట్స్ నిర్వహిస్తూ టెక్నాలజీలో ఎలాంటి అవగాహన లేని వాళ్ల దగ్గర్నుంచి.. ప్రోగ్రామింగ్, కోడింగ్.. వంటివన్నీ నేర్పిస్తున్నాం. అలా ఇప్పటివరకు వందలాది కాన్ఫరెన్సులు నిర్వహించాం.. వచ్చే ఐదేళ్లలో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని అమ్మాయిలు/మహిళల్ని సాంకేతికతలో నిష్ణాతుల్ని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటోంది అనూభా. తన సేవలకు గుర్తింపుగా ‘బెస్ట్ ఎడ్యుకేషన్ స్టార్టప్’, ‘ఇండియాస్ టాప్ 100 యంగ్ లీడర్స్ అవార్డు’, ‘ఐడబ్ల్యూఎల్ ఎక్సలెన్స్ అవార్డు’.. వంటి పురస్కారాలెన్నో అందుకుందీ యంగ్ లీడర్. ప్రస్తుతం ఓవైపు తన ఎన్జీవో కార్యకలాపాలు నిర్వహిస్తూనే.. మరోవైపు టెక్నాలజీకి సంబంధించిన పలు ఎన్జీవోలలో మెంటర్‌గానూ కొనసాగుతోంది అనూభా.
‘ఎకో’ రక్షకురాలు!
పర్యావరణ పరిరక్షణ.. ఇది ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు.. చేయి చేయి కలిపితేనే ఈ మహా యజ్ఞం సఫలీకృతమవుతుంది. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ముఖ్యం. ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది మీరట్‌కు చెందిన హీనా సైఫీ. 2018 నుంచి ‘100% ఉత్తరప్రదేశ్ క్యాంపెయిన్’, ‘ది క్లైమేట్ అజెండా’.. వంటి ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోన్న ఆమె.. యూఎన్ ఇండియా ‘వుయ్ ది ఛేంజ్ నౌ’ క్యాంపెయిన్‌లోనూ భాగమైంది.
‘మా ప్రాంతంలో అమ్మాయిల్ని చదువులో ప్రోత్సహించడం చాలా అరుదు. అందుకే పది పూర్తి కాగానే పెళ్లి చేసేస్తుంటారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. మా అమ్మానాన్నలతో పాటు నానమ్మ ప్రోత్సాహంతో చదువు కొనసాగించా. అయితే నాకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి ఎక్కువ. ఈ మక్కువతోనే స్థానిక ఎన్జీవోలో వలంటీర్‌గా చేరా. వివిధ క్యాంపెయిన్స్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం మొదలుపెట్టా. ఐక్యరాజ్య సమితి ‘వుయ్ ది ఛేంజ్’ ప్రచార కార్యక్రమంలోనూ భాగమయ్యా. ఈ క్రమంలో సౌర శక్తిపై అందరిలో అవగాహన పెంచుతున్నా. ఈ క్రమంలో చాలామంది గృహాలు, కమ్యూనిటీ సముదాయాలపై సౌరఫలకాలు ఏర్పాటుచేయిస్తున్నా..’ అంటోంది హీనా. ప్రస్తుతం ఎంబీఏ చదువుతోన్న హీనా.. తన సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసా పత్రాన్ని కూడా అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.