శృంగారంతో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందా?

ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి జీవనశైలిని పాటించాలన్న విషయం తెలిసిందే! అయితే ఈ క్రమంలో మనం చేసే కొన్ని పొరపాట్లు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. అందులో రొమ్ము క్యాన్సర్‌ కూడా ఒకటి. ఒకప్పుడు కాస్త వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే.....

Updated : 26 Oct 2022 18:54 IST

ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి జీవనశైలిని పాటించాలన్న విషయం తెలిసిందే! అయితే ఈ క్రమంలో మనం చేసే కొన్ని పొరపాట్లు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. అందులో రొమ్ము క్యాన్సర్‌ కూడా ఒకటి. ఒకప్పుడు కాస్త వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి.. ఇప్పుడు యుక్త వయసు వారినీ వదలట్లేదని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. రోజువారీ జీవనశైలిలో చేసే పొరపాట్లు, పాటించే అనారోగ్యకరమైన అలవాట్లే అని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఈ ముప్పును తగ్గించుకోవాలంటే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు/మహిళలు ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

బరువు అదుపులో..!

అధిక బరువు, స్థూలకాయం.. ఇవి ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంటాయి. అలాగే వీటివల్ల రొమ్ము క్యాన్సర్‌ ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వులే. ఇవి మన శరీరంలో కణతుల పెరుగుదలకు దోహదం చేసి.. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందడానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ ముప్పు తప్పాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం తీసుకునే ఆహారంతో పాటు వ్యాయామాలు చేయడం కూడా తప్పనిసరి. పైగా వ్యాయామం వల్ల ఈ క్యాన్సర్‌ ముప్పు సుమారు 20 నుంచి 40 శాతం తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

పాలిస్తే మంచిదే!

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. ఇవి బిడ్డను సంపూర్ణ ఆరోగ్యంగా ఎదిగేలా చేయడంతో పాటు తల్లికీ పలు ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తాయి. అయితే తల్లిపాలు పట్టడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ ముప్పు కూడా చాలా వరకు తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఏడాది పాటు పాలిస్తే ఈ క్యాన్సర్‌ ముప్పు సుమారు 4.3 శాతం తగ్గినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి బిడ్డకు ఎంత ఎక్కువ కాలం పాటు తల్లిపాలు పడితే ఈ క్యాన్సర్‌ ముప్పు అంత తగ్గుతుందన్నమాట!

30లోపే కనేస్తే..!

కెరీర్‌, ఇతర కారణాల రీత్యా సంతానాన్ని ఆలస్యం చేస్తుంటారు కొంతమంది మహిళలు. ఇదీ జీవితంలో రొమ్ము క్యాన్సర్‌ ముప్పును పెంచుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 30లోపు తొలి సంతానానికి జన్మనివ్వడం, ఒకటి కంటే ఎక్కువ సార్లు గర్భం ధరించడం వల్ల ఈ ముప్పు చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం కూడా ఓ కారణం అని చెప్పచ్చు. కాబట్టి వయసులో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకుంటే.. ఇటు రొమ్ము క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చు.. అటు ఆరోగ్యకరమైన సంతానానికీ జన్మనివ్వచ్చు.

శృంగారంతో ముప్పు తగ్గుతుందా?

భార్యాభర్తల మధ్య అనుబంధాన్నే కాదు.. ఇద్దరి ఆరోగ్యాన్నీ మెరుగుపరిచే శక్తి శృంగారానికి ఉందనడంతో సందేహం లేదు. బీపీ అదుపులో ఉండడం, రోగనిరోధక శక్తి మెరుగుపడడం, మానసిక ఆరోగ్యం.. ఇలా తరచూ కలయికలో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలే చేకూరతాయి. అంతేకాదు.. శృంగారానికి దూరంగా ఉన్న వారితో పోల్చితే.. తరచూ చేసే వారిలో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకాస్త లోతుగా అధ్యయనాలు జరగాల్సి ఉందంటున్నారు పరిశోధకులు.

ఇక గర్భ నిరోధక మాత్రలు వాడే వారిలోనూ రొమ్ము క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటికి బదులు వైద్యుల సలహా మేరకు ఇతర గర్భ నిరోధక సాధనాలను ఎంచుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఇంట్లో స్వీయ రొమ్ము పరీక్ష చేసుకోవడం, నిర్ణీత వ్యవధుల్లో మమోగ్రామ్‌ చేయించుకోవడం.. వంటివి ఈ క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడంలో సహాయపడతాయి. తద్వారా వ్యాధి ముదిరి ప్రాణాల మీదికి తెచ్చుకోకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని