Updated : 03/10/2022 20:47 IST

ఆందోళనలు వేధిస్తున్నాయా?

ఒత్తిడి, భయం, ఆందోళన.. ఎప్పుడో అప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ కామన్. కానీ కొంతమంది ప్రతిదానికీ భయపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు.. రోజూ ఒత్తిళ్ల మధ్యే గడుపుతుంటారు. ఇలాంటి పరిస్థితే గనుక కొన్నాళ్ల పాటు కొనసాగినట్లయితే.. అది క్రమంగా యాంగ్జైటీ డిజార్డర్‌కు దారితీసే ప్రమాదముందంటున్నారు మానసిక నిపుణులు. మరి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి?

వారికి దూరంగా.. వీరికి దగ్గరగా..!

మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనల్ని చూసి అసూయ పడే వారు, మనల్ని నిరుత్సాహపరిచే వారూ ఉండచ్చు. ఇక మనం ఆందోళనలతో సతమతమయ్యే సమయంలోనూ అలాంటి ప్రతికూల వాతావరణంలోనే ఉండడం వల్ల మన సమస్య మరింత రెట్టింపవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ సమస్యను మీలోనే దాచుకోకుండా మీ మేలు కోరే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పంచుకోవాలి. అప్పుడే మీ గుండె భారం తగ్గడంతో పాటు మీ సమస్యకో పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో పనిచేస్తున్నా మీ చుట్టూ మీ మనసుకు ఆహ్లాదాన్ని పంచే బొమ్మలు, మొక్కలు, రంగులు, ఇతర వస్తువులు.. వంటివి అందంగా అలంకరించుకోవడం వల్ల నెగెటివిటీని దూరం చేసుకొని పాజిటివిటీని పెంచుకోవచ్చు.

ప్రార్థనతో..

రోజూ ఉదయం కాసేపు దైవ ప్రార్థన చేయడం, దేవుడికి సంబంధించిన పాటలు పాడడం లేదా వినడం.. వంటివి చేయడం వల్ల వ్యతిరేక ఆలోచనలు తగ్గే అవకాశం ఉంటుంది.  ఇలాంటి ప్రార్థనల వల్ల పాజిటివ్‌ ఎనర్జీ ఉత్పత్తవుతుంది.. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే మనపై మనకు నమ్మకం పెరగడానికి, మనం రోజంతా సంతోషంగా, ఉత్సాహంగా గడపడానికి కూడా ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది.. అంటున్నారు నిపుణులు.

యోగానందం..!

మనసులోని ఆందోళనలు, ప్రతికూల ఆలోచనల్ని దూరం చేసి ఆనందాన్ని, మానసిక ఆరోగ్యాన్ని అందించే శక్తి యోగా సొంతం. అందుకు కొన్ని యోగాసనాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా మత్స్యాసనం, సేతు బంధాసనం, మార్జాలాసనం, శీర్షాసనం.. వంటి యోగాసనాలు మంచి ఫలితాలు అందిస్తాయి. ఇలా ఏ యోగాసనం చేసినా.. ఆ సెషన్‌ పూర్తయ్యాక కొన్ని నిమిషాల పాటు యోగ నిద్రలోకి వెళ్లడం వల్ల శరీరం, మనసు రిలాక్సవుతుంది. అంతేకాదు.. ఈ యోగాసనాల వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోయి అటు ఆరోగ్యం, ఇటు మానసిక ప్రశాంతత లభిస్తాయి. అయితే తొలిసారి యోగాసనాలు సాధన చేస్తున్న వారు మాత్రం మరీ కఠినమైనవి కాకుండా కాస్త సులభమైన ఆసనాలు ఎంచుకోవడం మంచిది. అదీ నిపుణుల సమక్షంలో అయితే ఇంకా మంచిది.

వాళ్ల గురించి కూడా..

‘నేను, నా వాళ్లు, నా వస్తువులు’.. అంటూ మనలో చాలామంది ఎప్పుడు చూసినా వీటి చుట్టూనే తిరుగుతుంటారు. అయితే మనలోని ఆందోళనల్ని దూరం చేసుకోవాలంటే ఇలాంటి స్వార్థపూరిత జీవితం నుంచి కాస్త బయటకొచ్చి ఇతరుల గురించి కూడా ఆలోచించమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మన గురించే, మనకు సంబంధించిన విషయాల గురించే ఆలోచించడం వల్ల మన ఆందోళనలకు మూలమైన విషయాలే మనకు పదే పదే గుర్తొచ్చి మానసికంగా మరింత కుంగదీస్తాయి. అదే.. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం, మనకు తోచినట్లుగా సహాయపడడం వల్ల మనం పొందే ఆనందం, సంతృప్తి అనుభవిస్తేనే అర్థమవుతుంది. తద్వారా ఒత్తిడి కలిగించే విషయాల గురించి ఆలోచించకుండా సంతోషంగా గడపచ్చు.. అంతేకాదు.. ఇలాంటి పనులు మనసును ఉత్సాహపరచడంతో పాటు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని