నెలసరిలో యోగా.. మంచిదా? కాదా?

నెలసరిలో ఏ పనీ చేయాలనిపించదు. శారీరక నొప్పులు, మానసిక ప్రశాంతత కోల్పోయి చిన్న విషయానికే చిరాకు పడుతుంటాం. ఇక ఇలాంటి సమయంలో వ్యాయామాల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుంటారు మహిళలు. ఎందుకని అడిగితే.. పిరియడ్స్‌లో ఎక్సర్సైజ్‌ చేయడం....

Published : 24 Jun 2023 12:33 IST

నెలసరిలో ఏ పనీ చేయాలనిపించదు. శారీరక నొప్పులు, మానసిక ప్రశాంతత కోల్పోయి చిన్న విషయానికే చిరాకు పడుతుంటాం. ఇక ఇలాంటి సమయంలో వ్యాయామాల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుంటారు మహిళలు. ఎందుకని అడిగితే.. పిరియడ్స్‌లో ఎక్సర్సైజ్‌ చేయడం వల్ల బ్లీడింగ్‌, నెలసరి నొప్పులు ఎక్కువవుతాయని చెబుతుంటారు. నిజానికి ఇవన్నీ అపోహలే అని చెప్పే ప్రయత్నం చేసింది స్టార్‌ డాటర్‌ అన్షులా కపూర్. సెలబ్రిటీ యోగా ట్రైనర్‌ అనుష్కా పర్వానీతో కలిసి ‘నెలసరి సమయంలో యోగా చేయడం’పై చాలామందిలో ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేసిందామె. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఇటీవలే పంచుకున్న ఈ చిట్కాలు ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నాయి.

అన్షులా కపూర్‌.. తన స్ఫూర్తిదాయక పోస్టులతో సోషల్‌ మీడియాలో స్టార్‌ స్టేటస్‌ని సంపాదించుకుంది. మహిళలకు సంబంధించిన అంశాలు, ఆరోగ్య సమస్యలపై స్పందిస్తూ.. వాటిపై వీడియోలు రూపొందిస్తూ మహిళల్లో ఆయా అంశాలపై చైతన్యం కలిగిస్తుంటుందీ స్టార్‌ కిడ్‌. ఈ క్రమంలోనే తన పిరియడ్‌ అనుభవాలు, పీసీఓఎస్‌, అధిక బరువు.. వంటి సమస్యల గురించీ నిర్మొహమాటంగా పంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ‘నెలసరిలో యోగా’ అనే మరో అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చింది.

అపోహలు-వాస్తవాలు!

ఈసారి సెలబ్రిటీ యోగా ట్రైనర్‌ అనుష్కతో కలిసి నెలసరిలో యోగాపై చాలామందిలో ఉన్న అపోహల్ని, సందేహాల్ని తొలగించే ప్రయత్నం చేసింది అన్షుల. ఇందులో భాగంగానే.. అన్షుల ప్రశ్నలడుగుతుంటే.. అనుష్క వాటికి సమాధానాలిచ్చింది. ఆపై ఇద్దరూ కలిసి పిరియడ్స్‌లో యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్ని పంచుకుంటూ.. మహిళలందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో రూపొందించిన వీడియోను అన్షుల తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేసింది. వీరి సంభాషణలో భాగంగా..

అన్షుల : నెలసరి సమయంలో మహిళలు యోగా చేయకూడదా?

అనుష్క : ఇది పూర్తిగా అపోహే! ఎందుకంటే పిరియడ్స్‌ సమయంలోనూ సాధారణ రోజుల్లాగే మహిళలు యోగా చేయచ్చు. శరీరం సహకరించినంత వరకు ఆయా యోగాసనాల్ని సాధన చేయచ్చు. ఒకవేళ శరీరానికి అసౌకర్యంగా అనిపిస్తే కొన్ని కఠినమైన ఆసనాలకు దూరంగా ఉండాలి. అంతేకానీ.. నెలసరి సమయంలో యోగా పూర్తిగా మానేయాలనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

పిరియడ్స్‌ సమయంలో శరీరాన్ని మెలితిప్పుతూ చేసే ఆసనాలు సాధన చేయచ్చా?

నెలసరి సమయంలో యోగాసనాలు ఎంతో ప్రయోజనకరం! ఎందుకంటే యోగా చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్లు. నెలసరి నొప్పుల్ని తగ్గించి.. మానసిక ప్రశాంతతను అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఈ క్రమంలో శరీరం డీటాక్స్‌ అవుతుంది. ముఖ్యంగా బాలాసనం, అధో ముఖ స్వనాసనం, విపరిత కరణి ఆసనం.. వంటివి మేలు చేస్తాయి.

నెలసరి సమయంలో యోగా చేస్తే.. రుతుచక్రంపై ప్రభావం పడుతుందా?

నెలసరి సమయంలో యోగా సాధన చేస్తే.. రుతుచక్రంపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. తద్వారా అధిక రక్తస్రావం అవుతుందని, ఎక్కువ రోజుల పాటు నెలసరి కొనసాగుతుందని చాలామంది భయపడుతుంటారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమే! ఒక్కమాటలో చెప్పాలంటే.. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల హార్మోన్ల స్థాయులు అదుపులోకొచ్చి.. నెలసరి సమస్యలు దూరమవుతాయి. అలాగే పిరియడ్స్‌ కూడా నెలనెలా సరైన సమయానికి వస్తాయి.

నెలసరి నొప్పులు దూరం!

ఈ విధంగా నెలసరి సమయంలో యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!

నెలసరి నొప్పులు, కడుపుబ్బరం, వెన్ను నొప్పి.. వంటివి దూరమవుతాయి.

శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి.. తద్వారా మానసిక ప్రశాంతత సొంతమవుతుంది.

ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌, రక్తస్రావంలో హెచ్చుతగ్గులు.. వంటి నెలసరి సమస్యలకు యోగా పరిష్కారం చూపుతుంది.

యోగా శరీరంలో హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా నెలసరి సమయంలో పలు సమస్యలు దూరమవడంతో పాటు స్థూలకాయం, పీసీఓఎస్.. వంటి దీర్ఘకాలిక సమస్యలు అదుపులోకొస్తాయి.

నెలసరి సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల నీరసం, అలసట.. వంటి సమస్యలొస్తాయి. వీటికీ యోగానే విరుగుడు!

యోగా మానసిక ప్రశాంతతను అందించి సుఖనిద్రకు ప్రేరేపిస్తుంది. తద్వారా నిద్ర సమస్యలు కూడా దూరమవుతాయి.

నెలసరి సమయంలో యోగాసనాలు సాధన చేసే వారు.. సుప్తబద్ధ కోణాసనం, సేతు బంధ సర్వాంగాసనం, పశ్చిమోత్తనాసనం, బద్ధ కోణాసనం.. వంటివి ఎంచుకోవచ్చు. తద్వారా నెలసరి సమస్యల్ని తగ్గించుకొని.. ఆయా ప్రయోజనాల్ని పొందచ్చు.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నెలసరి సమయంలో యోగా చేయడం మంచిదే అయినా.. శారీరక సౌకర్యాన్ని బట్టి తేలికపాటి ఆసనాలు ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

అలాగే ఈ సమయంలో మనం ధరించే దుస్తులూ కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా దుస్తులు మరీ బిగుతుగా ఉండకుండా, పొత్తి కడుపుపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.

నెలసరి సమయంలో యోగా చేస్తున్నప్పుడు దుస్తులపై బ్లీడింగ్‌ మరకలు పడకుండా జాగ్రత్తపడడమూ ముఖ్యమే! ఈ సమయంలో ట్యాంపన్లకు బదులు శ్యానిటరీ న్యాప్‌కిన్లు, మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ ఎంచుకుంటే ఈ భయం ఉండదంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని