Published : 31/01/2023 16:42 IST

40 దాటాక పిల్లల్ని కనాలనుకుంటే..!

కెరీర్‌, సంతాన సమస్యలు, సరైన ప్రణాళిక లేకపోవడం.. ఇలా కారణమేదైనా కొంతమంది మహిళలు ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తూ వస్తున్నారు. మరికొంతమంది ముందస్తు ప్రణాళికతో ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతిలో (అండాల్ని శీతలీకరించే పద్ధతి) తమకు కావాల్సినప్పుడు బిడ్డను కంటున్నారు. ఏదేమైనా లేటు వయసులో గర్భధారణ అంటే కష్టమేనంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నలభై ఏళ్లు దాటిన మహిళలకు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువని, ఒకవేళ పుట్టినా వాళ్లలో వివిధ శారీరక లోపాలు తలెత్తే ప్రమాదమే ఎక్కువని చెబుతున్నారు. మరి, నలభైల్లో పిల్లల్ని కంటే ఎలాంటి సమస్యలొస్తాయి? ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

సాధారణంగా ఆడవారిలో వయసు పెరుగుతున్న కొద్దీ అండాల నిల్వ తగ్గిపోతుంటుంది. ఇక 30 దాటిన వారిలో ఈ క్షీణత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.  దీంతో పాటు గర్భాశయంలో ఉన్న అండాలు కూడా నాణ్యతను కోల్పోతుంటాయి. అదే నలభై దాటిన మహిళల గర్భాశయంలో ఉండే అండాల్లో సగానికి సగం జన్యుపరంగా అసాధారణమైనవే అంటున్నారు. కాబట్టి ఈ సమయంలో గర్భం ధరించడం వల్ల పిల్లల్లో జన్యుపరమైన లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు.

ఎలాంటి సమస్యలొస్తాయి?

నలభై దాటాక నెల తప్పితే తల్లీబిడ్డలిద్దరిలో పలు రకాల సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

ఎంత ఆలస్యంగా గర్భం ధరిస్తే అబార్షన్ల ముప్పు అంతగా పెరుగుతుందట! ఈ క్రమంలో 45 దాటిన వారిలో ఈ ముప్పు 90 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని, అదే 35-45 ఏళ్ల మధ్య ప్రెగ్నెన్సీ వస్తే 25 శాతం, 30 ఏళ్లలోపు గర్భవతుల్లో 12 శాతం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

లేటు వయసులో ఏర్పడిన పిండం గర్భాశయం బయట పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. దీన్నే ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అంటారు. దీనివల్ల వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు, ఫాలోపియన్‌ ట్యూబుల్లో సమస్యలు, అసాధారణ రక్తస్రావం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి.. వంటి సమస్యలు తలెత్తుతాయి.

40 దాటిన గర్భిణుల్లో జెస్టేషనల్‌ డయాబెటిస్‌ (గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే మధుమేహం) బారిన పడే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. తద్వారా గర్భస్థ సమయంలో, డెలివరీ సమయంలో తల్లీబిడ్డలిద్దరికీ పలు సమస్యలొస్తాయంటున్నారు.

40, ఆపైన గర్భం ధరించిన మహిళలకు హైపర్‌టెన్షన్‌ ముప్పూ ఉంటుందట! దీనివల్ల కిడ్నీలు పాడయ్యే ప్రమాదం అధికంగా ఉంటుందట! అంతేకాదు.. ఒక్కోసారి, ఈ సమస్య ఇటు తల్లికి, అటు గర్భంలోని బిడ్డకూ ప్రాణాంతకం కూడా కావచ్చట!

కొంతమంది మహిళల్లో మధుమేహం, హైపర్‌టెన్షన్‌, గుండె సంబంధిత సమస్యలు ఉండచ్చు. అలాంటి వారు లేటు వయసులో గర్భం ధరించడం వల్ల హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ జోన్‌లో నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాల్సి రావచ్చు. అలాగే వీరిలో చాలా వరకు నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే అవకాశాలున్నాయి. తద్వారా పిల్లల్లో అవయవ లోపాలుండడం, డౌన్‌ సిండ్రోమ్‌ సమస్య వంటివి తలెత్తుతాయి.

ఆలస్యంగా గర్భం ధరించిన కొంతమంది మహిళల్లో రక్తపోటు తగ్గిపోయి అధికంగా రక్తస్రావం కూడా కావచ్చంటున్నారు నిపుణులు. మరికొంతమందిలో వికారం, వాంతులు తీవ్రస్థాయిలో ఉంటాయట!

వేరే ఆప్షన్‌ లేకపోతే..!

కెరీర్‌, సంతాన సమస్యలు, ఇతర కారణాల రీత్యా ఆలస్యంగా బిడ్డను కనాలనుకునే మహిళల శాతం నానాటికీ పెరిగిపోతోంది. తద్వారా వయసు పెరిగే కొద్దీ బిడ్డను కనాలనుకున్నా ఆ అదృష్టం అందరినీ వరించట్లేదు. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన మహిళలు ఆరు నెలల పాటు సహజంగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించి.. సక్సెస్‌ కాకపోతే వెంటనే ఫెర్టిలిటీ నిపుణుల్ని సంప్రదించడం మంచిదట! ఈ క్రమంలో అండాల సంఖ్య, వాటి ఆరోగ్యం, గర్భాశయం పనితీరు, ఇతర అనారోగ్యాలు.. వంటివన్నీ పరిశీలించి తగిన చికిత్స అందిస్తారు. ఇందులో భాగంగా..

మీలో ఇతర సమస్యలేవీ లేకపోతే అండాలు విడుదలయ్యేందుకు మందులిస్తారు.

ఒకవేళ అండాలు విడుదలవడంలోనే సమస్యలున్న మహిళలకు ఐవీఎఫ్‌ పద్ధతిని సూచిస్తారు. ఈ క్రమంలో దాత నుంచి సేకరించిన అండాల్ని, వీర్యకణాలతో ఫలదీకరించి.. తిరిగి గర్భంలో ప్రవేశపెడతారు. ఈ క్రమంలో ఏవైనా గర్భస్థ సమస్యలుంటే సరోగసీ విధానంలోనూ పిల్లల్ని కనచ్చు. అయితే ఈ పద్ధతి ద్వారా గర్భం ధరించే మహిళల్లో.. అది కూడా 40 ఏళ్లు దాటిన వారిలో సక్సెస్‌ రేటు కేవలం 11 శాతం మాత్రమే ఉంటుందట!

స్పెర్మ్‌ను గర్భాశయంలో ప్రవేశపెట్టే పద్ధతిని ఐయూఐ అంటారు. పురుషుల్లో సంతాన సమస్యలున్నప్పుడు ఇలాంటి పద్ధతిని పాటిస్తారంటున్నారు నిపుణులు.

ఒకవేళ మరో అవకాశం లేదు.. ఆలస్యంగానే పిల్లల్ని కనాలి అని ముందే నిర్ణయించుకుంటే.. ముందుగానే మీ డాక్టర్‌తో మాట్లాడి ఎగ్‌ ఫ్రీజింగ్‌ (అండాల్ని శీతలీకరించే పద్ధతి) చేసుకోవచ్చు. తద్వారా ఆరోగ్యవంతమైన అండాలతో కాస్త ఆలస్యంగానైనా అమ్మవ్వచ్చు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

వయసు పెరిగే కొద్దీ మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలు పురుషుల్లోనే కాదు.. మహిళల్లోనూ వస్తుంటాయి. ఆలస్యంగా గర్భం ధరించే మహిళల్లో ప్రెగ్నెన్సీ సమస్యలు రావడానికి ఇవీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ముందు నుంచే జాగ్రత్తపడమని సూచిస్తున్నారు. ఈ క్రమంలో చక్కటి పోషకాహారం, వ్యాయామాలు దోహదం చేస్తాయి. అలాగే వయసును బట్టి నిర్ణీత వ్యవధుల్లో హెల్త్‌ చెకప్స్‌ చేయించుకోవడమూ ముఖ్యమే. వీటితో పాటు లేటు వయసులో గర్భం ధరించాలనుకున్న మహిళలు ముందుగా ఓసారి నిపుణుల వద్ద కౌన్సెలింగ్ తీసుకొని.. ఆపై వారి సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రెగ్నెన్సీని ప్లాన్‌ చేసుకుంటే గర్భస్థ సమస్యలు వచ్చే అవకాశం కొంతవరకు తగ్గచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని