Published : 13/11/2022 11:20 IST

గ్రేవీ చిక్కబడాలంటే..!

రెస్టరంట్‌ స్టైల్లో గ్రేవీ కూరలు తయారుచేయాలని తహతహలాడుతుంటాం. కానీ చాలామందికి అవి ఓ పట్టాన కుదరవు. పల్చగా, జారుడుగా వచ్చేసరికి ఇంత కష్టపడి కర్రీ చేసి వృథాయేనా అన్న ఫీలింగ్‌ వచ్చేస్తుంటుంది. అయితే అలాంటప్పుడు కొన్ని పదార్థాల్ని అందులో కలపడం వల్ల గ్రేవీ చిక్కబడడంతో పాటు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యమూ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి, గ్రేవీకి చిక్కదనం అందించే ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం రండి..

టొమాటో ప్యూరీతో..!

టొమాటో ప్యూరీని ఉపయోగించి గ్రేవీ కర్రీస్‌ తయారుచేసుకోవడం మనకు తెలిసిందే! రుచి, చిక్కదనం కోసం రెస్టరంట్లలోనూ దీన్ని వాడుతుంటారు. చాలామంది చెఫ్‌లు కూడా తమ వంటకాల్లో ఈ ప్యూరీని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ప్యూరీతో పల్చగా ఉన్న గ్రేవీని చిక్కగా మార్చచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. పచ్చి టొమాటోలతో ప్యూరీ చేసి కూరల్లో వాడితే పచ్చి వాసన వస్తుంది. అలాకాకుండా.. ఈ పద్ధతిలో కాస్త వేయించి ప్యూరీ చేస్తే రుచి మరింతగా పెరుగుతుంది.

ఇందుకోసం.. ఒక ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బల్ని దోరగా వేయించాలి. ఆపై ఒక బౌల్‌ టొమాటో ముక్కల్ని వేసి.. ఓసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుంటే.. రుచికరమైన టొమాటో ప్యూరీ సిద్ధం. ఇలా తయారుచేసిన ప్యూరీని ఏ కర్రీలోనైనా నేరుగా వాడేయచ్చు. టొమాటోల్లో ఉండే లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. క్యాన్సర్‌ వంటి మహమ్మారుల బారిన పడకుండా రక్షిస్తుంది.

కాయగూరలతో ఇలా..!

బంగాళాదుంప, గుమ్మడి.. వంటి కాయగూరలకు కూడా గ్రేవీకి చిక్కదనం తీసుకొచ్చే గుణం ఉందంటున్నారు నిపుణులు. అయితే వాటిని నేరుగా కాకుండా.. నీటిలో బాగా ఉడికించడం వల్ల అవి గుజ్జుగా మారతాయి. కాబట్టి వాటిని మెత్తగా మ్యాష్‌ చేసి కర్రీలో కలిపేయచ్చు. ఇవే కాదు.. క్యారట్‌, క్యాలీఫ్లవర్‌.. వంటి వాటిని కూడా ఉపయోగించచ్చు. ఫలితంగా కూరలకు రుచి రావడంతో పాటు చిక్కదనం వస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ నిండి ఉన్న ఈ ప్యూరీ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.

ఈ పిండి మంచిది!

కూరలకు చిక్కదనం అందించడానికి చాలామంది అందులో కార్న్‌ఫ్లోర్‌, మైదా పిండి.. వంటివి కలుపుతుంటారు. అయితే వీటికంటే శెనగపిండి కలపడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. దీంతో కూరలకు రుచీ వస్తుందంటున్నారు. ఈ క్రమంలో రెండు టేబుల్‌స్పూన్ల వేయించిన శెనగపిండిని ఒక గిన్నెలో తీసుకొని నీళ్లు పోస్తూ, ఉండలు కట్టకుండా మరీ చిక్కగా కాకుండా, మరీ జారుడుగా కాకుండా కలుపుకోవాలి. ఆపై దీన్ని ఉడుకుతున్న కూరలో వేసి బాగా కలపాలి. శెనగపిండిలో ఉండే అధిక ప్రొటీన్‌ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా అటు బరువు అదుపులో ఉంచుకోవచ్చు.. ఇటు కండరాల సామర్థ్యాన్నీ పెంచుకోవచ్చు.

కోడిగుడ్లు ఎప్పుడైనా ట్రై చేశారా?

కోడిగుడ్లతో గ్రేవీకి చిక్కదనం అందించచ్చన్న విషయం బహుశా చాలామందికి తెలిసుండదు. అయితే ఈ క్రమంలో గుడ్డును నేరుగా కర్రీలో వేయడం కాకుండా.. దాన్ని ముందుగా ఒక బౌల్‌లో తీసుకొని బాగా కలపాలి. రెండు సొనలు పూర్తిగా కలిశాక.. ఉడుకుతున్న గ్రేవీలో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆ తర్వాత కూడా గుడ్డు మిశ్రమం కూరలో బాగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చేస్తే కాసేపటికి గ్రేవీ చిక్కపడడం గమనించచ్చు. దీనివల్ల కూరలకు విభిన్నమైన రుచినీ అందించచ్చు. ఇక గుడ్డులో ఉండే అధిక ప్రొటీన్‌ బరువు అదుపులో ఉంచుకోవడానికి సహకరిస్తుంది. ఇది శరీరంలో మంచి కొవ్వుల్ని పెంచడంతో పాటు విటమిన్‌ ‘డి’ని శరీరానికి అందిస్తుంది.

నట్స్‌-గింజలతో..!

పనీర్‌ గ్రేవీ, కాజూ మసాలా.. వంటి కూరలు తయారుచేసేటప్పుడు జీడిపప్పు పేస్ట్‌ని ఉపయోగించడం మనకు తెలిసిందే! అయితే కూరలు చిక్కబడడానికీ దీన్ని ఉపయోగించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జీడిపప్పుల్ని వేయించుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకొని కర్రీలో కలుపుకోవడమే! దీనికి బదులు బాదంపప్పులు, అవిసె గింజలు, గుమ్మడి గింజల్ని సైతం వేయించుకొని పేస్ట్‌లా చేసి వాడుకోవచ్చు. ఫలితంగా కూరలకు అమోఘమైన రుచి వస్తుంది. అలాగే నట్స్‌-గింజల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

వీటితో పాటు గ్రేవీ చిక్కబడడానికి వెన్న కూడా కలుపుకోవచ్చు. అయితే ఏది కలిపినా.. తక్కువ పరిమాణంలోనే వేసుకోవడం వల్ల కూర రుచి చెడిపోకుండా ఉండడంతో పాటు కావాల్సినంత చిక్కదనం వస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని