ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మానసిక సమస్యలు మాయం! 

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతోమంది వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రత్యేకించి కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మహిళలు, యువతలో ఈ సమస్య అధికంగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated : 05 Nov 2021 19:23 IST

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతోమంది వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రత్యేకించి కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మహిళలు, యువతలో ఈ సమస్య అధికంగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవడానికి కొంతమంది యోగా, ధ్యానం.. వంటి వాటిని ఆశ్రయిస్తుంటే మరికొంతమంది ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే చక్కటి స్నేహితులతో గడపడం కూడా దీనికి ఒక పరిష్కార మార్గమే అంటున్నారు నిపుణులు. అయితే స్నేహితులందరూ స్ట్రెస్‌ బస్టర్స్‌ కారు. వారికి కొన్ని లక్షణాలు ఉండాలి. మరి, ఆ లక్షణాలేంటో చూద్దాం రండి...

వాటిని గౌరవించాలి..

ప్రతి ఒక్కరికీ తమకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అవి ఇతరుల అభిప్రాయాలతో కలవాలన్న రూలేమీ లేదు. కానీ, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటేనే స్నేహం పదిలంగా ఉంటుంది. ఒకవేళ ఏవైనా విషయాల్లో అభిప్రాయ భేదాలున్నా సున్నితంగా చెప్పగలిగే మనస్తత్వం ఉండాలి. ఇలాంటి వారు చెంత ఉన్నప్పుడు ఎలాంటి మానసిక సమస్య ఉన్నా ఇట్టే కుదుటపడతారు.

అభిరుచులను అర్థం చేసుకోవాలి..

కుటుంబ బాధ్యతలు, అవసరాల వల్ల తమ అభిరుచులను పక్కన పెట్టి మరీ నచ్చని ఉద్యోగాలు చేసేవారు చాలామందే ఉంటారు. కొంతమంది ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వీలుచిక్కినప్పుడు తమకు నచ్చిన పనిని చేస్తుంటారు. అయితే మక్కువతో చేసే కొన్ని పనులు కూడా ఇతరులకు సిల్లీగా అనిపిస్తుంటాయి. వారు చేసే పనిని సపోర్ట్‌ చేయకపోగా హేళన చేస్తుంటారు. కానీ, నిజమైన స్నేహితులు ఇతరుల అభిరుచిని అర్థం చేసుకుంటారు. ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులను గమనించి చేతనైన తోడ్పాటు అందిస్తుంటారు. మీకూ ఇలాంటి స్నేహితులు ఉంటే మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి.

ఆ స్వేచ్ఛ  ఉందా?

కొంతమంది తమ సమస్యలను మనసులోనే దాచుకుని ఇబ్బంది పడుతుంటారు. మానసిక సమస్యలకు ఇలాంటి ధోరణే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, తమ సమస్యలను ఎదుటి వారికి చెబితే ఎక్కడ హేళన చేస్తారోనన్న భావన కూడా దానికి కారణం కావచ్చు. కానీ, నిజమైన స్నేహితుల దగ్గర ఎలాంటి విషయాన్నైనా పంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. వారు ఎదుటి వారి సమస్యను అర్థం చేసుకొని దానికి పరిష్కారమార్గం కనుగొనే ప్రయత్నం చేస్తారు. అలాగే వారి సమస్య పూర్తి వ్యక్తిగతమైతే దానిని ఇతరులకు తెలియకుండా గోప్యత పాటిస్తారు. ఇలా ఉండేవారితో ఏ విషయమైనా పంచుకునే స్వేచ్ఛ కలుగుతుంది.

కమ్యూనికేషన్ ఉండాలి...

ఏ బంధమైనా సరే.. దృఢంగా ఉండాలంటే వారి మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉండకూడదు. కొంతమంది స్నేహితులు ఎక్కడైనా కలిసినప్పుడు బాగా మాట్లాడతారు. ఆ తర్వాత ఎవరు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు. కొన్నిసార్లు ఫోన్‌ చేసినా, మెసేజ్‌ చేసినా పట్టించుకోరు. కానీ, నిజమైన స్నేహితులు మాత్రం వీలు చిక్కినప్పుడల్లా తమ ఫ్రెండ్ బాగోగులను తెలుసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా సమయం చూసుకొని ఫోన్‌ చేస్తుంటారు. మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి స్నేహితులతో మాట్లాడితే ఇట్టే కుదుటపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్