ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
పిల్లలు, పెద్దలు అని లేదు.. ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ వినియోగం కామనైపోయింది. అయితే దీన్ని ఉపయోగించడంతోనే సరిపోదు.. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమూ ముఖ్యమే. ఈ క్రమంలో కొంతమంది తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అది ల్యాపీ పనితీరును దెబ్బతీస్తుందని...
పిల్లలు, పెద్దలు అని లేదు.. ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ వినియోగం కామనైపోయింది. అయితే దీన్ని ఉపయోగించడంతోనే సరిపోదు.. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమూ ముఖ్యమే. ఈ క్రమంలో కొంతమంది తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అది ల్యాపీ పనితీరును దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏంటా పొరపాట్లు? తెలుసుకొని సరిదిద్దుకుందాం రండి..
ఆ టవల్స్ వద్దు!
ల్యాపీ మొత్తాన్ని క్లీన్ చేసినా, చేయకపోయినా.. స్క్రీన్ మాత్రం రోజూ తుడవడం మనకు అలవాటు. అయితే ఈ క్రమంలో కొంతమంది కిచెన్ టవల్స్, పేపర్ న్యాప్‌కిన్లు.. వంటివి ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి కాస్త గరుకుగా ఉండడం వల్ల స్క్రీన్‌పై సన్నని గీతలు పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా జరగకూడదంటే.. ల్యాపీ స్క్రీన్‌ను మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్రం చేయడం ఉత్తమం.
బ్రష్ వాడుతున్నారా?
ల్యాప్‌టాప్ కీబోర్డు సందుల్లో దుమ్ము ఎక్కువగా చేరడం మనం గమనించచ్చు. దీన్ని తొలగించడానికి చాలామంది హెయిర్‌బ్రష్, టూత్‌బ్రష్.. వంటి గరుకైన బ్రిజిల్స్‌తో కూడిన బ్రష్ వాడుతుంటారు. అయితే దీంతో శుభ్రం చేయడం వల్ల కీబోర్డ్ కీస్ అటూ ఇటూ కదులుతూ డ్యామేజ్ అయ్యే ఆస్కారమే ఎక్కువట! పైగా వదులుగా కూడా తయారవుతాయి. కాబట్టి ఇలాంటి బ్రష్‌కి బదులుగా మృదువుగా ఉండే మేకప్ బ్రష్ లేదంటే సన్నటి పాయింట్ ఉన్న పెయింట్ బ్రష్ వంటివి వాడితే కీబోర్డ్ డ్యామేజ్ కాకుండా దుమ్మును వదిలించచ్చు.
కంప్రెస్‌డ్ ఎయిర్‌తో నష్టమే!
మూలల్లో, అతి తక్కువ గ్యాప్ ఉన్న భాగాల్లో దుమ్మును వదిలించడం అంత సులభం కాదు. అందుకే దీనికోసం కంప్రెస్‌డ్ ఎయిర్ టూల్స్‌ని వాడుతుంటారు. అయితే దీన్నుంచి బలంగా, వేగంగా వచ్చే గాలి కారణంగా ల్యాప్‌టాప్‌లో ఉండే అతి సున్నితమైన భాగాలు, ల్యాప్‌టాప్ ఫ్యాన్ బ్లేడ్స్ దెబ్బతింటాయంటున్నారు నిపుణులు. పైగా కీబోర్డు పైనా ఈ టూల్‌ని వాడడం వల్ల కీస్ వదులుగా మారే అవకాశం ఉంది. అందుకే ల్యాపీ క్లీనింగ్ కోసం దీన్ని వాడకపోవడమే మంచిది.
వాటితో శుభ్రం చేయద్దు!
కిటికీ అద్దాలు, టీవీ స్క్రీన్.. వంటివి శుభ్రం చేసే లిక్విడ్స్‌నే ల్యాప్‌టాప్ క్లీనింగ్ కోసం వాడుతుంటారు చాలామంది. అయితే వీటిలోని రసాయనాల వల్ల ల్యాపీ స్క్రీన్ కోటింగ్ దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి వీటికి బదులుగా బయట మార్కెట్లో ల్యాప్‌టాప్ కోసం ప్రత్యేకమైన క్లీనింగ్ లిక్విడ్స్ దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. అది కూడా నేరుగా స్ప్రే చేయకుండా.. మైక్రోఫైబర్ క్లాత్‌పై స్ప్రే చేసి.. దాంతో ల్యాపీని క్లీన్ చేయడం ఉత్తమం.
అలాగే ల్యాప్‌టాప్ క్లీన్ చేస్తున్న ప్రతిసారీ విద్యుత్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి. అది కూడా వాడిన వెంటనే కాకుండా.. ఉపయోగించే ముందు, అంటే వేడెక్కక ముందు క్లీన్ చేయడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.