Published : 28/02/2022 20:30 IST

Ukraine Crisis: గరిట పట్టిన చేతులతో గన్ను పట్టి..!

(Photo: Instagram)

రాజ్యాల్ని కాపాడుకోవడానికి యుద్ధాలు చేసిన రాణుల్ని చూశాం.. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి శత్రువుతో పోరాటానికి దిగిన వీరనారుల గురించి విన్నాం.. తామూ వారికేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఉక్రెయిన్‌ మహిళలు. తమ దేశంపై విరుచుకు పడుతోన్న రష్యా సైన్యాల్ని నిలువరించేందుకు గరిట పట్టిన చేతులతో తుపాకీ పట్టి ఎదురు నిలవడానికి సిద్ధమవుతున్నారు. మొన్న ఉక్రెయిన్‌ ఎంపీ కైరా రుదిక్‌, నేడు మిస్‌ ఉక్రెయిన్‌ అనస్టాసియా లెన్నాతో పాటు సామాన్య మహిళలు కూడా కత్తి పట్టి కదనరంగంలోకి దూకడానికి సన్నద్ధమవుతున్నారు. మాతృభూమిపై మమకారాన్ని చాటుకుంటున్నారు. అదే సమయంలో తమలోని వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

యుద్ధభూమిలో అందాల తార!

తమ స్థాయి, స్థితిగతులతో సంబంధం లేకుండా ఒక్కొక్కరుగా యుద్ధభూమిలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు ఉక్రెయిన్‌ మహిళలు. మిస్‌ ఉక్రెయిన్‌ కిరీటం గెలిచిన అనస్టాసియా లెన్నా కూడా తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయింది. యుద్ధం మొదలైనప్పట్నుంచే.. దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంటోన్న ఈ అందాల తార.. తాను సైతం రణరంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. మిలిటరీ యూనిఫాం ధరించి, చేతిలో గన్‌ పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన లెన్నా.. తమ దేశానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతోంది. మరోవైపు ఉక్రెయిన్‌ సైనిక బలగాల కోసం నిధులు కూడా సేకరిస్తోంది.


నా రక్తంలోనే ఉంది!

కీవ్‌లోని స్టావిస్టిక్‌ యూనివర్సిటీ నుంచి ‘మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌’ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ.. టర్కీ, అంకారా, ఇస్తాంబుల్‌.. వంటి నగరాల్లో పీఆర్‌ మేనేజర్‌గా పని చేసింది. మరి కొన్నాళ్లు ట్రాన్స్‌లేటర్‌గానూ పనిచేసిన లెన్నాకు ఐదు భాషలపై పట్టుందట! ప్రస్తుతం నటన, మోడలింగ్‌ రంగాల్లో రాణిస్తోన్న లెన్నా.. 2015లో ‘మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌’ అందాల పోటీల్లో ఉక్రెయిన్‌ తరఫున పాల్గొంది. అయితే శత్రువులతో పోరాడే నైజం తన రక్తంలోనే ఉందంటోందీ బ్యూటీ క్వీన్‌. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తమ పూర్వీకులు రష్యాకు మద్దతుగా నాజీ జర్మనీతో పోరాడారని.. అయితే ఇప్పుడు అదే రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి రావడం విచారకరం అంటోందీ ఉక్రెయిన్‌ అందం.


ఆయుధం చేతబట్టి..

యుద్ధవిద్యలు తెలియకపోయినా నేర్చుకొని మరీ యుద్ధభూమిలోకి దూకుతానంటోంది ఉక్రెయిన్‌ మహిళా ఎంపీ కైరా రుదిక్‌. తాను గన్‌ పట్టుకున్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమె.. ‘Kalashnikov (ఇదొక రైఫిల్‌) ఉపయోగించడం నేర్చుకొని మరీ యుద్ధరంగంలోకి దిగబోతున్నా. మాతృభూమి రక్షణ కోసం పురుషులతో పాటు మహిళలూ పోరాటం చేస్తున్నారు..’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది. టెక్నాలజీ రంగంలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఉక్రెయిన్‌, యూఎస్‌లోని పలు కంపెనీల్లో ఐటీ ఉద్యోగిగా పని చేశారు. ఆపై అమెజాన్‌కు చెందిన Ring LLC (ఉక్రెయిన్‌ శాఖ)లో ఛీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌గా, సీఓఓగా విధులు నిర్వర్తించిన ఆమె.. 2019లో ఉక్రెయిన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో పాల్గొని వాయిస్‌ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మరుసటి ఏడాది పార్టీ లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పార్టీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న కైరా.. మరోవైపు జంతు హక్కుల కార్యకర్తగానూ కొనసాగుతున్నారు. ‘ఆయుధం చేతబూని దీని వాడకమెలాగో తెలుసుకుంటుంటే ఎంతో శక్తిమంతంగా అనిపిస్తోంది.. నా దేశాన్ని నేను కాపాడుకోగలనన్న నమ్మకం పెరుగుతోంది..’ అని నిండైన ఆత్మవిశ్వాసంతో చెబుతోంది కైరా.


ఇంకా బతికే ఉన్నా!

మరోవైపు యుద్ధభూమిలో ఉన్న మహిళా సైనికులు కూడా రష్యాతో అలుపు లేకుండా పోరాటం చేస్తున్నారు. ఇందుకు ప్రతిగానే ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మిలిటరీ దుస్తుల్లో, ఆయుధాలతో ఉన్న ఓ మహిళా సైనికురాలు.. ‘నేనింకా బతికే ఉన్నా.. సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు.. పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి అంతా బాగుంది.. ఉక్రెయిన్‌ని కాపాడుకుంటా..’ అని చెబుతోన్న ఓ షార్ట్‌ వీడియో ఉక్రెయిన్‌ మహిళా సైనికుల ధైర్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది. దీంతో చాలా మంది ఆమె క్షేమాన్ని కాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ యుద్ధంలో సుమారు 36 వేలకు పైగా మహిళా సైనికులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.


మా పురిటి గడ్డపై మీకేం పని?!

ఇలా సెలబ్రిటీలు, మహిళా సైనికులే కాదు.. పలువురు సాధారణ మహిళలు కూడా యుద్ధంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్నారు. ధైర్యంగా రోడ్ల పైకి వస్తూ శత్రు సైన్యాలను వెళ్లిపోవాలంటూ దీటుగా బదులిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఉక్రెయిన్‌ వీధుల గుండా వెళ్తోన్న ఓ మహిళ.. అక్కడ పహారా కాస్తోన్న ఓ సైనికుడిని చూసింది. భారీ ఆయుధాలు కలిగి ఉన్న అతడు రష్యన్‌ సైనికుడని అర్థం చేసుకున్న ఆమె.. అతడి దగ్గరికెళ్లి.. ‘మీరు ఇక్కడేం చేస్తున్నారు?’ అంటూ ఆరా తీసే ప్రయత్నం చేసింది. అతడు వెళ్లిపోమని వాదించినా.. వెరవకుండా ‘మీరు ఆక్రమణదారులు, మీరు నియంతృత్వవాదులు, ఇలాంటి ఆయుధాలను పట్టుకొని మా పురిటి గడ్డ మీద ఏం చేస్తున్నారు? ఈ విత్తనాలు తీసుకొని జేబులో వేసుకో.. నేలకొరిగిన తర్వాత కనీసం పొద్దుతిరుగుడు (ఉక్రెయిన్‌ జాతీయ పుష్పం) పువ్వులైనా పూస్తాయ్‌..’ అంటూ రష్యన్‌ సైనికుడితో మాటల యుద్ధం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెబుతూ ఎంతోమంది ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘మా మద్దతు మీకే.. మీ వెంట మేమున్నాం..’ అంటూ కామెంట్లు షేర్‌ చేస్తున్నారు.

ఇలా మాతృదేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి, అనుబంధాలను పక్కన పెట్టి పోరాటానికి దిగుతున్నారు ఉక్రెయిన్‌ మహిళలు. అంతులేని తెగువ, పోరాట పటిమను ప్రదర్శిస్తూ మహిళా శక్తిని చాటుతున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని