Home Office: చలికాలంలో ఈ మార్పులు చేసుకోవాల్సిందే
close
Updated : 10/11/2021 19:44 IST

Home Office: చలికాలంలో ఈ మార్పులు చేసుకోవాల్సిందే!

సహజంగానే ఈ చలికాలంలో ఏ పనీ చేయాలనిపించదు.. ఆఫీస్‌లో కూర్చొని పనిచేయడం కూడా బద్ధకంగానే అనిపిస్తుంది. ఇక అలాంటిది ఇంటి వద్ద నుంచి పనంటే హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. మరి, ఇలాంటి బద్ధకాన్ని వీడి చురుగ్గా పనిచేయాలంటే.. పని చేసే ప్రదేశంలో పలు మార్పులు చేర్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే చక్కటి ఉత్పాదకతనూ అందించచ్చంటున్నారు. మరి, వింటర్‌ బ్లూస్‌ను అధిగమించే ఆ మార్పులేంటో తెలుసుకుందాం రండి..

ఎండ పడేలా!

చలికాలంలో శరీరం వెచ్చదనాన్ని కోరుకోవడం సహజం. ఈ క్రమంలోనే కాసేపు ఎండలో గడుపుతాం. అలాగని గంటల తరబడి ఎండలో కూర్చోవడం సాధ్యం కాదు.. అయినా వెచ్చదనం అందాలంటే మీరు పనిచేసుకునే టేబుల్‌/కుర్చీని ఎండ పడే కిటికీ వద్దకు మార్చుకోవచ్చు. ఇక మీపై ఎండ నేరుగా పడకుండా ఉండేందుకు కిటికీ తలుపులు మూయడం, పల్చటి కర్టెన్‌ వేయడం.. వంటివి చేస్తే.. గదిలో వెచ్చదనం నిండి చలిగా ఉందన్న ఫీలింగే రాదు.. ఫలితంగా ఎలాంటి బద్ధకం లేకుండా హాయిగా పని చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి కిటికీ సదుపాయం లేని వాళ్లు రూమ్‌ వార్మర్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.

ఫ్యాబ్రిక్‌తో మ్యాజిక్!

చలికాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని పంచేలా పలు మార్పులు చేర్పులు ఎలాగైతే చేసుకుంటామో.. అలాగే పని ప్రదేశాన్ని వెచ్చగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు కూర్చునే కుర్చీపై వెల్వెట్‌/ఉన్ని ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన కుషన్‌ని ఉపయోగించడం, కాళ్ల కింద మందపాటి కార్పెట్‌ పరచుకోవడం, గదిలోని వెచ్చదనం బయటికి పోకుండా కిటికీలకు వెల్వెట్‌ లేదా మందపాటి కర్టెన్లు అమర్చుకోవడం, బయటి వేడి గదిలోకి రావడానికి వీలుగా లేయర్డ్ కర్టెన్లు ఉపయోగించడం, చెక్క ఫర్నిచర్‌ (టేబుల్‌/కుర్చీ మొదలైనవి) వాడడం.. వల్ల గదిలో వెచ్చదనాన్ని నింపుకోవచ్చు. అలాగే గదినీ ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

పచ్చదనం.. వెచ్చదనం!

పచ్చపచ్చటి మొక్కలు మన మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. అందుకే పని ప్రదేశంలో ఇండోర్‌ మొక్కల్ని ఏర్పాటు చేసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. అయితే ఈ చలికాలంలో వీటి వల్ల గదిలో చలి పెరిగిపోతుందేమో అనుకుంటారు చాలామంది. ఇది నిజమే అయినా.. వెచ్చదనాన్ని పంచే మొక్కలు కూడా కొన్నున్నాయంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. క్రిస్మస్‌ కాక్టస్‌, ఆర్చిడ్‌, పోల్కా డాట్‌ ప్లాంట్‌, డైసీ పుష్పాలు.. వంటి ఇండోర్‌ మొక్కల్ని పని ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటే అటు వెచ్చదనాన్ని ఆస్వాదించచ్చు. ఇటు వాటి రంగులతో మనసునూ ఉత్తేజపరచుకోవచ్చు.

ఒత్తిడి మాయం!

కొన్ని రకాల సువాసనలు మనసులోని ఒత్తిళ్లు, ఆందోళనల్ని మాయం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో చాలామంది రూమ్‌ ఫ్రెష్‌నర్స్‌, ఇతర పరిమళాల్ని ఆయా గదుల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వీటితో పాటు సెంటెడ్‌ క్యాండిల్స్‌కి కూడా పని ప్రదేశంలో చోటిస్తే.. ఇటు పరిమళాల్నీ ఆస్వాదించచ్చు.. అటు క్యాండిల్‌ వేడికి గదిలో వెచ్చదనాన్నీ నింపుకోవచ్చు.

వీటితో పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచేలా ఆహారంలో సైతం మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హెర్బల్‌ టీలు, ఓట్స్‌, చిలగడదుంప, అరటిపండు.. వంటివి తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే ఉన్ని దుస్తులు/మందపాటి దుస్తులు ధరించడం వల్ల కూడా చలి నుంచి రక్షణ పొందచ్చు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని