ఈ అమ్మాయిల విజయం ఆ ఆలోచనలను మారుస్తుంది!

13 ఏళ్లు అంటే స్కూలుకెళ్లి చదువుకునే వయసు. అలాంటిది అంత పిన్న వయసులో ‘ఒలింపిక్‌ ఛాంపియన్‌’ గా నిలిచి చరిత్ర సృష్టించింది జపాన్‌కు చెందిన మోమిజి నిషియా. అది కూడా పురుషులకే సొంతమని భావించే స్కేట్‌ బోర్డింగ్‌లో! జిమ్నాస్టిక్స్‌ తరహాలో అద్భుతమైన విన్యాసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ఈ ఆటలో నిషియానే కాదు...

Updated : 30 Jul 2021 15:04 IST

13 ఏళ్లు అంటే స్కూలుకెళ్లి చదువుకునే వయసు. అలాంటిది అంత పిన్న వయసులో ‘ఒలింపిక్‌ ఛాంపియన్‌’ గా నిలిచి చరిత్ర సృష్టించింది జపాన్‌కు చెందిన మోమిజి నిషియా. అది కూడా పురుషులకే సొంతమని భావించే స్కేట్‌ బోర్డింగ్‌లో! జిమ్నాస్టిక్స్‌ తరహాలో అద్భుతమైన విన్యాసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ఈ ఆటలో నిషియానే కాదు... రజత, కాంస్య పతకాలు సాధించిన అమ్మాయిల సగటు వయసు కూడా 13-14 ఏళ్ల మధ్యే ఉండడం విశేషం!

ఆ ఆలోచనల్లో మార్పొస్తుంది!

సర్ఫింగ్‌, స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌, కరాటేలతో పాటు టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా స్కేట్‌ బోర్డింగ్‌ను ప్రవేశపెట్టారు. జిమ్నాస్టిక్స్‌ తరహాలోనే భిన్నమైన విన్యాసాలు, వేగం, టైమింగ్‌, నిలకడను బట్టి ఆ ఆటలో పాయింట్లు నిర్ణయిస్తారు. అయితే అమెరికా లాంటి కొన్ని దేశాల్లో దీనిని ‘క్రీడ’గా పరిగణించరు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం వరకు దీనిని కేవలం వ్యాపార దృక్పథంతోనే ఆడేవారు. అందువల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఈ ఆటలో శిక్షణ ఇప్పించేందుకు ఆసక్తి చూపేవారు కాదు. పైగా ప్రమాదకర విన్యాసాలుంటాయి కాబట్టి అమ్మాయిలను ఈ ఆటకు దూరంగా ఉంచేవారు. అయితే తాజా ఒలింపిక్స్‌ స్కేట్‌ బోర్డింగ్‌లో ముగ్గురు చిన్న వయసు అమ్మాయిలు చేసిన అద్భుత ప్రదర్శన ఈ ఆలోచనల్లో కచ్చితంగా మార్పు తెస్తుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. మరి అంతలా స్ఫూర్తినిచ్చిన ఆ ముగ్గురు క్రీడాకారిణుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.


13 ఏళ్లకే పసిడిని ముద్దాడింది!

ఒలింపిక్స్‌ పతకం గెలవాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. అయితే 13 ఏళ్ల వయసులోనే ఆ స్వప్నా్న్ని సాకారం చేసుకుంది జపాన్‌కు చెందిన మోమిజి నిషియా. అది కూడా సొంతగడ్డపై. ఈ సారి ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మహిళల స్కేట్‌ బోర్డింగ్‌ (స్ట్రీట్‌ విభాగం)లో స్వర్ణం సాధించిన ఆమె వయసు 13 ఏళ్ల 330 రోజులు. ఈ నేపథ్యంలో జపాన్‌ తరఫున ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిందీ టీనేజ్‌ సెన్సేషన్‌. అలాగే ఒలింపిక్స్‌ చరిత్రలో పసిడి పతకాన్ని ముద్దాడిన రెండో అతి పిన్న అథ్లెట్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కింది.

ఒత్తిడికి గురయ్యాను.. కానీ!

2007లో జపాన్‌లోని ఒసాకాలో పుట్టిన నిషియా.. 2019లో సమ్మర్‌ ఎక్స్‌ గేమ్స్‌తో మొదటిసారి వెలుగులోకి వచ్చింది. కొలరాడో వేదికగా జరిగిన ఆ పోటీల్లో ఆమె మహిళల స్ట్రీట్‌ ఈవెంట్‌లో రజత పతకం గెల్చుకుంది. ఇక ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందు రోమ్‌ వేదికగా జరిగిన స్కేట్‌ బోర్డింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో వెండి పతకం సాధించింది. అదే ఉత్సాహంతో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి ఏకంగా పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఆమె ‘నా కళ్లు ఆనందభాష్పాలతో తడిసి ముద్దయ్యాయి. ఎందుకంటే ఇది సంతోషానికి మించిన అనుభూతి. ఫైనల్స్‌లో మొదట కొన్ని పొరపాట్లు చేసి వెనకబడ్డాను. దీంతో ఒత్తిడికి గురయ్యాను. అయితే అంతిమంగా మాత్రం నాదే పైచేయి అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక టోక్యో పోటీలకు ముందు ప్రపంచ స్కేట్‌ బోర్డింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న నిషియా తాజా స్వర్ణంతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.


ఈ ఆట అందరిదీ!

ఇదే పోటీల్లో బ్రెజిల్‌కు చెందిన లియల్‌ రేసా రజత పతకం గెల్చుకుంది. ఆమె వయసు 13 ఏళ్ల 203 రోజులు. దీంతో బ్రెజిల్‌ తరఫునే కాదు.. ఒలింపిక్స్‌ చరిత్రలో అతి పిన్న వయసులో పతకం గెల్చుకున్న అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిందీ టీనేజ్‌ గర్ల్‌. ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెల్చుకోకపోయినా అందరి మనసులు గెల్చుకుంది రేసా. ఈ సందర్భంగా స్వర్ణం గెల్చుకున్న నిషియాను హత్తుకుని అభినందనలు తెలిపింది.  ఇక పోటీల తర్వాత స్కేట్‌ బోర్డింగ్‌లో ఉన్న వివక్షపై స్పందిస్తూ ‘ఇది అబ్బాయిల ఆట అని అనడం ఏ మాత్రం సరికాదు. ఆటకు లింగభేదం లేదు. ఇది అందరిదీ! ఇందులో వివక్షకు తావు లేదు’ అని చెప్పుకొచ్చింది.


ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయి!

జపాన్‌కే చెందిన ఫ్యూనా నకయమా ఈ పోటీల్లో కాంస్య పతకం గెల్చుకుంది. ఆమె  వయసు 16 ఏళ్లే.  వీరే కాదు ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఎనిమిది మందిలో ఐదుగురు టీనేజర్లే కావడం విశేషం. వీరి సంగతి పక్కన పెడితే అమెరికాకు చెందిన 34 ఏళ్ల అలెక్సిస్‌ సబ్లోన్‌ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. ఈ సందర్భంగా ఆమె కూడా స్కేట్‌ బోర్డింగ్‌లో మహిళలకు ఎదురవుతోన్న వివక్షపై గళం విప్పింది. ‘ఈ ఆటలో పురుషుల తరహాలో మహిళలకు తగిన ప్రోత్సాహం లభించడం లేదు. ప్రతిభ ఉన్నప్పటికీ స్పాన్సర్లు ముందుకు రావట్లేదు. దీంతో చాలామంది అమ్మాయిలు ఈ ఆటను ఎంచుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే తాజా ఒలింపిక్స్‌ పోటీలు ఈ దృక్పథాన్ని మారుస్తాయి.. మరికొంత మంది అమ్మాయిలు ఈ ఆటను ఎంచుకోవడానికి ప్రేరణగా నిలుస్తాయని అనుకుంటున్నాను’ అని సబ్లోన్‌ చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్