Updated : 19/12/2022 19:55 IST

వదిన మరదళ్ల మధ్య గొడవలా?

వదిన మరదళ్లంటే.. కొంతమంది అక్కచెల్లెళ్లలా కలిసిపోతారు.. కలిసి షాపింగ్‌కి వెళ్లినా, సినిమాకెళ్లినా స్నేహితుల్లా సందడి చేస్తారు. ఇలా ఒకరికొకరిగా మెలిగిన వీళ్లిద్దరి మధ్య కూడా అప్పుడప్పుడూ అభిప్రాయభేదాలు, చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అయితే అవి కూడా టీకప్పులో తుపానులా ఎక్కువ సేపు నిలవవు. కానీ అదే పనిగా మీ వదిన/మరదలు మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడడం, ప్రతి విషయంలో మిమ్మల్ని దూరం పెట్టడం.. వంటివి చేస్తుంటే మాత్రం ఇద్దరి మధ్య అనుబంధం ప్రమాదకరంగా మారుతోందనడానికి సంకేతాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. మరి, ఇంతకీ ఏంటా నెగెటివ్‌ సంకేతాలు? ఈ సమయంలో తిరిగి కలిసిపోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

అభిప్రాయాలకు విలువివ్వట్లేదా?

అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి తన ఆడపడుచును తోబుట్టువులా భావిస్తుంటుంది.. ఇక తన అన్న/తమ్ముడికి భార్యగా వచ్చిన వదిన/మరదలిని ఆడపడుచు కూడా ఆప్యాయంగా చూసుకుంటుంది. ఇలా ఇద్దరూ మంచి స్నేహితుల్లా కలిసిపోతారు.. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువిస్తూ.. సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తారు. అలాగని ప్రతి విషయంలోనూ ఒకరితో ఒకరు ఏకీభవించలేకపోవచ్చు.. తమ మనసులోని అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా పంచుకోవచ్చు. ఇలా అప్పుడప్పుడూ అయితే పర్లేదు.. కానీ మీ అభిప్రాయం సరైనప్పటికీ.. మీ వదిన/మరదలు దానికి విలువివ్వకపోవడం, దాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం, కుటుంబ వ్యవహారాల్లో మీ జోక్యం అనవసరం అన్నట్లుగా మాట్లాడడం.. వంటివి చేస్తుంటే మాత్రం ఇద్దరి మధ్య అనుబంధం సన్నగిల్లుతున్నట్లుగా భావించచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి అవతలి వారి నుంచి ఇలాంటి ప్రవర్తన గుర్తించిన వెంటనే.. నిర్లక్ష్యం చేయకుండా దీని వెనకున్న అసలు కారణమేంటో కనుక్కునే ప్రయత్నం చేయండి.. ఈ క్రమంలో వారి తప్పున్నా క్షమించేయడం, మీ పొరపాటుంటే సరిదిద్దుకోవడం.. ఈ రెండూ కీలకమే!

మాటలతో బాధపెడుతుంటే..!

ఎవరూ వంద శాతం పర్‌ఫెక్ట్‌ కాదు.. తెలిసో, తెలియకో అప్పుడప్పుడూ కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి. అప్పటికప్పుడు వీటి గురించి ప్రస్తావించినా, అవతలి వారు ఆటపట్టించినా.. ఆ తర్వాత మర్చిపోయి సాధారణ జీవితం గడుపుతుంటారు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ సానుకూల అంశాలు కూడా ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరికీ అనుభవమే! అయితే కావాలని మిమ్మల్ని దూరం పెట్టాలనుకున్న మీ వదిన/మరదలు మీలోని సానుకూల అంశాల కంటే ప్రతికూల అంశాల గురించే పదే పదే ప్రస్తావన తీసుకొచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు గతంలో చేసిన పొరపాట్ల గురించి ప్రస్తావిస్తూ.. మీ మనసు నొప్పించేలా ప్రవర్తించడం, పరోక్షంగా మాటలతో బాధపెట్టడం.. వంటివి చేయచ్చు. ఇలాంటప్పుడు వారి ప్రవర్తన కోపం తెప్పించచ్చు. కానీ మీరూ వాళ్లలోని ప్రతికూల అంశాల్ని బయటికి తీయడం, ఇద్దరూ తగువులాడుకోవడం.. వంటివి చేస్తే ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరుగుతుంది. కాబట్టి వాళ్లు కాస్త శాంతించాక.. వారి ప్రవర్తన మూలంగా మీరు పడిన మానసిక వేదన గురించి వాళ్లకు చెప్పండి. తను మనసులో ఏ ఉద్దేశం పెట్టుకొని మీతో ఇలా ప్రవర్తిస్తోందో అడగండి. ఇలా సమస్యను పరిష్కరించుకునే దిశగానే ఇద్దరి మధ్య చర్చ జరగాలి. అవసరమైతే ఈ క్రమంలో మీవారు, ఇతర కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవచ్చు.

ముందొకటి.. వెనకొకటి..!

‘తేనె పూసిన కత్తి’ అంటుంటారు. మిమ్మల్ని దూరం పెట్టాలని చూసే మీ వదిన/మరదలు కూడా మీతో ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మీ సమక్షంలో మీతో తియ్యగా మాట్లాడినా.. మీరు లేనప్పుడు మాత్రం.. ఇతర కుటుంబ సభ్యులకు మీపై చాడీలు చెప్పడం, మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడడం, ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పడం.. ఇలా మొత్తానికి మీ ఫ్యామిలీలో మీపై చెడు అభిప్రాయం కలిగేందుకు తను ఏం చేయడానికైనా వెనకాడదన్నమాట! అయితే ఇలాంటప్పుడు మీరు తొందరపడకుండా సమయస్ఫూర్తితో మెలగాలంటున్నారు నిపుణులు. వారు మీపై ఎంత చెడుగా ప్రచారం చేసినా.. మీరు కుటుంబ సభ్యులందరితో ఎప్పటిలాగానే కలిసిపోవడం, మాట్లాడడం.. చేయాలి. ఒకవేళ తను మరీ మితిమీరి ప్రవర్తిస్తే.. మీపై కల్పించి చెప్పిన మాటల్ని రుజువు చేయమని నెమ్మదిగా అడగండి. అప్పుడు అందరికీ తన నిజ స్వభావం గురించి అర్థమవుతుంది.. అలాగే మీ మంచితనం గురించి కూడా ఇంట్లో వాళ్లందరికీ తెలుస్తుంది. ఇలాంటి సమయాల్లో పశ్చాత్తాప భావనతో తనే మారిపోయి మీతో తిరిగి కలిసిపోవచ్చు కూడా!

పరాయిగా భావిస్తుంటే..!

‘నా కొడుకును కొంగున కట్టేసుకుంది’, ‘మా అన్న/తమ్ముడిని నాక్కాకుండా చేస్తోంది..’ పెళ్లి తర్వాత అత్తారింటికొచ్చిన కోడళ్లు.. అత్తమామలు, ఆడపడుచుల నుంచి ఇలాంటి నిందలు ఎదుర్కోవడం సహజమే! అయితే ఈ క్రమంలో తమ కొడుకు/తోబుట్టువు ఎక్కడ పరాయి వాడిగా మారిపోతాడోనన్న భయంతో కూడిన ప్రేమే వాళ్లతో ఇలా మాట్లాడిస్తుంది. తమ వదిన/మరదలిని ఆడపడుచులు దూరం పెట్టడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి మాటలకు బాధపడిపోకుండా.. మీవారు గతంలోలాగే మీ అత్తింటి వారితో ప్రేమగా మెలిగేలా చేయాల్సిన బాధ్యత మీదే అంటున్నారు. ఈ క్రమంలో సందర్భానుసారం వారికి కానుకలివ్వడం, వారిచ్చే కానుకలు పుచ్చుకోవడం, ఎప్పుడూ మీవారితోనే కాకుండా అప్పుడప్పుడూ మీ ఆడపడుచుతోనూ సరదాగా షాపింగ్‌కి, సినిమాలకు వెళ్లడం.. ఇవన్నీ వదిన మరదళ్ల మధ్య అనుబంధాన్ని పెంచేవే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని