‘పీసీఓఎస్’ పరిష్కారానికో స్టార్టప్!

ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేసి బాధపడే కంటే ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ఈ విషయం తెలిసినా చాలామంది మహిళలు పీసీఓఎస్‌ను గుర్తించడంలో ఆలస్యం చేసి కోరి అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటున్నారంటున్నారు ముంబయికి చెందిన అక్కచెల్లెళ్లు శాశ్వత, శోభిత.

Published : 11 Sep 2021 13:37 IST

(Photo: Instagram)

ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేసి బాధపడే కంటే ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ఈ విషయం తెలిసినా చాలామంది మహిళలు పీసీఓఎస్‌ను గుర్తించడంలో ఆలస్యం చేసి కోరి అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటున్నారంటున్నారు ముంబయికి చెందిన అక్కచెల్లెళ్లు శాశ్వత, శోభిత. పీసీఓఎస్‌ బారిన పడి సరైన గైడెన్స్‌ లేక ఇబ్బంది పడిన వీరు.. ఇతర మహిళలకు ఈ సమస్య ఎదురుకాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఓ డిజిటల్‌ హెల్త్‌ స్టార్టప్‌ను ప్రారంభించి.. ఈ వేదికగా పీసీఓఎస్‌తో బాధపడుతోన్న ఎంతోమంది మహిళల శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. సిగ్గు, బిడియం, అపోహలు వీడి సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స తీసుకోవచ్చని అందరిలో స్ఫూర్తి నింపుతోన్న ఈ అక్కచెల్లెళ్ల పీసీఓఎస్‌ స్టార్టప్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి..

పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌).. ప్రస్తుతం మన దేశంలో పది మంది మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలతో బయటపడుతుండడం వల్ల దీన్ని ఆదిలోనే గుర్తించడం కూడా సవాలుగానే మారిందని నిపుణులు చెబుతున్నారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది శోభిత నరైన్.

స్వీయానుభవంతోనే ఈ ఆలోచన!

‘నేను గత కొన్నేళ్ల క్రితం పీసీఓఎస్‌ సమస్యతో బాధపడ్డా. దాన్ని నిర్ధారించుకోవడానికే నాకు చాలా రోజులు పట్టింది. ఈ క్రమంలో సరైన సమాచారం అందక, అవగాహన లేక ఇబ్బంది పడ్డా. దీనికి తోడు నిపుణుల సలహాలు పొంది, చికిత్స తీసుకోవడం మరో ఎత్తు! ఎందుకంటే నేను ఎంత మంది డాక్టర్లను సంప్రదించినా.. పీసీఓఎస్‌ వల్ల నా శరీరంలో వచ్చిన మార్పులు, లక్షణాలను ఎలా ఎదుర్కోవాలో అర్థమయ్యేది కాదు. అంతా శూన్యంగా అనిపించేది. ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించుకునేందుకు ఎక్కడ నుంచి ఎలా మొదలుపెట్టాలో పాలుపోయేది కాదు. అందుకే ఇదే విషయమై తరచూ నేను నా సోదరి శాశ్వతతో మాట్లాడేదాన్ని. ఈ క్రమంలోనే నాలా మరెంతోమంది మహిళలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న విషయం గ్రహించాం. అందుకే స్టార్టప్‌ ఆలోచన చేశాం..’ అంటూ చెప్పుకొచ్చిందామె.

‘వీరా హెల్త్‌’ .. నాలుగు లక్ష్యాలు!

పీసీఓఎస్‌ బారిన పడి తనలా మరెవరి పరిస్థితి అగమ్య గోచరంగా మారకూడదని నిర్ణయించుకున్న శోభిత.. తన సోదరి శాశ్వతతో కలిసి.. గతేడాది ‘వీరా హెల్త్‌’ పేరుతో ఓ డిజిటల్‌ హెల్త్‌ స్టార్టప్‌ను ప్రారంభించింది. పీసీఓఎస్‌ను వీలైనంత త్వరగా గుర్తించేందుకు మహిళలకు సహాయపడే ప్లాట్‌ఫామ్‌ ఇది. దీని ముఖ్యోద్దేశం కూడా ఇదే! ఎందుకంటే ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స తీసుకొని, ఇతర అనారోగ్యాల బారిన పడే ముప్పును తప్పించుకోవచ్చంటున్నారీ సిస్టర్స్.

‘ముఖ్యంగా నాలుగు లక్ష్యాలతో వీరా హెల్త్‌ను ప్రారంభించాం.

1. చాలామంది మహిళలు పీసీఓఎస్‌ వంటి సమస్యల్ని బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. వారిలో ఉన్న ఇలాంటి అపోహల్ని, భయాల్ని తొలగించి వారు తమ సమస్యను త్వరగా గుర్తించడానికి మా స్టార్టప్‌ ఉపయోగపడుతుంది.

2. ఆదిలోనే గుర్తించి సమస్య పెద్దది కాకుండా చికిత్స అందించడం.

3. ఈ క్రమంలో మహిళలకు ఎదురయ్యే ఇతర ఆరోగ్య సమస్యల గురించి వారిలో అవగాహన పెంచడం.

4. నిపుణుల సమక్షంలో నాణ్యమైన చికిత్స అందించడంతో పాటు.. పీసీఓఎస్‌ వల్ల వారిలో తలెత్తే మానసిక సమస్యల్ని దూరం చేసేందుకు మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌/చికిత్స ఇప్పించడం..’ అంటూ తమ స్టార్టప్ ముఖ్యోద్దేశం గురించి చెబుతున్నారీ అక్కచెల్లెళ్లు.

అదుపులోకొచ్చేదాకా వదిలిపెట్టం!

సిగ్గు, బిడియం, మొహమాటం.. ఇలా కారణమేదైనా ప్రస్తుతం చాలామంది మహిళలు పీసీఓఎస్‌ లక్షణాలను బయటికి చెప్పలేకపోతున్నారు. చికిత్స తీసుకునే సమయంలోనూ రెగ్యులర్‌ చెకప్స్‌కి వెళ్లలేకపోతున్నారు. తద్వారా సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే తాము మాత్రం తమ వద్ద చికిత్స పొందే పేషెంట్స్‌కి సమస్య అదుపులోకొచ్చేదాకా చికిత్స కొనసాగిస్తూనే ఉంటామంటున్నారీ సోదరీమణులు.

‘మా వెబ్‌సైట్‌లో సబ్‌స్క్రైబ్‌ అయిన పేషెంట్స్‌కు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స కొనసాగుతుంది. పీసీఓఎస్‌ వల్ల అందరిలో ఒకే రకమైన లక్షణాలు కనిపించాలని లేదు.. ఈ క్రమంలో కొంతమంది బరువు పెరగచ్చు.. మరికొంతమందికి ఆహారంలో మార్పులు అవసరం కావచ్చు.. ఇంకొంతమందిలో సౌందర్య సమస్యలు రావచ్చు. ఇలా వారి సమస్యను బట్టి నిపుణులు తగిన చికిత్స, సలహాలు అందిస్తుంటారు. అవసరమైతే వారి కోసం ప్రత్యేకమైన డైట్‌ ఛార్ట్‌, ఫిట్‌నెస్‌ రొటీన్‌ని సైతం ప్రిపేర్‌ చేస్తుంటారు. పేషెంట్స్‌ స్పందించినా, స్పందించకపోయినా మెరుగవుతోన్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వారికి సందేశం వెళ్తుంది. ఇలా పూర్తిగా వాళ్ల సమస్య అదుపులోకొచ్చేదాకా/తగ్గేదాకా వారికి చికిత్స కొనసాగుతూనే ఉంటుంది..’ అంటూ చెప్పుకొచ్చారీ సిస్టర్స్.

‘పీసీఓఎస్‌ ఒక్కసారి మొదలైందంటే.. అది మన శరీరంలో ఎన్నో సమస్యలకు మూలమవుతుంది.. కాబట్టి దీనిపై ఉన్న అపోహలు, భయాలు వీడినప్పుడే సమస్యను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవడం వీలవుతుందం’టూ తమ మాటగా మహిళలందరిలో అవగాహన పెంచుతున్నారు శోభిత, శాశ్వత. హెల్త్‌కేర్‌ విభాగంలోనే తమ చదువును కొనసాగించిన ఈ అక్కచెల్లెళ్లు.. స్టార్టప్‌ ప్రారంభించడానికి ముందు ఈ నేపథ్యంలోనే పలు కంపెనీల్లో పనిచేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్